Thursday, March 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహద్దులు దాటారు

హద్దులు దాటారు

- Advertisement -

– ఇరాన్‌పై యుద్ధం విషయంలో అమెరికన్ల అభిప్రాయం
– సైనిక చర్యలు అతిగా జరిగాయని ఆందోళన
– పెరుగుతున్న ఇంధన ధరల పైనా తీవ్ర అసంతృప్తి
– అధ్యక్షుడు ట్రంప్‌ చర్యల పట్ల వ్యతిరేకత
– ఏపీ-ఎన్‌ఓఆర్‌సీ సర్వేలో అభిప్రాయాలు వెల్లడి

వాషింగ్టన్‌ : పశ్చిమాసియాలో ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా, ఇజ్రాయిల్‌లు రేపిన అలజడి ప్రపంచంలో తీవ్ర అనిశ్చితిని నెలకొల్పింది. అమెరికా యుద్ధోన్మాదం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో పాటు అమెరికన్లలోనూ తీవ్ర ఆగ్రహం, అసంతృప్తిని కలిగిస్తోంది. ది అసోసియేటెడ్‌ ప్రెస్‌(ఏపీ)- ఎన్‌ఓఆర్‌సీ సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ రీసెర్చ్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేను ఈనెల 19-23 మధ్య నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న చాలా మంది అమెరికన్లు ఇరాన్‌పై సైనిక చర్యలు అతిగా జరిగాయని భావిస్తున్నారు. అదే సమయంలో పెరుగుతున్న ఇంధన ధరల పైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పెట్రోల్‌ ధరలను భరించడం కష్టమవుతుందనే భయం వారిలో పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వం పైనా వారిలో విశ్వాసం కనబడటం లేదు.
తాజా సర్వే ప్రకారం.. సుమారు 59 శాతం మంది అమెరికన్లు ఇరాన్‌పై సైనిక చర్యలు అతిగా జరిగాయని అభిప్రాయపడ్డారు. ఇంధన ధరల పెరుగుదలపై ప్రజల్లో ఆందోళన గణనీయంగా పెరిగింది. సుమారు 45 శాతం మంది అమెరికన్లు వచ్చే కొన్ని నెలల్లో పెట్రోల్‌ ఖర్చులను భరించడం కష్టమవుతుందని అత్యంత ఆందోళనను వెలిబుచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ మళ్లీ ఎన్నికైన తర్వాత జరిగిన సర్వేతో పోలిస్తే ఇది పెరుగుదలను నమోదు చేయటం గమనార్హం.
దేశంలో (అమెరికాలో) చమురు, గ్యాస్‌ ధరలు పెరగకుండా చూడటమూ ముఖ్యమేనని అంటున్నారు. ఇక గత సర్వేతో పోలిస్తే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌నకు ప్రజల్లో మద్దతు పెద్దగా ఏమీ పెరగలేదు. ట్రంప్‌ యంత్రాంగం తీసుకుంటున్న కఠిన చర్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, ఇరాన్‌లో అమెరికా సైనిక చర్యలు తీవ్రమయ్యాయనే ఆందోళనను వారు వెలిబుచ్చుతున్నారు. అయితే అమెరికన్లలో ఈ భావన వైట్‌హౌస్‌కు సవాలుగా మారుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.

ట్రంప్‌పై పెరుగుతున్న ఒత్తిడి
యుద్ధంపై ప్రపంచంతో పాటు అమెరికన్లలోనూ తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంపై రాజకీయ ఒత్తిడి పెరుగుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. పది మంది అమెరికన్లలో నలుగురు మాత్రమే ట్రంప్‌ పనితీరును సమర్థిస్తున్నారు. ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్న ట్రంప్‌.. పూటకో మాట మాట్లాడుతున్న విషయం విదితమే. ఒకవైపు యుద్ధం తీవ్రత పెంచే హెచ్చరికలు ఇస్తూనే, మరోవైపు చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావచ్చని సూచిస్తున్నారు. ఇది అమెరికన్లలోనూ గందరగోళాన్ని సృష్టిస్తోంది. దీంతో విదేశాల్లో సైనిక శక్తి వినియోగంపై ట్రంప్‌ సరైన నిర్ణయాలు తీసుకుంటారా అన్న విషయంలోనూ అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. సైన్యాన్ని పంపించడం వంటి మరింత దూకుడు చర్యలను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.

ఇంధన ధరలపై ప్రాధాన్యత
ఇంధన ధరలు పెరగకుండా చూడడం అమెరికాలోని రెండు ప్రధాన పార్టీల ప్రజలకు ఒకే లక్ష్యంగా కనబడుతున్నది. రిపబ్లికన్లలో ప్రతి నలుగురిలో ముగ్గురు, డెమోక్రాట్లలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ విషయాన్ని అత్యంత ముఖ్యంగా భావిస్తున్నారు. అయితే ఆందోళన స్థాయిలో తేడా కనిపిస్తోంది. రిపబ్లికన్లలో ప్రతి పది మందిలో ముగ్గురు మాత్రమే తీవ్రంగా ఆందోళన చెందుతుండగా.. డెమోక్రాట్లలో ప్రతి పది మందిలో ఆరుగురు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
ఇక ఇరాన్‌ అణ్వాయుధాల అంశంపై రిపబ్లికన్లలో ప్రతి పది మందిలో ఎనిమిది మంది దీనిని ముఖ్యంగా భావిస్తున్నారు. డెమోక్రాట్లలో సుమారు సగం మంది మాత్రమే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయిల్‌ను ముప్పు నుంచి రక్షించే విషయాన్ని ప్రతి పది మంది అమెరికన్లలో నలుగురు మాత్రమే అత్యంత ప్రాధాన్యంగా చూస్తున్నారు. ఇరాన్‌ ప్రభుత్వాన్ని మార్చడం విషయానికొస్తే… పది మందిలో ముగ్గురు మాత్రమే దీనిని ముఖ్యంగా భావిస్తున్నారు.

అమెరికా చర్యలపై అభిప్రాయం
అమెరికా చర్యలు హద్దులు దాటాయంటూ 50 శాతానికి పైగా డెమోక్రాట్లు, ఇండిపెండెంట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డెమోక్రాట్లలో పది మందిలో తొమ్మిది మంది, ఇండిపెండెంట్లలో పది మందిలో ఆరుగురు ఈ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఇక రిపబ్లికన్లలో ప్రతి నలుగురిలో ఒకరు ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇక ఇరాన్‌పై సైన్యాన్ని పంపడాన్ని సుమారు పది మందిలో ఆరుగురు అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. డెమోక్రాట్లలో ఇది ప్రతి పది మందిలో ఎనిమిది మందికి చేరింది. రిపబ్లికన్లలో దాదాపు సగం మంది ఇదే భావనతో ఉన్నారు.

ట్రంప్‌పై నమ్మకం
డోనాల్డ్‌ ట్రంప్‌పై అమెరికన్లలో నమ్మకం సన్నగిల్లింది. సుమారు సగం మంది అమెరికన్లు విదేశాల్లో సైనిక శక్తి వినియోగం విషయంలో ట్రంప్‌పై ‘చాలా తక్కువ’ లేదా ‘ఏ మాత్రమూ’ నమ్మకం లేదని చెప్పారు. ట్రంప్‌ విదేశాంగ విధానంపై సుమారు 34 శాతం మంది, ఇరాన్‌ విషయంలో సుమారు 35 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -