Friday, March 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధాన్ని ఆపేస్తారేమో!

యుద్ధాన్ని ఆపేస్తారేమో!

- Advertisement -

ట్రంప్‌పై ఇజ్రాయిల్‌ అనుమానం
ఇరాన్‌ లక్ష్యాలపై ముమ్మర దాడులకు నిర్ణయం

టెల్‌ అవీవ్‌ : యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ఆకస్మిక నిర్ణయం తీసుకుంటారేమోనని ఇజ్రాయిల్‌ అనుమానిస్తోంది. పోరును ఆపేందుకు ఇజ్రాయిల్‌ ఏ మాత్రం సుముఖంగా లేదన్న విషయం తెలిసిందే. అందుకే ట్రంప్‌ నిర్ణయం వెలువడే లోగానే సాధ్యమైనంత వరకూ ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేయాలని అది భావిస్తోంది. అందులో భాగంగా అధిక ప్రాధాన్యత కలిగిన లక్ష్యాలను ఎంచుకుంటోందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక తెలిపింది. దౌత్య యత్నాలు ఫలించి, యుద్ధం ముగిసే లోగా సైనిక ప్రయోజనాలను గరిష్ట స్థాయిలో పొందాలని ఇజ్రాయిల్‌ నాయకత్వం అనుకుంటోందని సీనియర్‌ అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక వివరించింది. సైనిక చర్యలను ముమ్మరం చేయాలని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ట్రంప్‌ ప్రభుత్వం రూపొందించిన పదిహేను సూత్రాల కాల్పుల విరమణ ప్రతిపాదన ఇజ్రాయిల్‌ను కలవరపెడుతోంది.

ఇరాన్‌ అణు కార్యక్రమం, బాలిస్టిక్‌ క్షిపణి సామర్ధ్యం వంటి భద్రతా సంబంధమైన కీలక అంశాలను ఈ ప్రతిపాదన సరిగా పట్టించుకోలేదని ఇజ్రాయిల్‌ అభిప్రాయపడుతోంది. ట్రంప్‌ ఏ క్షణంలో అయినా శాంతి చర్చలను ప్రకటించవచ్చునని, ఆ లోగానే కీలక యుద్ధ లక్ష్యాలను సాధించాలని అధికారులు అనుకుంటున్నారు. ప్రధానంగా ఇజ్రాయిల్‌ మూడు లక్ష్యాలను నిర్దేశించుకుంది. అవి…ఇరాన్‌ వైపు నుంచి క్షిపణుల ముప్పు లేకుండా చూడడం, అణ్వాయుధాలను తయారు చేయకుండా ఇరాన్‌ను అడ్డుకోవడం, ఇరాన్‌లో అంతర్గత రాజకీయ ఒత్తిడులకు అనువైన వాతావరణాన్ని కల్పించడం. ఈ మూడు లక్ష్యాలను సాధించని పక్షంలో యుద్ధాన్ని ఆపలేమని నెతన్యాహూ పార్టీకి చెందిన సీనియర్‌ సభ్యుడొకరు తెలిపారు. ట్రంప్‌ ప్రభుత్వ ప్రతిపాదనలు ఇరాన్‌ సైనిక సామర్ధ్యాలను పూర్తిగా నిర్మూలించలేవని, కాబట్టి దీర్ఘకాలిక ముప్పు అలాగే ఉండిపోతుందని అధికారులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌పై విస్తృత పోరు కొనసాగుతోందని నెతన్యాహూ చెప్పారు. హెజ్బొల్లాను నిర్మూలించడానికే అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. దక్షిణ లెబనాన్‌లో ‘బఫర్‌ జోన్‌’ను ఏర్పాటు చేసి సైన్యాన్ని పెంచుతామని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -