‘బంగారు బొమ్మ రావేమే.. పందిట్లొ పెండ్లి జరిగేనే’ అని పాత సినిమాలో ఒక పాట. అందమైన ఆడపిల్లలను బంగారుబొమ్మలా ఉందని చెబుతాం. ఒక్కరూపం వర్ణించటానికే కాదు, మంచి మనసున్న వారినీ బంగారంలాంటి మనసున్నోడు అనీ అంటాం. అంతేకాదు విలువైన సంబంధాలనూ బంగారంతోనే పోలుస్తాం. రూపంలో మెరిసేది బంగారమే, దాని విలువలోనూ మెరిసేది బంగారమే. అంటే ఇక మనిషిని కానీ, స్థితిని కానీ, విలువని కానీ ఉన్నతమైనదిగా చెప్పాలన్నపుడు బంగారమే ఉపమానంగా గుర్తుకువస్తుంది. ప్రపంచంలో అందరికీ సంపద రూపంగా కూడా ఉన్నది బంగారమే. అన్నిటికన్నా స్థిరమైన ఆస్తి రూపమూ బంగారం. ఇది డబ్బుకు పర్యాయపదం. పూర్వం రాజుల కాలంలో బంగారు నాణాలే నేటి కరెన్సీలా వాడుకలో ఉండేవి. ఇలాంటి బంగారం కథ చాలా ఏండ్ల క్రితందే. ఇప్పుడు బంగారం మరింత ధగధగ మెరిసిపోతున్నది. దాని మెరుపులకు సామాన్యులు దాని దగ్గరకే పోలేకపోతున్నారు. మార్కెట్‌లో బంగారం ధర చుక్కలను దాటిపోయింది. పది గ్రాములు ఒక లక్షా ముప్పయి వేల రూపాయలకు ఎగబాకింది. దాని విలువను మరింత పెంచుకుంది. ఇది దాని నిజమైన విలువనా! లేక వ్యాపార మాయజాలపు పర్యవసానమా అనేది ఆర్థిక నిపుణులు తేల్చాలి.
ప్రపంచంలో అంతటికన్నా భారతీయులకు బంగారం అంటే తెగమోజు. సంపదకు, ఆస్తి పరత్వానికి చిహ్నంగా ప్రదర్శించడం గమనించవచ్చు. బంగారం లేకుండా పెండ్లి జరగటాన్ని ఇక్కడ మనం ఊహించలేము. బంగారాన్ని అలంకరణగా ఎక్కువగా వాడేది మహిళలే. ఇప్పుడు పురుషులు కూడా వాడుతున్నారు. అతి సామాన్యుల పెండ్లిలో కూడా, కనీసం తాళిబొట్టుకైనా బంగారం కావాల్సిందే. పెండ్లి మాత్రమే కాదు. ఆఖరుకు చనిపోయాక నోట్లో ఇంత బంగారం పెట్టే దహనం చేస్తారు. స్వర్ణం మీద మోహం సామాన్యమైనది కాదు. అందుకే, ‘కీర్తి, కాంత, కనకం’ వీటిపై మోహంతోనే యుద్ధాలు, రాజ్యాలు, కూలిపోవడాలు, మరణించడాలు అని వ్యవహారంలో అంటూ ఉంటారు. కనకమంటే ఇక్కడ డబ్బే. పదిహేడవ శతాబ్దాపు వేమన కూడా… ‘కులము గల్గువాడు, గోత్రంబు కలవాడు, విద్యచేత విర్రవీగువాడు, పసిడిగలుగు వాని బానిస కొడుకులు’ అని అన్నాడు. పసిడి ఏదయినా చేయగలదని దానర్థం. ఇక్కడా పసిడి అంటే ధనమే. పసిడి అందరినీ ఆకర్షిస్తుంది. దేవుళ్లను కూడా వదిలిపెట్టలేదు. హిందూ దేవతలను చూస్తే, అందరూ స్వర్ణకాంతులతో మెరుస్తుంటారు. ఒంటినిండా నగలే ఉంటాయి. పురుషదేవతలూ సమృద్ధిగా స్వర్ణాలంకారాలతోనే దర్శనమిస్తారు. ఇక సంపదలు, ధనం సమకూర్చి పెట్టేందుకు ఒక ప్రత్యేక దేవతయే కలదు.
రామాయణ కథలో వనవాసం చేస్తున్నప్పుడు, పర్ణశాల పరిసరాల్లో సీతకు బంగారు వర్ణంలో మెరిసిపోతున్న లేడిని చూసి, ఎంత అందంగా ఉందో అని, అది కావాలని రామున్ని కోరింది. ఆ కోర్కెనే రామునితో ఎడబాటుకు కారణమైంది. పసిడి వర్ణంపై మక్కువ అలాంటిది. ‘పట్టిందల్లా బంగారం’ కావాలని కోరుకోవడం ఎప్పుడో గ్రీకు పురాణాల కాలం నుండి ఉందని తెలుస్తుంది. కథలూ కనిపిస్తాయి. అయితే పన్నెండవ శతాబ్ధం నుండి ఉన్న సామెత. షెక్స్‌పియర్ -మార్చెంట్ ఆఫ్ వెన్నిస్‌లో వాడిన వాక్యం ‘మెరిసేదంతా బంగారం కాదు’ అని. అంటే మెరుస్తున్నట్టు కనపడేది, విలువైనదిగా అనిపించేది ప్రతిదీ బంగారం కాదని చెప్పడం. ఈ సామెత అన్నిటికీ వర్తిస్తుంది. ఇప్పటి రాజకీయాలకు మరీను. చాలామంది పైపై మెరుపులు మాటలు చూసి, విలువైన వారనీ, మంచివాడనీ మోసపోతుంటాం. బంగారమైతే గీటురాయిపై గీసి,అందులో స్వచ్ఛమెంతో చెప్పేయొచ్చు.
కానీ మనుషులు, రాజకీయ నాయకుల గురించి తెలియాలంటే చాలా సమయం పడుతుంది. అప్పుడే హెచ్చరించాడు బద్దెన…’కనకపు సింహాసనమున, శునకమును కూర్చుండబెట్టి శుభలగమునన్, దొనరగ పట్టముగట్టిన, వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ’ అనీ. కనకపు సింహాసనమంటే, ఇపుడు మన దేశానికి నాయకులుగా ఎవరినైతే ఎన్నుకుంటామో, వాళ్లు దేశంలోని సంపదను కాపాడే వారేనా? కాదా? సమర్థులా, కాదా! అని తెలుసుకోవాలి. బంగారం అసలైనదో కాదో తెలుసుకోలేకపోతే కొంతమాత్రమే నష్టపోతాం. కానీ దేశ సింహాసనంపై కూర్చోబెట్టే వాళ్లు కల్తీ అయితే దేశ సౌభాగ్యాన్నే కోల్పోతాం. అదలా ఉంచితే, బంగారం ఎంత స్వచ్ఛమైనదో తెలపటానికి మాత్రం మార్కెట్‌లో హాల్‌మార్క్ ఉంది.
కేడిఎం అంటున్నారు. వీటిల్లో కూడా 92 శాతమే అసలైన బంగారం. కొనేటప్పుడు అంతా బంగారమే, అమ్మేటప్పుడే మారిపోతుంటది. ఇంతకుముందు వినలేదు కానీ ఈ మధ్య బంగారం కొనేదానికి కూడా ఒక తిథిని ఏర్పాటు చేశారు. అదే అక్షర తృతీయ రోజు బంగారం కొంటే ఇక భాగ్యమే భాగ్యమని ప్రచారం పెంచేశారు. బంగారమంటే ప్రేమ సామాన్య ప్రజలకే కాదు, కవులకు, పండితులకు కూడా వల్లమాలిన ప్రేమ. రాజుల కాలంలో అయితే కనకాభిషేకాలు చేయించుకునేవారు. స్వర్ణ కంకణాలు తొడిగేవారు. గండపెండేరాలు తొడిగి వారి పాండిత్యాన్ని గుర్తించేవారు. ఇప్పుడది లేదనుకో. బంగారం చేరితే, ధరిస్తే మనిషికి విలువ పెరుగుతుందని అనుకుంటారు. ఎంత బంగారం ఉన్నా మనిషంత, మంచి మనసంత ఏదీ తూగలేదు. బంగారం లాంటి మనిషి ఉండొచ్చు, కానీ మనిషిలాంటి బంగారం ఉండదు.
స్వర్ణ పిపాస
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES