లేబర్ కోడ్స్ డ్రాఫ్ట్ రూల్స్‌ను నోటిఫై చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లకు సంబంధించి డ్రాఫ్ట్ రూల్స్‌ను నోటిఫై చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి వీటిని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ రూల్స్‌ను ప్రచురించింది. ఇది ఉమ్మడి జాబితాలోకి వచ్చే అంశం కావడంతో ఆయా రాష్ట్రాలు కూడా ఈ నిబంధనలను నోటిఫై చేయాల్సి ఉంటుంది. అలాగే వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన కోడ్‌ల ముసాయిదా నిబంధనలపై అభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, 2020కి 30 రోజులు, మిగిలిన మూడు కోడ్‌లకు 45 రోజులు గడువు ఇచ్చింది. గతంలో రాష్ట్రాలు డ్రాఫ్ట్ రూల్స్‌ను ప్రచురించినప్పటికీ.. కొన్ని నెలలు గడిచిపోయిన నేపథ్యంలో ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మరోసారి ముసాయిదా రూల్స్‌ను ప్రచురించాల్సి ఉంటుంది. కొత్త లేబర్ కోడ్‌లను నోటిఫై చేసే వరకు పాత చట్టాలు అమల్లో ఉంటాయి. ఈ కోడ్‌లలో వేజ్, అలవెన్స్, గ్రాట్యుటికీ సంబంధించిన నిబంధనలు పొందుపరిచారు.
కొత్త లేబర్ కోడ్‌లలో ‘వేజ్’ నిర్వచనం..
కొత్త లేబర్ కోడ్‌లలో ‘వేజ్’ అనే పదానికి నిర్వచనం ఇచ్చారు. ఇందులో బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్, రిటైనింగ్ అలవెన్సు ఉంటాయి. మిగిలినవి అలవెన్సు రూపంలో ఉంటాయి. ఉద్యోగికి చెల్లించే మొత్తం వేతనంలో అలవెన్సులు 50 శాతం మించకూడదు. అంటే ఇకపై తక్కువ బేసిక్ పే చూపించడానికి వీల్లేదు. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ (ఈఎస్‌ఓపీఎస్), వేరియబుల్ పే, రీయింబర్స్‌మెంట్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటివి 50 శాతం నిబంధన పరిధిలోకి రావు. వీటిని వేజెస్‌గా పరిగణించరు.
ఉదాహరణకు ఒక వ్యక్తి వేతనం రూ.70 వేలు అనుకుందాం. ప్రస్తుతం రూ.20 వేలు బేసిక్, డీఏ, మిగిలిన రూ.50వేలు అలవెన్సుల రూపంలో చెల్లిస్తున్నారనుకుందాం. అలవెన్సులపై 50 శాతం పరిమితి కారణంగా రూ.35వేలు వేతనంగా చెల్లించి.. మిగిలిన రూ.15వేలు వేజెస్‌లో కలపాలి. పనిచేసిన కాలానికి గానూ ఏడాదికి 15 రోజుల చొప్పున చివరి వేతనాన్ని గ్రాట్యుటీ కింద చెల్లించాలి. ఉద్యోగి రాజీనామా, తొలగింపు, రిటైర్మెంట్, ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ముగిసినప్పుడు ఈ గ్రాట్యుటీని చెల్లించాలి. ఉద్యోగి మరణించినప్పుడు, వైకల్యానికి గురైనప్పుడు, కాంట్రాక్ట్ ముగిసినప్పుడు ఐదేండ్లు పని చేసి ఉండాలన్న నిబంధన వర్తించదు. 2025 నవంబర్ 21 నుంచి గ్రాట్యుటీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
కార్మిక సంఘాల వ్యతిరేకత
నూతన లేబర్ కోడ్‌లతో కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం అంటోంది. మరోపక్క కార్మిక సంఘాలు పాత చట్టాల్లో ఉన్న హక్కులు, డిమాండ్ల కోసం ఉద్యమాలు చేపట్టి సాధించుకున్నామని పేర్కొంటున్నాయి. కార్మికుల హక్కులు, ప్రయోజనాలు కాలరాసేలా నూతన చట్టాలు ఉన్నాయని అంటున్నాయి. ఈ కార్మిక చట్టాలతో యాజమాన్యాలకే మేలు జరుగుతుందని తెలుపుతున్నాయి.



