ఆర్థిక వ్యవస్థలు, మనుషుల భవిష్యత్తుకు ప్రమాదం
ప్రభుత్వాలు, పరిశ్రమలు చర్యలు తీసుకోవాలి : యూఎన్ నివేదిక వెల్లడి
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో నిబంధనలు సడలింపు
పలు పర్యావరణ సూచీల్లో పడిపోయిన భారత్ ర్యాంకు
పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తల ఆందోళన
న్యూఢిల్లీ : వ్యాపారాలు ప్రకృతి, జీవవైవిధ్యం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, స్థిరత్వం, మానవ సంక్షేమానికి ముప్పు తెస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్‌ఫాం ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ (ఐపీబీఈఎస్) విడుదల చేసిన తాజా నివేదిక హెచ్చరించింది. ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు, పౌర సమాజం కలిసి చర్యలు తీసుకుంటే ఈ నష్టాన్ని తగ్గించవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ నివేదిక విడుదల నేపథ్యంలో భారత్‌లో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళనలు కలుగుతున్నాయి. మోడీ ప్రభుత్వం బడా వ్యాపారులు, పరిశ్రమల కోసం పని చేస్తున్నదనీ, దీంతో ప్రకృతి సంపదంతా నశించిపోతున్నదని పర్యావరణ, సామాజిక కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పలు పర్యావరణ సూచీల్లో భారత ర్యాంకు పడిపోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం కింద పని చేసే స్వతంత్ర సంస్థ ఐపీబీఈఎస్ ఈనెల 9న ఈ నివేదికను విడుదల చేసింది. వ్యాపారాల కార్యకలాపాలు ప్రకృతిని దెబ్బతీస్తూ ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదాన్ని సృష్టిస్తున్నాయి. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు వందకు పైగా చర్యలను ఇది సూచించింది. ఈ నివేదికకు ‘బిజినెస్ అండ్ బయోడైవర్సిటీ రిపోర్ట్’ అనే పేరు పెట్టారు. యూకేలోని మాంచెస్టర్‌లో జరిగిన ఐపీబీఈఎస్ 12వ సమావేశంలో 150కి పైగా దేశాల ప్రతినిధుల సమక్షంలో దీనికి ఆమోదం లభించింది. భారత్ తరఫున ప్రభుత్వ అధికారులు, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
ఈ నివేదిక తయారీలో 35 దేశాల నుంచి 79 మంది నిపుణులు, మూడు సంవత్సరాల పాటు పని చేశారు. వ్యాపారాలు ప్రకృతిపై కలిగించే ప్రభావాలను సమగ్రంగా విశ్లేషించిన తొలి నివేదిక ఇదే కావడం గమనార్హం. ఈ నివేదిక వ్యాపారాలతో ఎదురయ్యే ప్రమాదాలను, అలాగే ప్రకృతి సంరక్షణలో అవకాశాలను స్పష్టంగా చూపిస్తుందని ఈ నివేదిక తయారీలో పాలు పంచుకున్న మ్యాట్ జోన్స్ చెప్పారు. అనేక విధానాల గందరగోళాన్ని తొలగించి, సానుకూల మార్పునకు దారి తీసే మార్గాన్ని చూపుతుందని తెలిపారు. ”వ్యాపారాలు స్థిరమైన ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించవచ్చు, లేదంటే ప్రకృతితో పాటు తాము కూడా నశించే ప్రమాదం ఉంది” అని ఆయన హెచ్చరించారు.
ట్రిలియన్ డాలర్ల ప్రభావం
ప్రస్తుతం ‘బిజినెస్ యాజ్ యూజువల్’ విధానం జీవవైవిధ్య నష్టాన్ని వేగవంతం చేస్తోందని నివేదిక చెబుతోంది. 2023లో ప్రకృతికి నేరుగా హాని చేస్తూ నడిచే వ్యాపారాల ఆర్థిక ప్రవాహాలు సుమారు 7.3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అందులో 4.9 ట్రిలియన్ డాలర్లు ప్రయివేటు రంగం, 2.4 ట్రిలియన్ డాలర్లు పబ్లిక్ సబ్సిడీలు ఉండటం గమనార్హం. అయితే దీనికి పూర్తి విరుద్ధంగా అదే ఏడాది జీవవైవిధ్య పరిరక్షణకు ఖర్చయింది 220 బిలియన్ డాలర్లు మాత్రమే కావడం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెప్తున్నారు.
ఆర్థిక కార్యకలాపాల వల్ల కలిగే జీవవైవిధ్య నష్టం వ్యాపారాల భవిష్యత్తు, ప్రపంచానికి మప్పు అని నివేదిక హెచ్చరిస్తున్నది. ముఖ్యంగా స్థానిక సముదాయాలు, ఆదివాసీల ఆరోగ్యం, జీవన విధానాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుత పరిస్థితులు స్థిరమైన భవిష్యత్తుకు అనుకూలంగా లేవని నివేదిక హెచ్చరించింది. ప్రతీ వ్యాపారమూ ప్రకృతిపై ఆధారపడి ఉన్నదనీ, అయితే ఆ ప్రకృతే నష్టపోతే వ్యాపారాలే ప్రమాదంలో పడతాయని ఆర్థిక నిపుణుడు స్టీఫెన్ పోలాస్కీ అన్నారు. తాత్కాలిక లాభాల కోసం జీవవైవిధ్యాన్ని నాశనం చేయడం చివరకు పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు.
తీసుకోవాల్సిన చర్యలు
వ్యాపారాలు సానుకూల మార్పునకు కూడా దారి తీస్తాయని నివేదిక చెప్తోంది. అయితే ఇందుకు విధానాలు, చట్టపరమైన వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థ, సామాజిక విలువలు, సాంకేతికత, సామర్థ్యం వంటి ప్రధాన రంగాల్లో కొన్ని చర్యలు అవసరమని సూచిస్తున్నది. ఇక వ్యాపారాలు పర్యావరణ చట్టాలను పాటించాలనీ, ప్రభావ అంచనాలపై అవగాహన కలిగి ఉండాలని నివేదిక వివరించింది. ఇక ప్రతీ రంగాన్ని చాలా వరకు నియంత్రించ గల అధికారం ఉన్న ప్రభుత్వాలు.. ఈ విషయంలో కీలకంగా వ్యవహరించాలని పేర్కొంది. పర్యావరణ అనుకూల విధానాలు అమలు చేయాలనీ, హానికర సబ్సిడీలను తగ్గించి, పర్యావరణానికి అనుకూల మద్దతు ఇవ్వాలనీ, పరిశోధన, పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని వివరించింది.
బడా పారిశ్రామికవేత్తల కోసం మోడీ
ఈ నివేదిక వెలుబడిన తరుణంలో భారత్‌లోని ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’పై పలు ప్రశ్నలు వస్తున్నాయి. వ్యాపారుల కోసం మోడీ సర్కారు పలు నిబంధనలను సడలించిందనే ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణ చట్టాల్లో మార్పులు చేసిందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. గతనెల వాయు, జల చట్టాల కింద పరిశ్రమల అనుమతుల నిబంధనల్లో మార్పులు చేసింది మోడీ సర్కారు. ఇందులో భాగంగా కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతుల పునరుద్ధరణ అవసరాన్ని తగ్గించారు. సింగిల్ విండో సిస్టమ్ అమలు చేశారు. ఇవన్నీ వ్యాపార సౌలబ్యం కోసం అని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా ఈ సారి బడ్జెట్‌లోనూ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను వృద్ధికి మూలస్తంభంగా పేర్కొంది.
పడిపోయిన భారత్ ర్యాంకులు
ఐదేండ్లలో భారత్ 79 ర్యాంకులు మెరుగుపడిందని ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రభుత్వ చెప్పే మాటలు, తీసుకునే చర్యలు మాత్రం నిరుత్సాహపరిచేవిగానే ఉన్నాయని తెలుస్తున్నది. కారణం.. పర్యావరణ సూచికల్లో భారత్ ర్యాంకులు పడిపోవడమే దీనికి నిదర్శనం. పర్యావరణ మార్పు ప్రదర్శన సూచీ (సీసీపీఐ)లో 13 స్థానాలు పడిపోయి 23వ స్థానానికి పడిపోయింది. ఐక్యూఎయిర్ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఐదో అత్యంత కాలుష్య దేశంగా ఉన్నది. పర్యావరణ ప్రదర్శన సూచీలో 180 దేశాల్లో భారత్ అట్టడుగు స్థానంలో ఉండటం గమనార్హం.



