వారిపై విద్వేషాన్ని చిమ్ముతున్నారు : రాష్ట్ర సర్కారు, హిందూత్వ శక్తుల తీరుపై మేధావుల ఆందోళన
గువహతి : అసోంలోని బీజేపీ సర్కారు తీరుపై మేధావులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి మానవతా సంక్షోభానికి వ్యతిరేకంగా మాట్లాడే కార్యకర్తలు, మానవ హక్కుల న్యాయవాదులు, బెంగాలీ మాట్లాడే ముస్లింలపై అమానవీయత, దాడులు, బెదిరింపులను వారు హైలెట్ చేశారు. పౌర హక్కుల రక్షణ సంఘం (ఏపీసీఆర్), కార్వాన్-ఎ-మొహబ్బత్ సంయుక్తంగా ఆగస్టు 26న కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ‘పీపుల్స్ ట్రిబ్యునల్ ఆన్ అస్సాం: బహిష్కరణలు, నిర్బంధాలు, రైట్ టు బిలాంగ్’ అనే పేరుతో ఒక ప్రజా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశాయి. అయితే ఈ కార్యక్రమానికి హిందూత్వ శక్తులు అంతరాయాన్ని కలిగించాయి. మతపరమైన నినాదాలు చేశాయి. 2020లో బీజేపీకి చెందిన కీలక నాయకుడు అనురాగ్ ఠాకూర్ చేసిన వివాదాస్పద ”దేశ్ కే గద్దారో కో…” అనే నినాదాలు వినిపించాయి. అసోంలో హిమంత విశ్వ శర్మ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఈ ట్రిబ్యునల్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. అక్రమ వలసదారుల పేరుతో రాష్ట్రంలో జరుగుతోన్న తొలగింపులు, బెంగాలీ మాట్లాడే ముస్లిం కుటుంబాలపై పెరుగుతున్న దాడులు, వేధింపుల విషయంలో ప్రధానంగా దృష్టిని సారించింది. ప్రణాళికా సంఘం మాజీ సభ్యురాలు సయ్యదా హమీద్, రాజ్యసభ మాజీ ఎంపీ జవహర్ సిర్కార్, మాజీ సీఐసీ వజాహత్ హబీబుల్లా, సామాజిక కార్యకర్త హర్ష్ మందర్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, పరిశోధకులు ఫవాజ్ షాహీన్ నేతృత్వంలోని ట్రిబ్యునల్.. అసోంలో బెంగాలీ మూలాలున్న ముస్లిం సమాజంపై జరిగిన తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలపై ఒక గ్రౌండ్ రిపోర్ట్‌ను ప్రచురించింది.
ట్రిబ్యునల్ నివేదిక ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బెంగాలీ ముస్లింలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నది. వారిని ‘విదేశీయులు’గా ముద్రవేసి, నిరాశ్రయులను చేసింది. ఏకపక్షంగా తొలగింపులకు ఆదేశించింది. ఈ చర్యలు సమాజానికి ప్రమాదకరమైనవిగా వివరించింది. అయితే హిందూసేనకు చెందిన దాదాపు 150 మంది ఈ బృందంపై దాడి చేసింది. మతతత్వ నినాదాలు చేస్తూ కార్యక్రమానికి అంతరాయం కలిగించింది. ట్రిబ్యునల్ నిర్వహించిన కార్యక్రమంలో హిందూత్వ సంస్థకు చెందిన కార్యకర్తలు ‘గోలి మారో , దేశ్ కే గద్దరోం కో’, ‘జై శ్రీ రామ్’, ‘హర్ హర్ మహాదేవ్’ వంటి నినాదాలు చేశారు. ఆ అరుపులు ప్రేక్షకులు, ప్యానెలిస్టులలో భయాందోళనలను కలిగించాయి. కాగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మీడియా ప్రకటనలు, సోషల్ మీడియా పోస్ట్‌లు ట్రిబ్యునల్ సభ్యులను బహిరంగంగా లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ కార్యక్రమానికి కొన్ని రోజుల ముందు ఆయన నిజనిర్ధారణ బృందానికి వ్యతిరేకంగా బహిరంగ ప్రచారాన్ని ప్రారంభించారు. మందర్, హబీబుల్లా, భూషణ్ సహా బృంద సభ్యులను తీవ్రంగా విమర్శించారు. అక్రమ ఆక్రమణదారులపై తమ పోరాటాన్ని బలహీనపరిచేందుకు, రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి ప్రణాళికాబద్ధమైన ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.ప్రణాళికా సంఘం మాజీ సభ్యురాలు సయ్యదా హమీద్‌పై ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. ఆమెను ఆయన ‘కాంగ్రెస్ విధేయురాలు’, ‘సోనియా గాంధీకి సన్నిహితురాలు’ అని అభివర్ణించారు. ఆమె అక్రమ చొరబాటుదారులను చట్టబద్ధం చేస్తున్నారనీ, జిన్నా అసోంను పాకిస్తాన్‌లో భాగం చేయాలనే కలను సాకారం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా కార్యక్రమానికి అంతరాయాన్ని కలిగించిన హిందూత్వ శక్తుల తీరును, రాష్ట్ర సీఎం చేసిన వ్యాఖ్యల పట్ల ట్రిబ్యునల్ ఆందోళనను వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసేలా, సంఘీభావాన్ని నేరంగా మార్చడానికి చేసిన ప్రయత్నంగా ఆరోపించింది. ఈ ఘటనపై మందర్, నదీమ్ ఖాన్ సన్సద్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటంకం కలిగించిన వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.