చేపలను స్వాధీనం చేసుకున్న మత్స్య సహకార సంఘం సభ్యులు
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోనే కలకోట గ్రామ పరిధిలోని ఊర చేపల చెరువులో బుధవారం రాత్రి దొంగతనంగా చేపలు పట్టేందుకు దొంగలు చేసిన ప్రయత్నాన్ని మత్స్యశాఖ సహకార సంఘం సభ్యులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి సమయంలో చెరువులోకి చొరబడి పెద్ద ఎత్తున చేపలను పట్టేందుకు కొంతమంది దుండగులు ప్రయత్నించినట్లు సభ్యులు తెలిపారు. అనుమానాస్పద కదలికలను గమనించిన గ్రామస్తులు వెంటనే చెరువు వద్దకు చేరుకుని దొంగలను తరిమికొట్టారు.
అయితే వారు ఉపయోగిస్తున్న వలలు, బుట్టలు, ఇతర చేపల వేట సామగ్రిని గ్రామస్తులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు మాత్రం చీకటిని ఆసరాగా చేసుకుని అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. దొంగల నుంచి చేపలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది. గత కొంతకాలంగా చేపల చెరువులపై దొంగల కన్ను పడుతుండటంతో సహకార సంఘ సభ్యులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నామని వాపోయారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చెరువులకు భద్రత కల్పించాలని, రాత్రివేళల్లో గస్తీ పెంచాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు సహకార సంఘ సభ్యులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టి దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.



