నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారాన్ని అందించే పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇవ్వబోయే బ్రేక్‌ఫాస్ట్ మెనూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ నిర్ణయం మేరకు ప్రజల నుంచి ఒక్కో టిఫిన్‌కు కేవలం రూ.5 మాత్రమే వసూలు చేయనుంది. మిగతా రూ.14 ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఒక టిఫిన్‌కు మొత్తం ఖర్చు రూ.19గా అంచనా వేయగా, ప్రజలపై ఆర్ధిక భారం పడకుండా దీన్ని అమలు చేయాలని భావిస్తోంది.
GHMC రూపొందించిన మెనూను హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు. ఆరోగ్యకరంగా ఉండేలా మిల్లెట్ ఫుడ్‌ను ప్రాధాన్యతనిస్తూ రోజుకో రకం అల్పాహారాన్ని అందించనున్నారు. మెనూలో 6 రోజుల అల్పాహారం ఇలా ఉండబోతుంది:
Day 1: మిల్లెట్ ఇడ్లీ (3), సాంబార్, చట్నీ/పొడి
Day 2: మిల్లెట్ ఉప్మా, సాంబార్, మిక్స్ చట్నీ
Day 3: పొంగల్, సాంబార్, చట్నీ
Day 4: ఇడ్లీ (3), సాంబార్, చట్నీ
Day 5: పొంగల్, సాంబార్, చట్నీ
Day 6: పూరీ (3), ఆలూ కూర్మా
ప్రతి టిఫిన్‌కు సరిపోయేలా ఖచ్చితమైన గ్రాముల వారీగా పదార్థ పరిమాణాలూ నిర్ణయించబడ్డాయి. ఉదాహరణకి మిల్లెట్ ఇడ్లీ ఒక్కొక్కటి 45 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, చట్నీ 15 గ్రాములుగా ఉండనుంది. ఇందిరమ్మ క్యాంటీన్ల కోసం GHMC 139 ప్రాంతాల్లో కొత్త కంటైనర్లను ఏర్పాటు చేస్తోంది. దీని కోసం మొత్తం రూ.11.43 కోట్ల వ్యయం చేయనుంది. ప్రతి క్యాంటీన్‌లో నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ, పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యం.
పేద, మధ్య తరగతి ప్రజల కోసం రూపొందించిన ఈ పథకం, ఆరోగ్యకరమైన తక్కువ ధర అల్పాహారాన్ని అందించడంలో మైలురాయిగా నిలవనుంది. వాస్తవానికి, బస్తీ వాసులు, కార్మికులు, ఉద్యోగులందరికీ ఇది నిత్యావసర సేవగా మారే అవకాశముంది. GHMC పథకం మారుమూల ప్రదేశాల్లో ఉన్నవారికీ ఆరోగ్యకరమైన భోజనాన్ని చేరవేయడమే కాకుండా, ఆహార భద్రత దిశగా కూడా ఒక ముందడుగు.