Sunday, November 2, 2025
E-PAPER
Homeసోపతిసమయమే ఉన్నతుల్ని చేస్తుంది

సమయమే ఉన్నతుల్ని చేస్తుంది

- Advertisement -

ఎవరైతే సమయం వధా చేస్తారో ఏదో ఒకరోజు ఆ సమయమే వారిని నాశనం చేస్తుంది. సమయానికి విలువ ఇవ్వని వారి కోసం ఎందుకు మీ విలువైన సమయం వధా చేసుకుంటున్నారు? మీకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సమయం గూర్చి వివరణ ఇస్తాను చదవండి.

సమయం మీ కంటికి కనిపించదు. కానీ అది జీవితంలో చాలా మార్పుల్ని చూపిస్తుంది. సమయాన్ని సరిగ్గా వాడుకోవడం వస్తే ‘సక్సెస్‌’ మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇంత విలువైన సమయాన్ని ఎలా వాడుకోవాలో కొద్దిమందికే తెలుసు. సమయం వున్నప్పుడు మనకు దాని విలువ తెలియదు. దాని విలువ తెలిసినప్పుడు మీకు సమయం మించిపోతుంది. పరిస్థితులు మారిపోతాయి. ఎలాగంటే బాల్యంలో మీరు బడికి వెళ్ళలేదు. ఇప్పుడు మీ వయస్సు 20 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ బడికి వెళ్తాను అంటే కుదురుతుందా? స్కూల్‌ యూనిఫామ్‌, బ్యాగు వేసుకొని ఓసారి అద్దంలో చూసుకోండి… అప్పుడు మీరు ఏం కోల్పోయారో మీకే అర్ధం అవుతుంది. సరే ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ దగ్గర సమయం వుంది. దాని విలువ తెల్సుకొని జాగ్రత్తగా మసలుకో.

ఒక్కసారి నీ చేతుల్లో నుంచి సమయం వెళ్ళిపోతే మళ్ళీ రాదని గుర్తుపెట్టుకో. అందుకే చేజేతులా కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే జీవితాంతం పశ్చాతాప పడాల్సిందే. గతాన్ని తోడుకోలేవు. భవిష్యత్తును ఊహించలేవు. కాబట్టి వర్తమానంలోనే నీ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకో. నీకు సమయం ఇవ్వని వారి వెంటపడి విలువైన నీ సమయం వథా చేసుకుంటే నిన్ను వారు కూరలో వేసే కరివేపాకులా వాడుకొని వదిలేస్తారు. ఆ తర్వాత నువ్వు కోల్పోయినదేమిటో అర్ధమవుతుంది. ఇతరుల కోసం నీ విలువైన సమయాన్ని వారికి కేటాయించి నువ్వు హారతి కర్పూరం ఐతే ఆ వెలుగుల్ని ఇతరులు ఉపయోగించుకొని వద్ధిలోకి వస్తారు తప్ప నువ్వు కాదు. కాబట్టి ముందుగా నిన్ను నువ్వు తెలుసుకొని జ్ఞానోదయమై, ఇక మీదట ఎలా ఉండాలో ఆలోచించు. ఇప్పటికైనా వున్న సమయాన్ని నీ ఎదుగుదల కోసం వాడుకో, సమయాన్ని డబ్బుతో సమానంగా భావించు. నీ సమయం బాగున్నప్పుడు అందరూ నీ చుట్టూ ఈగల్లా పోగవుతారు. నువ్వు దాన్ని చూసుకొని విర్రవీగుతావు. నువ్వు కష్టంలో వున్నప్పుడు అందరూ వదిలేసిపోయినప్పుడు చుట్టూ ఎవరూ లేరని అప్పుడు కూడా నీ సమయాన్ని వధా చేస్తావు.

కష్టాల్లో ఉన్నప్పుడు నీతో వున్నవాళ్ళే నీ వాళ్ళు. మిగతావారంతా పరాయివారే. వారితో జాగ్రత్తగా వుండాలి. వారు బంధువులు కావొచ్చు, స్నేహితులు కావొచ్చు. అందుకే నువ్వే నీ జీవితాన్ని మార్చుకోగలవు. సూర్యుడు అస్తమించిన తరువాత చీకటి, మళ్ళీ సూర్యోదయం అవ్వగానే చీకటి పారిపోతుంది. కష్ట సమయంలో నమ్మకాన్ని, ఓర్పును కోల్పోవద్దు. ఆ సమయంలో తెలివిగా కాలాన్ని వాడుకుంటే లక్ష్యాన్ని చేరుకోగలవు. అపజయం వచ్చినా నిరాశపడక పాఠాలు నేర్చుకున్నట్టు, సక్సెస్‌ వాయిదా పడిందని భావించాలి. నీ కోసం నువ్వు వెచ్చించే సమయం ఎప్పుడు వధా కాదు. సమయం పడుతుంది, వేచి చూడు. డబ్బులు పోతే సంపాదించవచ్చు కానీ సమయం చేజారితే రికవరీ చేయలేం.

అవివేకులు చేయాల్సిన పనులు చివర్లో చేస్తారు. అదే తెలివైనవారు ముందుగానే చేస్తారు. సమయం విలువ తెలిసిన వాడికి సక్సెస్‌ వరించటం పెద్ద కష్టమైన విషయం కాదు. ఈరోజు కాలాన్ని సదినియోగం చేసుకుంటే ఫలితం రేపు కనిపిస్తుంది. ఎలాగంటే ఓ విత్తనాన్ని నాటారు. మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయిన అది రెండో రోజో మూడో రోజో అంకురం రూపంలో కనిపిస్తుంది. అలాగే మీరు చేసే పని ఏదైనా కావొచ్చు కొన్నింటికి ఫలితం వెంటనే వస్తుంది. మరి కొన్నింటికి ఆలస్యంగా కనిపిస్తుంది. ఒక కంపెనీ ప్రారంభించిన యజమానికి అందులో వస్తు ఉతత్తి వెంటనే వచ్చిన వెంటనే లాభాలు రావు. మెల్లిమెల్లిగా ఆ కంపెనీ వస్తువులు ప్రజల్లోకి వెళ్ళాక నాణ్యతను, నమ్మకాన్ని బట్టి లాభాలు వస్తాయి.

సమయం ఎలా మారుతుందో మిమ్మల్ని మీరు అలా మార్చుకోండి. ఎలాగంటే వర్షాకాలంలో గొడుగును, చలికాలంలో స్వెట్టర్‌ వాడుతాం. నీ కాలాన్ని కూడా అలాగే వాడుకుంటే కచ్చితంగా ఏదో ఒకరోజు ఫలితం వస్తుంది. ప్రపంచంలో వున్న ఎంత పెద్ద ధనవంతుడైన డబ్బుతో సమయాన్ని వెనక్కి తీసుకొని రాలేడు. కానీ అతడికి సమయం విలువ మాత్రం కచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఆ ధనికుడు సమయాన్ని ఉపయోగించుకోవడం వల్లనే ఆ స్థాయికి వచ్చాడని భావించాలి. మీ కోసం ప్రతిరోజు కనీసం ఐదు గంటల సమయం కేటాయించినా మీరు ఊహించన సక్సెస్‌ మీ ముందు మోకరిల్లుతుంది. అయితే కాస్త సమయం పడుతుంది అంతే! పోరాడకుండానే మనకు బ్రిటిష్‌ వారు స్వరాజ్యం ఇచ్చారా? విత్తును నాటకుండానే ఫలాలు పొందుతున్నారా? ఆలోచించండి. అలాంటప్పుడు మీ కాలాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నారో ఆలోచించుకోండి. పగిలిన అద్దం పూర్వపు స్థితిలో ఎలా కనిపించదో వెళ్ళిపోయిన సమయం కూడా పూర్వపు స్థానానికి రాదు. కాబట్టి మీ లక్ష్యం కోసం పోరాడాలి తప్ప గతం గూర్చి ఆలోచిస్తూ కూర్చుంటే శూన్యం తప్ప ఏమీ కనిపించదు.

ఒక పరిశోధన ప్రకారం 80% మంది కలలు 18-20 సం.రాల మధ్యలో వదిలేసుకుంటారట. అంటే వారు తమ లక్ష్యాన్ని మరచి కాలంతో ప్రయాణం చేయడమే. ఇక మిగిలిన సమయం మొత్తం వారికి ఇష్టం లేని పని చేసుకుంటూ జీవితం మొత్తం సర్దుబాటు చేసుకుంటూ గడిపేస్తారు. కాలం మీ కోసం కాదు కదా ఎవ్వరి కోసం ఆగదు. నీ కళ్ళముందున్న సమయాన్ని వాడుకొని సక్సెస్‌ ఐతే అందరికి ఆదర్శం అవుతావు. ఫెయిల్‌ ఐతే అందరికి చులకనగా కనిపిస్తావు. లక్ష్యం నీదే అయినప్పుడు దాని కోసం నువ్వే కష్టపడాలి. ఇది ఎంత త్వరగా నీకు అర్ధం ఐతే అంత త్వరగా విజయం వైపు వెళ్ళగలవు. అందరికి వుండేది కేవలం 24 గంటలే కానీ నువ్వు ఆ ఇరవై నాలుగు గంటల కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావ్‌ అన్న దానిపై నీ సక్సెస్‌ ఆధారపడి వుంటుంది.
(త్వరలో రాబోతున్న కెరీర్‌ గైడెన్స్‌ పుస్తకం నుండి)

  • డా||మహ్మద్‌ హసన్‌,
    9908059234
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -