సూపర్‌జెయింట్స్‌పై 7 వికెట్లతో గెలుపు
పేసర్ ప్రసిద్ కృష్ణ 4 వికెట్ల ప్రదర్శన
లక్నో 164/8 గుజరాత్ 165/3
ప్రసిద్ కృష్ణ (4/28) నిప్పులు చెరిగే ప్రదర్శన కనబరచగా.. లక్నో సూపర్‌జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. జోశ్ బట్లర్ (60), శుభ్‌మన్ గిల్ (56) అర్థ సెంచరీలు సాధించగా గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలోనే సీజన్లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై లక్నో సూపర్‌జెయింట్స్ బ్యాటర్లు సమిష్టిగా నిరాశపరిచారు.
నవతెలంగాణ-లక్నో
గుజరాత్ టైటాన్స్ మురిసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56, 40 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), జోశ్ బట్లర్ (60, 37 బంతుల్లో 11 ఫోర్లు) అర్థ సెంచరీలతో రాణించటంతో 165 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలోనే ముగించింది. లక్నో సూపర్‌జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఛేదనలో శుభ్‌మన్ గిల్, జోశ్ బట్లర్ మెరవటంతో సూపర్‌జెయింట్స్ బౌలర్లు తేలిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో8 వికెట్లకు 164 పరుగులు చేసింది. టైటాన్స్ పేసర్ ప్రసిద్ కృష్ణ (4/28), అశోక్ శర్మ (2/32) రాణించారు. ఓపెనర్ ఎడెన్ మార్‌క్రామ్ (30, 21 బంతుల్లో 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (18, 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేదు. నాలుగు వికెట్లతో మెరిసిన ప్రసిద్ కృష్ణ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. సీజన్లో 4 మ్యాచ్‌ల్లో టైటాన్స్‌కు ఇది రెండో విజయం కాగా, సూపర్‌జెయింట్స్‌కు 4 మ్యాచ్‌ల్లో రెండో ఓటమి.
ఆడుతూ పాడుతూ
165 పరుగుల లక్ష్యాన్ని టైటాన్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (15) పవర్‌ప్లేలోనే వికెట్ కోల్పోయాడు. శుభ్‌మన్ గిల్ (56), జోశ్ బట్లర్ (60) రెండో వికెట్‌కు గెలుపు భాగస్వామ్యం నమోదు చేశారు. 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 బంతుల్లో శుభ్‌మన్ గిల్ అర్థ సెంచరీ సాధించాడు. పవర్‌ప్లేలో గిల్ యాంకర్ పాత్ర పోషించగా, బట్లర్ దూకుడుగా ఆడాడు. 9 ఫోర్లతో 29 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన జోశ్ బట్లర్.. సాధించాల్సిన రన్‌రేట్‌ను అదుపులో పెట్టాడు. దీంతో టైటాన్స్ బ్యాటర్లు ఏ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. అర్థ సెంచరీల తర్వాత గిల్, బట్లర్ నిష్క్రమించినా.. వాషింగ్టన్ సుందర్ (21 నాటౌట్, 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ తెవాటియ (10 నాటౌట్, 8 బంతుల్లో 1 ఫోర్) నాల్గో వికెట్‌కు అజేయ భాగస్వామ్యం జోడించారు. మరో 8 బంతులు ఉండగానే టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో మహ్మద్ షమి (1/36), ప్రిన్స్ యాదవ్ (1/31), దిగ్వేశ్ (1/31) రాణించారు.
ప్రసిద్ కృష్ణ విజృంభణ
సొంత మైదానంలో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన సూపర్‌జెయింట్స్ ఆశించిన స్కోరు చేయలేదు. టైటాన్స్ పేసర్ ప్రసిద్ కృష్ణ, అశోక్ వర్మలు వికెట్ల వేటలో విజృంభించారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన సూపర్‌జెయింట్స్ ఏ దశలోనూ టైటాన్స్ బౌలర్లపై ఎదురుదాడి చేయలేదు. ఓపెనర్ ఎడెన్ మార్‌క్రామ్ (30) ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా.. ఆ దిశగా విఫలం అయ్యాడు. మిచెల్ మార్ష్ (11), ఆయుశ్ బదొని (9), నికోలస్ పూరన్ (19), అబ్దుల్ సమద్ (18), ముకుల్ చౌదరి (18), సహా కెప్టెన్ రిషబ్ పంత్ (18) ఒత్తిడిలో పరుగులు చేయటంలో నిరాశపరిచారు. పరుగుల పొదుపుతో బ్యాటర్లపై ఒత్తిడి పెంచిన టైటాన్స్ పేసర్లు.. అదే జోరులో వికెట్లు పడగొట్టారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు సూపర్‌జెయింట్స్ 164 పరుగులే చేసింది.
సంక్షిప్త స్కోరు వివరాలు
లక్నో సూపర్‌జెయింట్స్ : 164/8 (ఎడెన్ మార్‌క్రామ్ 30, నికోలస్ పూరన్ 19, రిషబ్ పంత్ 18, ప్రసిద్ కృష్ణ 4/28, అశోక్ శర్మ 2/32)
గుజరాత్ టైటాన్స్ : 165/3 (జోశ్ బట్లర్ 60, శుభ్‌మన్ గిల్ 56, వాషింగ్టన్ సుందర్ 21, ప్రిన్స్ యాదవ్ 1/31, మహ్మద్ షమి 1/36)



