నవతెలంగాణ – మల్హర్ రావు
ఇంటిల్లిపాదిని ఆనందడోలికల్లో ముంచెత్తే దీపావళి సందడి సోమవారం, రేపు మంగళవారం జరుగనుంది. జాతి, కుల, మత వర్గ విబేధాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇప్పటికే వరుస సెలవులు రావడంతో పండుగను సంబురంగా జరుపుకునేందుకు దూరప్రాంతాల్లో ఉండే వారు స్వస్థలాలకు చేరుకున్నారు. ఈ ఏడాది తిధులు, నక్షత్రాల ఆధారంగా నరక చతుర్దశిని 19న ఆదివారం, దీపావళి 20న సోమవారం మధ్యాహ్నం 3.42 నుంచి అమావాస్య తిథి ప్రారంభమై 21 సాయంత్రం 5 గంటలతో ముగస్తుందని ప్రదోష కాలానికి,రాత్రి సమాయానికి ఆమావాస్య ఉండటంతో 20న దీపావళి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అదే విధంగా 20న సాయం త్రం 7 గంటల నుంచి రాత్రి 8:30 గంటల మధ్య లక్ష్మీపూజ ఆచరించటం ఉత్తమమని పండితులు పేర్కొంటున్నారు.
దీపావళి కళ..
దీపావళి అనగానే పిండివంటలు, కొత్త బట్టలు, దీపాలతో పాటు పిల్లలు, పెద్దలు టపాసులతో సంబురం చేసుకుంటారు. పిండివంటలు, కొత్తబట్టలు, దీపాలతో ఎలాంటి ఇబ్బందులు లేవు. టపాసులు మాత్రం ఆరోగ్యపరంగా ఇబ్బందులుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో దీపావళి బాంబులు, టపాసులు వంటివి కాల్చిన, వెలిగించిన వాటి నుంచి వెలువడే పదార్థం ఆరోగ్యానికి చేటు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.