– నీట మునిగిన పంటలు
– కోతకు గురైన రోడ్లు, కల్వర్టులు –
– వరి మడుల్లో ఇసుక మేటలు ొ జలమయమైన రైల్వే అండర్ బ్రిడ్జిలు
– ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం
– గిరిజన ప్రాంతాల్లో స్తంభించిన రవాణా
– మరోసారి ఖమ్మం నగరం జలమయం
వరదలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన హైడ్రా
వరంగల్‌లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యేలు, అధికారులు
రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టాయి. ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యల వల్ల ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు. వర్షాల ప్రభావంపై స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి. రామగుండంలో బుధవారం అత్యధికంగా 76.8 మి.మీ., వర్షపాతం నమోదైంది. నల్గొండలో 28.2 మి.మీ., ఆదిలాబాద్‌లో 27.8 మి.మీ., వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ ఫుల్ ట్యాంక్ లెవల్‌ను మించి ప్రవహిస్తోంది. దీనితో నీటిని కిందికి వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్‌లో అన్ని గేట్లు ఎత్తేశారు. హిమాయత్‌సాగర్‌లో నాలుగు గేట్లను మూడు అడుగుల ఎత్తు వరకు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం యావత్తూ అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాల్లో పాఠశాలలకు బుధ, గురు వారాల్లో సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఉదయం పూట మాత్రమే హాఫ్ డే స్కూళ్లను నడిపారు. హైదరాబాద్ సిటీలో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్, పటాన్‌చెరు, మియాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో 15 సెం.మీ.,వర్షపాతం నమోదైనట్టు హైడ్రా అధికారులు తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు ఆయా కంపెనీలకు సమాచారం ఇచ్చారు. దీనితో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయి. అయినా పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మెదక్, ములుగు, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ కేంద్రం హెచ్చరించింది.
నవతెలంగాణ – విలేకరులు
రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. అధికారులు అప్రమత్తమై ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించారు. మంచిర్యాల, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, ములుగు, భూపాలపల్లి తదితర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసాయి. వరి పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, కాల్వర్టులు కోతకు గురయ్యాయి. గిరిజన ప్రాంతాల్లో వాగులు అలుగు పోస్తుండటంతో రవాణా స్తంభించింది.
మంగళవారం భారీగా కురిసిన వర్షాలనేపథ్యంలో వరంగల్ నగరంలో ముంపు నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 16 వరకు భారీ వర్ష సూచనలు ఉండటంతో బల్దియా అధికారులు సిబ్బంది అందుబాటులో ఉన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. వరంగల్ నగర పరిధి చింతల్ మైసమ్మ గుడి వద్ద డ్రైన్ వాటర్ పనులను బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పారుతో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి పరిశీలించారు. సురక్షిత ప్రాంతాలకు తరలించిన వారికి మంచి నీరు, ఆహారం అందజేస్తున్నారు. 30కి పైగా కాలనీల్లో సుమారు వెయ్యి కుటుంబాలు ముంపు తీవ్రతను ఎదుర్కొన్నాయి. జయశంకర్ -భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని పలు వార్డుల్లోకి వరదనీరు చేరి రోగులు ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకొని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. వైద్యరోగ్య శాఖ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే వర్షపు నీరు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గణపురం మండలం ధర్మరావుపేట, గణపురం, వెళ్తుర్లపల్లి, అప్పయ్యపల్లి గ్రామాల మధ్య ఉన్న మోరంచ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పంట పొలాలు మొత్తం నీట మునిగాయి. రైతులు నాలుగు రోజుల క్రితం వేసిన వరి నాట్లు నీట మునిగిందని లబోదిబోమంటున్నారు.
వాగులు పొంగిపొర్లుతుండటంతో ఇక్కట్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలతో పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని ఏకైక జలాశయం పాల్వాయి పురుషోత్తం రావు పూర్తిగా నీటితో నిండిపోయి ఎర్రవాగు, నల్లవాగు, మత్తడిలు పొంగి పొర్లుతున్నాయి. దిగువ ప్రాంతంలో ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గిరవెల్లి, గెర్రే, కొంచవెల్లి, పీకాలగుండం గ్రామాల్లో పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీటి ఉధృతికి కల్వర్టులు, రోడ్లు కోతకు గురయ్యాయి. కాసిపేట నుంచి గోపాల్‌నగర్ వెళ్లే రహదారిపై వంతెన వరద తాకిడికి ధ్వంసమైంది. భారీ వర్షాలకు మండలంలో 89 ఎకరాల్లో వరి, 15 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ అధికారి సుష్మ తెలిపారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
ఖమ్మం నగరం మరోసారి జలమయమయింది. డ్రయినేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఖమ్మం పాత బస్టాండ్ సెంటర్ నుంచి బాబూరావు పెట్రోల్ బంకు వరకు చెరువును తలపించే విధంగా నీరు నిలిచింది. డ్రయినేజీ నీరు రోడ్డు మీద ప్రహిస్తుండటంతో వాహనదారులు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆకేరు, మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ఉన్న మహబూబాబాద్, భద్రాద్రి, వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు వచ్చి మున్నేరులో చేరుతుండటంతో వరద పోటెత్తింది. నల్లగొండ జిల్లా ఆడవిదేవులపల్లి రహదారిపై లావుడితండ-రామన్నపేట ల మధ్య ఉన్న లోలెవెల్ వంతెన పై భారీగా వరద ఉధృతి కొనసాగింది. దాంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొండమల్లేపల్లి మండంలో కురిసిన భారీ వర్షాలకు గౌరుకుంటా తండా గ్రామం వరద నీటిలో చిక్కుకుంది.
గ్రేటర్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కుండపోత వానలతో నగరంలోని పలు ప్రాంతాలల్లో రోడ్లు జలమయమై, ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీస్, వాటర్‌బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు. హైటెక్ సిటీలోని ఐకియా కూడలి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వానలతో నగరవాసులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు చర్యలు చేపట్టారు. వర్షాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు, ఇతర సిబ్బంది చాలా వరకు బుధవారం ఇంటి నుంచే పనిచేశారు.
గర్భిణీని వాగు దాటించిన గ్రామస్తులు
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం నర్సాపూర్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో మారుమూల గ్రామాలకు రవాణా స్తంభించింది. దొడ్డిగూడెంకు చెందిన గర్భిణి యమునకు పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం అందజేశారు. కానీ వాగు బ్రిడ్జి పైనుంచి వరద నీరు పోటెత్తడంతో అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దాంతో ఆమెను వాగు దాటించేందుకు కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న తాండూర్, మాదారం ఎస్‌ఐలు కిరణ్‌కుమార్, సౌజన్య.. పోలీసు సిబ్బందిని, ఈతగాళ్లు, గ్రామస్తుల సహకారంతో తాళ్ల సాయంతో గర్భిణిని వాగు దాటించి అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది.
మత్తడివాగు దాటలేక పెండ్లికొడుకు పాట్లు
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రం ఊర చెరువు మత్తడి వాగు ప్రవాహం ఎక్కువ కావడంతో పెండ్లి కొడుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. పెండ్లి కోసం మండల కేంద్రానికి చేరుకోవాల్సిన పెండ్లికొడుకు ప్రయాణిస్తున్న వాహనం వరద ఉధృతి కారణంగా నిలిచిపోయింది. దాంతో చేసేదేమీ లేక బంధువులు పెండ్లికొడుకును భుజాలపై మోసుకుంటూ అవతలి ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి మరో వాహనంలో మండపానికి తీసుకెళ్లారు. లోలెవెల్ కల్వర్టు కారణంగా మండల ప్రజలు ఏటా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతి పెరిగినప్పుడు బస్సు సేవలు కూడా నిలిచిపోతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
భక్తులను ఒడ్డుకు చేర్చిన పోలీసులు
కడెం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గోదావరినదికి బుధవారం ఒక్కసారిగా వరద పెరిగింది. విషయం తెలుసుకున్న ధర్మపురి ఎస్‌ఐ ఉదరు కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు నది వద్ద స్నానాలకు వెళ్లిన భక్తులను అప్రమత్తం చేయడానికి వెళ్లారు. భక్తులు ఒడ్డుకు రావాలని హెచ్చరికలు జారీ చేశారు. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే వరద ఉధృతి పెరగడంతో భక్తులు నడవలేని స్థితిలో అక్కడే చిక్కుకుపోయారు. గమనించిన అధికారులు తమ సిబ్బందితో కలిసి భక్తులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
వరదలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన హైడ్రా
పాతబస్తీలోని యాకుత్‌పురా రైల్వే స్టేషన్ దగ్గరలోని వరద కాలువలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని హైడ్రా సిబ్బంది కాపాడారు. మేకల మేతకోసం చెట్టు కొమ్మలను తీసుకువచ్చేందుకు స్థానికంగా నివాసముండే గౌస్ బుధవారం కాలువ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తు వరద కాలువలోకి జారుకున్నాడు. గమనించిన స్థానికులు 100 మీటర్ల దూరంలో కచ్చామోరీల్లో చెత్తను తొలగించే పనిలో ఉన్న హైడ్రా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హైడ్రా ఇన్‌స్పెక్టర్ బాలగోపాల్ హుటాహుటిన సిబ్బందితో అక్కడకు చేరుకుని గౌస్‌ను కాపాడారు. కాలువలోకి దిగడానికి ఏమాత్రం అవకాశం లేని ప్రమాదకర పరిస్థితుల్లో నిచ్చెన కిందకు వేసి దాని ద్వారా యువకుడిని కాపాడారు. రెయిన్ బజార్ కార్పొరేటర్ వసీతో పాటు హైడ్రా సిబ్బంది వంశీ, బాలరాజు తదితరులు యువకుడిని కాపాడినవారిలో ఉన్నారు.
ప్రాజెక్టుల్లోకి వరద నీరు, గేట్లు ఎత్తి విడుదల
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఏడు గేట్ల ఎత్తి అధికారులు నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీ వరద వస్తోంది. నాగార్జునసాగర్ జలాశయం కూడా నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. అదేవిధంగా మూసీ ప్రాజెక్టు గేట్ల ద్వారా కూడా నీటి విడుదల కొనసాగుతోంది. మూసీ ప్రాజెక్టు 5 గేట్లు 2అడుగుల మేర ఎత్తి 6387.01 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు.
నిర్మల్ జిల్లా కడెం మండలం కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 19,926 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోనికి రాగా, మూడు గేట్లు ఎత్తి ప్రాజెక్టు నుంచి 18,322 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్టు ఈఈ విఠల్ పేర్కొన్నారు. కుమురం భీం ప్రాజెక్టు నుండి బుధవారం ఐదు గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు.
ముంచెత్తిన వాన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES