– రూ.3.50 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత
– ఎల్లంపేట మున్సిపాలిటీలో ఘటన
నవతెలంగాణ- మేడ్చల్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఇన్‌చార్జి రూ.3.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ, డీఎస్పీ హైదరాబాద్ రేంజ్ అధికారి గంగసాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని సోమారం గ్రామంలో మూడేండ్ల కిందట ఏర్పాటు చేసిన గంగస్థాన్ వెంచర్‌కు నిర్వాహకులు హెచ్‌ఎండీఏ అనుమతి తీసుకున్నారు. అయితే, పక్కన ఉన్న భూ యజమానులకు రాకపోకలు కొనసాగించడానికి వీలుగా రోడ్లు ఉండాలని నిబంధన ఉంది. కానీ వీరు రోడ్ల వద్ద గేట్లు ఏర్పాటు చేశారు. దీనిని ఆసరా చేసుకున్న టౌన్ ప్లానింగ్ ఇన్‌చార్జి ఎస్.రాధాకృష్ణారెడ్డి వెంచర్ నిర్వాహకులను రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే గేట్లు తొలగిస్తానని, ప్రహరీ కూల్చేస్తానని బెదిరించాడు. దాంతో యజమానులు వారం రోజుల కిందట సదరు అధికారికి లక్ష రూపాయలు ముట్టజెప్పారు. శనివారం మరో రూ.3.50 లక్షలు ఇవ్వడానికి బాధితులు ఫోన్ చేయగా కొంపల్లిలోని రాయిచందని మాల్ వెనుకకు రావాలని టౌన్‌ప్లానింగ్ అధికారి సూచించాడు. బాధితుడు అక్కడికి వెళ్లగా డబ్బుల బ్యాగ్‌ను కారు డాష్ బోర్డులో పెట్టించుకున్నాడు. ఇంతలోనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి లంచం తీసుకున్న అధికారిని పట్టుకుని ఎల్లంపేట మున్సిపాలిటీకి తరలించారు. అనంతరం అతని ఇంట్లో, మున్సిపల్ కార్యాలయంలో సోదాలు చేశారు. కేసు విచారిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. టీపీఎస్ ఒక్కరి మీదనే బాధితుడు ఫిర్యాదు చేశారని తెలిపారు. టీపీఎస్ కారు సీజ్ చేశామన్నారు. ఏ అధికారి లంచం అడిగినా ప్రజలు ఇవ్వొద్దని, ఎవరైనా డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా, మున్సిపల్ కమిషనర్‌ను కూడా ఏసీబీ అధికరులు సాయంత్రం విచారించారు.
ఏసీబీ వలలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES