Thursday, January 29, 2026
E-PAPER
Homeజాతీయంవినువీధిలో విషాదాలు!

వినువీధిలో విషాదాలు!

- Advertisement -

హోమీ బాబా నుండి అజిత్‌ పవార్‌ వరకు పలువురు ప్రముఖుల దుర్మరణం

న్యూఢిల్లీ : వినువీధిలో జరిగే విమాన ప్రమాదాలు అరుదే అయినా అవి అనేకమంది ప్రముఖుల ప్రాణాలు బలిగొన్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ బుధవారం విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన నేపథ్యంలో గత నాలుగు దశాబ్దాల్లో జరిగిన పలు విమాన ప్రమాదాలు వాటిల్లో మరణించిన ప్రముఖుల వివరాలు :

కమ్యూనికేషన్‌ లేక హోమీ బాబా మృతి
ప్రముఖ అణు భౌతిక శాస్త్రవేత్త, దేశ అణు కార్యక్రమానికి పితామహుడైన హోమీ జహంగీర్‌ బాబా కూడా విమాన ప్రమాదంలోనే కన్ను మూశారు. 1966 జనవరి 24న హోమీ బాబా ప్రయాణిస్తున్న విమానం స్విస్‌ ఆల్ప్స్‌ పర్వతాల్లో కుప్పకూలిపోయింది. జెనీవాలోని విమాన ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఎటిసి) అధికారులతో విమాన పైలట్లకు సరిగా కమ్యూనికేషన్‌ లేకపోవడం వల్లనే ఈ విమాన ప్రమాదం జరిగినట్లు తేల్చారు.

పాక్‌ దాడిలో
అంతకుముందు ఏడాది అంటే 1965లో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి బల్వంత్‌రాయ్ హెమతా కూడా ఇలాంటి దుర్ఘటనలోనే మృతిచెందారు. భారత్‌, పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో పాకిస్తానీ యుద్ధ విమానాలు సరిహద్దుకు సమీపంలో మెహతా ప్రయాణిస్తున్న విమానాన్ని యుద్ధ విమానంగా పొరపాటుగా భావించి కూల్చివేశాయి. 1973లో కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి మోహన్‌ కుమార మంగళం మరణించారు. ఢిల్లీకి సమీపంలో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 440విమానం కూలిపోయిన ఘటనలో చనిపోయిన మంత్రి మృత దేహాన్ని పార్కర్‌ ఫెన్‌, హియరింగ్‌ ఎయిడ్‌ సాయంతోగుర్తించారు.

విన్యాసాలు చేస్తూ సంజయ్ గాంధీ
1980 జూన్‌ 23న జరిగిన విమాన ప్రమాదంలో ఇందిరా గాంధీ కుమారుడు,. కాంగ్రెస్‌ నేత సంజయ్ గాంధీ మరణించారు. పైలట్‌గా శిక్షణ పొందిన సంజరు ఢిల్లీలో ఫ్లైయింగ్‌ క్లబ్‌కు చెందిన చిన్న విమానంతో విన్యాసాలు చేస్తుండగా అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోవడంతో జరిగిన ప్రమాదంలో కన్నుమూశారు. విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మాధవరావు సింథియా ఉత్తరప్రదేశ్‌లో చార్టర్డ్‌ విమానం కూలిన ఘటనలో మరణించారు. 2001 సెప్టెంబరు 30న యుపిలోని కాన్పూర్‌లో జరిగే ఎన్నికల ప్రచారానికి వెళుతుండగా మధ్యలో వాతావరణం అనుకూలించకపోవడంలో ఒక్కసారిగా మొయిన్‌పురిలో విమానం కూలిపోయింది.

చెరువులో కూలి
2002 మార్చి 3న అప్పటి లోక్‌సభ స్పీకర్‌, తెలుగుదేశం నేత జిఎంసి బాలయోగి ఇలాగే విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి హెలికాప్టర్‌లో బయలుదేరగా, కైకలూరు సమీపంలో చెరువులో హెలికాప్టర్‌ కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 2004 ఏప్రిల్‌ 17న ప్రముఖ సినీ నటి సౌందర్య కూడా విమాన ప్రమాదంలోనే కన్నుమూశారు. బెంగళూరు నుండి కరీంనగర్‌కు ప్రైవేట్‌ విమానంలో బయలుదేరిన కొద్ది నిముషాల వ్యవధిలోనే సింగిల్‌ ఇంజన్‌ విమానం కూలిపోయింది. ఆమెతో సహా నలుగురు మరణించారు.
2005 మార్చి 31న హర్యానా విద్యుత్‌ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఒపి.జిందాల్‌ విమాన ప్రమాదాలో మరణించారు. ఢిల్లీ నుండి చండీఘడ్‌కు బయలుదేరిన ఆయన విమానం యుపిలోని సహరాన్‌ పూర్‌లో కూలింది.

నల్లమల అడవుల్లో హెలికాప్టర్‌ కూలి
2009లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి నల్లమల అడవుల్లో హెలికాప్టర్‌ కూలి మరణించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రమాణిస్తున్న హెలికాప్టర్‌ దట్టంగా వున్న అడవుల్లో కుప్పకూలింది. 2011 ఏప్రిల్‌ 30న అప్పటి అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి డోర్జీ ఖాండూ, మరో నలుగురు హెలికాప్టర్‌ కూలిన ఘటనలో మరణించారు. హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడమే కారణంగా భావించారు.

తొలి సిడిఎస్‌తో సహా 13మంది
దేశ తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సిడిఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ 2021 డిసెంబరు 8న జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. తమిళనాడులోని కూనూర్‌ సమీపంలో జరిగిన ప్రమాదంలో బిపిన్‌ రావత్‌, ఆయన భార్య, మరో 11మంది కన్నుమూశారు. తాజాగా గతేడాది అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -