మహిళా ప్రయాణికుల భద్రత, సామాజిక సాధికారతే లక్ష్యంగా కీలక నిర్ణయం
విధులు చేపట్టిన 20 మంది ట్రాన్స్‌జెండర్స్
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశంలోనే అత్యాధునిక రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రో రైలు సామాజిక బాధ్యతలో మరో చారిత్రక ముందడుగు వేసింది. తెలంగాణ ప్రభుత్వ సమానత్వం, గౌరవం, సమాన అవకాశాల స్ఫూర్తితో, మెట్రో భద్రతా విభాగంలో 20 మంది ట్రాన్స్‌జెండర్లను సిబ్బందిగా నియమించుకుంది. ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న వీరు సోమవారం(డిసెంబర్ 1) నుంచి ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో తమ విధులను ప్రారంభించారు.ప్రస్తుతం మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో విస్తరించిన హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజూ సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 30 శాతం మంది మహిళలే ఉన్నారు.
ఈ నేపథ్యంలో మహిళా ప్రయాణికుల భద్రత, సౌకర్యం, వారిలో విశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మెట్రో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్తగా నియమితులైన ట్రాన్స్‌జెండర్ సిబ్బంది ప్రధానంగా.. జనరల్, మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన కోచ్‌లలో భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు ప్రయాణికులకు దిశానిర్దేశం చేయడం, అవసరమైన సమాచారం, సహాయం అందించడం చేస్తారు. స్కానర్ కార్యకలాపాలను పర్యవేక్షించడం ద్వారా ప్రయాణికులు సురక్షితంగా వెళ్లేలా చూడటం, స్ట్రీట్-లెవెల్, కాన్‌కోర్స్ ప్రాంతాల్లో భద్రతా విధుల్లో పాల్గొంటారు. ట్రాన్స్‌జెండర్ సిబ్బంది నియామకం భద్రతా చర్య మాత్రమే కాదని, సామాజిక సాధికారతకు ఒక శక్తివంతమైన సంకేతమని మెట్రో అధికారులు పేర్కొన్నారు.



