Saturday, December 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపారదర్శకతే ప్రధానం

పారదర్శకతే ప్రధానం

- Advertisement -

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు ఆ బాధ్యతను నిర్వర్తించాలి : పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల చైర్‌పర్సన్ల జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాజ్యాంగంలో సేవలు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల విధి నిర్వహణ గురించే ప్రత్యేకంగా ప్రస్తావించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్తు చేశారు. అవకాశాల్లో సమానత్వం అనే ఆదర్శ భావాన్ని అనుసరించడమే కాకుండా, ఫలితాల్లోనూ సమానత్వమనే లక్ష్యాన్ని సాధించేందుకు శాయశక్తులా కృషి చేయాలని ఆమె సూచించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మండలంలోని రామోజీ ఫిల్మిం సిటీలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో పబ్లిక్‌ సర్వీస్‌ చైర్‌పర్సన్ల 26వ జాతీయ సదస్సులో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతోపాటు, హోదాల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని సాధించేందుకు రాజ్యాంగ ఆదర్శాలను అమలు చేయాలని సూచించారు. విధి నిర్వహణలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల పాత్ర అత్యంత కీలకమని వ్యాఖ్యా నించారు. ప్రభుత్వ ఉద్యోగులను, వారికి కల్పించే అవకాశాలను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారని తెలిపారు.

ప్రజా సంక్షేమాన్ని పెంపొందించేందుకు ఆదేశిక సూత్రాల్లో సామాజిక వ్యవస్థ ప్రాధాన్యత గురించే నొక్కి చెప్పారని గుర్తు చేశారు. ఈ సూత్రం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. సమానత్వాన్ని, న్యాయాన్ని ప్రోత్సహిస్తూనే పలు మార్పులకు ప్రతినిధులుగా వ్యవహరించాలని రాష్ట్రపతి సూచించారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల ద్వారా ఎంపికైన ప్రభుత్వోద్యోగులతోనే శాశ్వత కార్యనిర్వాహక వర్గం ఏర్పడుతుందని చెప్పారు. వీరితోనే పాలన ప్రక్రియకు నిష్పాక్షికత, అవిచ్ఛిన్నత, స్థిరత్వం లభిస్తాయని తెలిపారు. ప్రజలకు సేవలందించేందుకు నిజాయితీ, సమగ్రత, సునిశితత్వం, సామర్థ్యం ఎంతో అవసరమన్నారు. అప్పుడే జాతీయ, రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృత విధానాలను సమర్థవంతంగా నిర్వహించగలమని పేర్కొన్నారు. ఆశించిన స్థాయిలో నైపుణ్యం, సామర్థ్యాలు లేకపోయినా అభ్యసనం ద్వారా అధిగమించవచ్చన్నారు. సమగ్రత లోపించడం వల్ల ఎదురయ్యే తీవ్రమైన సవాళ్లను అధిగమించడం సాధ్యం కాకపోవచ్చునని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు అణగారిన, బలహీన వర్గాల వారి కోసం పని చేయాలన్న ఆసక్తి తప్పకుండా ఉండాలని సూచించారు. మహిళల అవసరాలు, ఆకాంక్షల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు మరింత సునిశితంగా వ్యవహరించాలని చెప్పారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్రపతి చెప్పారు. అపారమైన వైవిధ్యం కలిగిన భారతదేశానికి అత్యంత సమర్థమైన పాలనా వ్యవస్థలు అవసరమని చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనేది భారతదేశ లక్ష్యమని తెలిపారు. 2047 నాటికి ‘వికసిత భారత్‌’ లక్ష్యాన్ని సాధించే దిశగా మనం ముందుకు సాగుతున్నామని చెప్పారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు తమ బాధ్యతలను ఎప్పటికప్పుడు నెరవేర్చాలని సూచించారు. దేశ భవిష్యత్‌కు సివిల్‌ సర్వెంట్లను సన్నద్ధం చేయడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క, టీజీపీఎస్సీ చైర్‌పర్సన్‌ బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -