Thursday, September 10, 2026
E-PAPER
Homeఆదిలాబాద్‘సర్‌’లో పారదర్శకత పాటించాలి

‘సర్‌’లో పారదర్శకత పాటించాలి

- Advertisement -

అర్హులైన ప్రతి ఒక్కరి పేరూ తప్పిపోకుండా చూడాలి
కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర సీఈఓ సుదర్శన్‌రెడ్డి
ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో విస్తృత పర్యటన
నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

​ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో పర్యటించి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని తాంసి, భీంపూర్‌ మండలాలతోపాటు జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షి షాతో కలిసి పరిశీలించారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ భవన్‌లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను కలెక్టర్‌ భవేష్‌ మిశ్రతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీఈఓ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతోపాటు మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను నిబంధనల మేరకు తొలగించాలని సూచించారు. ఇంటింటి సర్వేలో ప్రతి కుటుంబంలోనూ ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువీకరించిన సమాచారం ఆధారంగానే మార్పులు, చేర్పులు, తొలగింపులు చేపట్టాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో డాక్యుమెంట్లను పరిశీలించి అవసరమైన వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. మూడ్రోజులుగా క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగుతోందని, జిల్లాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని వివరించారు. 18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో పరిశీలించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
​కేంద్రాల ఆకస్మిక తనిఖీ
ఆదిలాబాద్‌ జిల్లాలో తాంసీ, భీంపూర్‌ మండలాల్లో సీఈఓ పర్యటించారు. తాంసి మండలం ఘోట్కూరి, భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటి గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి బూత్‌ స్థాయి అధికారులు(బీఎల్‌ఓలు) నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలను తనిఖీ చేశారు. బీఎల్‌ఓల వద్ద ఉన్న దరఖాస్తులు, ఓటర్ల జాబితాలను పరిశీలించిన సీఈఓ, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలోని డైట్‌ కళాశాల, సంజరునగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. ఈ పర్యటనలో ఆదిలాబాద్‌ అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్‌ చిత్రు, ఎస్‌ రాజేశ్వర్‌, తహసీల్దార్లు శ్రీనివాస్‌, గణేష్‌, రమేష్‌, నిర్మల్‌ అదనపు కలెక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాస్‌, ఆర్డీఓ దేవిదాస్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -