వాహనదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం
గుర్తింపు సంఘాల అంశాలపై చర్చించేందుకు నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి
బేగంపేటలో ‘వాహన్’ పోర్టల్ ప్రారంభంలో మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజాపాలనలో భాగంగా రవాణా శాఖను పూర్తిగా డిజిటలైజ్ చేస్తున్నామని, వాహనదారు లకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బేగంపేటలోని వరుణ్ మోటార్స్ కార్యాలయంలో ‘వాహన్’ పోర్టల్‌ను సోమవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ప్రజలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని మంత్రి ప్రకటించారు. ‘నేటి నుంచి రాష్ట్రంలో రెండో వాహనం లేదా అంతకంటే ఎక్కువ వాహనాలను కొనుగోలు చేసే వారిపై ఉన్న 2 శాతం అదనపు జీవితకాల పన్నును రద్దు చేస్తున్నాం” అని వెల్లడించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 చెక్‌పోస్టులను ఎత్తేసినట్టు తెలిపారు.
కేంద్ర డేటాబేస్‌తో అనుసంధానం
పదేండ్లుగా తెలంగాణ వాహన్ పోర్టల్‌లో లేదని, రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గతేడాది ‘సారథి’లో చేరగా, ఇప్పుడు ‘వాహన్’లో చేరడం ద్వారా దేశవ్యాప్త డేటాబేస్‌లో తెలంగాణ భాగస్వామి అయిందని మంత్రి చెప్పారు. దీనివల్ల రిజిస్ట్రేషన్, ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ వంటి సేవలు పారదర్శకంగా, వేగంగా అందుతాయన్నారు. ఇకపై ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా సంస్కరణలు తెచ్చామని తెలిపారు.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈవీ వాహనాలనే కొనుగోలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. అలాగే, కాలుష్య నియంత్రణ కోసం డీజిల్ ఆటోలను రెట్రోఫిట్ చేయాలనిలక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డీలర్లు వాహనం విక్రయిం చినప్పుడు కొనుగోలుదారులకు రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించాలని సూచించారు. తప్పనిసరిగా హెల్మెట్ అందజేయాలని, కాలుష్య నివారణలో భాగంగా ఒక మొక్కను బహుమతిగా ఇవ్వాలని డీలర్లను కోరారు.
ఆర్టీసీకి భరోసా
ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ”గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసింది. నేడు మహాలక్ష్మి పథకంతో సంస్థ మళ్లీ పుంజుకుంటోంది. ఉద్యోగ నియామకాలు, కొత్త బస్సుల కొనుగోలు, డిపోల అబివృద్ధిపై దృష్టి సారించాం. విలీనం, గుర్తింపు సంఘాల అంశాలపై చర్చించేందుకు నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి” అని మంత్రి పొన్నం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రవాణా శాఖ చేపట్టిన సంస్కరణలు, రోడ్ సేఫ్టీ చర్యలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభినందించారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో రోజుకు సగటున 1,500 వాహనాలు కొత్తగా రోడ్లపైకి వస్తున్నాయని, ఆధునిక సాంకేతికతతోనే వాటి నిర్వహణ సాధ్యమని అన్నారు. స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో వాహన్ పోర్టల్‌లో చేరామని ఆన్‌లైన్ సేవల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలని సూచించారు. జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న కార్యక్రమాలు.. రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీలు ఎం.చంద్రశేఖర్ గౌడ్, సి.రమేష్, శివలింగయ్య, ఎన్‌ఐసీ ప్రతినిధి జగదీప్, వరుణ్ మోటార్స్ అధినేత వరుణ్, డీటీసీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



