Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరవాణా శాఖ ఆదాయం రూ. 5,142 కోట్లు

రవాణా శాఖ ఆదాయం రూ. 5,142 కోట్లు

- Advertisement -

– ప్రయివేట్‌ బస్సుల దోపీడీపై కొరడా
– సంక్రాంతి సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
నవతెలంగాణ-సిటీబ్యూరో

ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించి గడిచిన తొమ్మిది నెలల్లో రవాణా శాఖ గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించింది. ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు మొత్తం రూ.5,142 కోట్ల ఆదాయం సమకూరినట్టు రవాణా శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో సంక్రాంతి పండుగ సమయంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రయివేట్‌ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఆదాయం వివరాలు ఇలా..
2025-26 వార్షిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు రవాణా శాఖకు రూ.6,165 కోట్ల ఆదాయం రావాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా, అందులో 83 శాతాన్ని(రూ.5,142 కోట్లు) సాధించినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. జీవిత కాలపు పన్ను ద్వారా రూ.3,611 కోట్లు, త్రైమాసిక పన్ను రూ.730 కోట్లు, ఫీజులు రూపంలో రూ.408 కోట్లు, తనిఖీల(ఎన్‌ఫోర్స్‌మెంట్‌) ద్వారా రూ.181 కోట్లు, సర్వీస్‌ చార్జీల ద్వారా రూ.153 కోట్లు, గ్రీన్‌ ట్యాక్స్‌ రూ.57 కోట్లు సమకూరిందని రవాణాశాఖ తెలిపింది.

సంక్రాంతి వేళ ప్రయివేటు బస్సులకు హెచ్చరిక
మరోవైపు, సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయివేటు బస్సుల యాజమాన్యాలకు రవాణా శాఖ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పండుగ రద్దీని సాకుగా చూపి ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రయివేటు బస్సుల్లో అనధికారికంగా సరుకు రవాణా చేసినా, కాంట్రాక్ట్‌ క్యారేజీ పర్మిట్‌ ఉండి స్టేజీ క్యారేజీగా నడిపినా ఉపేక్షించేది లేదని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రయివేట్‌ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్టు తేలితే ఆయా వాహనాలను సీజ్‌ చేస్తామని రవాణా శాఖ స్పష్టం చేసింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా, చట్టబద్దంగా వాహనాలు నడపాలని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -