Wednesday, July 30, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసంక్షోభంలో రవాణారంగం

సంక్షోభంలో రవాణారంగం

- Advertisement -

– కేంద్రప్రభుత్వ విధానాలే కారణం : సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌
– తిరువనంతపురంలో ఘనంగా ప్రారంభమైన ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ 12వ జాతీయ మహాసభలు
– సౌహార్ద్ర సందేశాలు ఇచ్చిన పలు దేశాల ప్రతినిధులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

దేశంలో రవాణారంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నదని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ అన్నారు. దీనికి కేంద్రంలోని మోడీ సర్కార్‌ విధానాలే ప్రధాన కారణమని వివరించా రు. ఈ విధానాలను ఐక్యంగా తిప్పికొడితేనే రవాణారంగంలో కార్మికుల మనుగడ సాధ్యమవుతుందని చెప్పారు. అఖిలభారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య (ఏఐఆర్‌టీడ బ్ల్యూఎఫ్‌) 12వ జాతీయ మహాసభలు మంగళవారం కేరళ రాష్ట్రంలోని తిరువనంత పురంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో దేశం నలుమూలల నుంచి వచ్చిన 550 మంది ప్రతినిధులు, 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొంటున్నారు. మహాసభల ప్రారంభంలో సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులు కేకే దివాకరన్‌ పతాక అవిష్కరణ చేశారు. సీఐటీయు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. భారతదేశం రవాణా రంగం జీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్నదని అన్నారు. దేశంలోని 10 కోట్ల మంది రవాణారంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు చేయడంతో దేశంలోని 58 ఆర్టీసీలు బడ్జెట్‌ కేటాయింపులు లేక కొత్త బస్సులు కొనుగోలు చేయలేకపోతున్నాయని తెలిపారు. విద్యుత్‌ బస్సులను ప్రయివేటు బహుళజాతి సంస్థలకు కట్టబెడుతున్నారే తప్ప, ఆర్టీసీలకు కేటాయించట్లేదని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల లారీ, ఆటో, ఈ-రిక్షా కార్మికులు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, వారికోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కేవలం కేరళలోని వామపక్ష ప్రభుత్వం మాత్రమే రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, ఆదర్శంగా నిలిచిందన్నారు. రవాణారంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాల్లో సీఐటీయూ పూర్తిగా వారికి మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. జులై 9న జరిగిన జాతీయ సార్వత్రిక సమ్మెను దేశ కార్మిక వర్గం జయప్రదం చేసిందంటూ వారికి అభినందనలు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో యాప్‌ బేస్‌డ్‌ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారనీ, వారికి ఎలాంటి చట్టాలు వర్తించటం లేదని తెలిపారు. ఓలా, ఊబర్‌ వంటి నిరుద్యోగ యువతను ఆర్థిక దోపిడీకి గురిచేస్తున్నాయనీ, అందువల్ల కేంద్ర ప్రభుత్వమే ఒక యాప్‌ను తయారు చేసి రవాణారంగ కార్మికులకు అందించాలని సూచించారు. ఐక్యంగా ఉన్న కార్మిక వర్గాన్ని విడగొట్టేందుకు మతోన్మాద శక్తులు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నాయనీ, వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మహాసభకు సమాఖ్య జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు కేకే దివాకరన్‌ అధ్యక్షత వహించారు. ఆహ్వాన సంఘం చైర్మెన్‌, ఎమ్మెల్యే సుందరం స్వాగతోపన్యాసం చేశారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు స్వదేశ్‌దేవ్‌ రారు, జాతీయ కార్యదర్శి కరుమలియన్‌, ఎల్‌పీఎఫ్‌ జనరల్‌ సెక్రటరీ నటరాజన్‌, ఏఐసీసీటీయూ ప్రతినిధి అభిషేక్‌, టీఎస్‌ఎఫ్‌ ప్రతినిధి సంపత్‌, టీయూసీఐ ప్రతినిధి పాల్స్‌జార్జ్‌, టీడీఎస్‌ఎఫ్‌ ప్రతినిధి ఎల్‌ రమణ్‌ బెహెరా, ట్రేడ్‌ యూనియన్‌ ఇంటర్నేషనల్‌ (ట్రాన్స్‌పోర్ట్‌) ఆసియా పసిఫిక్‌ ప్రాంత అధ్యక్షుడు అలీ రిజ్వీ తదితరులు సౌహార్ద్ర సందేశాలు ఇచ్చారు. సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య కార్యకలాపాల నివేదిక సమర్పించారు. ఆర్థిక నివేదికను సీకే హరికృష్ణన్‌ సమర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -