చర్చలు ఫలప్రదం అంటూ అమెరికా అధ్యక్షుడి పోస్ట్
ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన సదుపాయాలపై దాడులు వాయిదా
నమ్మలేం..చర్చలే జరగలేదు : ఇరాన్ ప్రకటన
పెదవి విప్పని ఇజ్రాయిల్…దాడులు కొనసాగింపు
వాషింగ్టన్ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘ఇరాన్‌తో రెండు రోజులుగా సానుకూలంగా చర్చలు జరుగుతున్నాయి. అందువల్ల ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నాం.’ అంటూ సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన పోస్టు కలకలం రేపింది. ‘హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ..’ అంటూ ఆయన విధించిన డెడ్‌లైన్ మరికొన్ని గంటల్లో ముగియనుండటంతో ఏ క్షణమైనా భీకర దాడులు ప్రారంభమవుతాయని ప్రపంచమంతా ఆందోళన చెందుతున్న సమయంలో ట్రంప్ సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో ప్రత్యక్షమైన ఈ పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సోమవారం సాయంత్రం ఈ ప్రకటన చేసిన తరువాత మూడు సార్లు విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్‌తో చర్చలు జరిగుతున్నా యని, ఒక కీలకమైన నేతతో మాట్లాడుతున్నామని, మంచి డీల్ కుదురుతుందని, ఇజ్రాయిల్‌కు కూడా ఈ డీల్ నచ్చుతుందని చెప్పారు. అయితే, చర్చలే జరగలేదని, అటువంటి అవకాశమే లేదని ఇరాన్ ప్రకటించడంతో ట్రంప్ చేసిన ఈ ప్రకటనల వెనుక మతలబేంటన్న దానిపై రకరకాల విశ్లేషణలు వెలువడ్డాయి.ట్రంప్ మరో గేమ్‌కు తెరతీశారా…అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తగ్గట్టే ట్రంప్ పోస్ట్‌పై అమెరికా నుండి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇజ్రాయిల్ ఇరాన్‌పై దాడులు కొనసాగించింది. ట్రంప్ ప్రకటనపై పెదవి విప్పడానికి ఇజ్రాయిల్ నేతలు సిద్ధపడలేదు.
ఇరాన్ డీల్ కోరుకుంటోంది : ట్రంప్
సోమవారం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో విమానం ఎక్కే ముందు విలేకర్లతో మాట్లాడిన ట్రంప్ ‘ఇరాన్‌తో చాలా బలమైన చర్చలు జరిగాయి. వారు వాటిని కొనసాగిస్తే, సంఘర్షణ ముగుస్తుంది. వారు ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నారు, మేము ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నాము”అని అన్నారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ‘ఒప్పందం కుదిరితే పర్షియన్ గల్ఫ్‌లోని చోకింగ్ పాయింట్, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ త్వరలో తెరుస్తారు, ఒప్పందం కుదిరిన వెంటనే చమురు ధర పడిపోతుంది, ఇరాన్ అణు ఆయుధాలు లేకుండా ఉండటానికి అంగీకరించింది” అని చెప్పారు. విమానం దిగిన తరువాత మరోసారి విలేకరులతో ‘నేను ఇరాన్‌లో కొత్త వ్యక్తులతో మాట్లాడుతున్నాను. వారు కీలక నేతలు కూడా’ అని ట్రంప్ చెప్పారు. ఆ తరువాత మరోసారి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘చర్చలు బాగా జరిగితే సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే మేము బాంబులతో పరిష్కరిస్తాం.’ అని అన్నారు.
ట్రంప్ పోస్టులో ఏముంది?
‘పశ్చిమాసియాలో ఉన్న వైరం పూర్తిగా, సమగ్రంగా పరిష్కరించేందుకు ఇరాన్‌తో రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నాం. ఇవి మంచి, ఫలప్రదమైన వాతావరణంలో జరుగుతున్నాయని తెలియచే యడం చాలా సంతోషంగా ఉంది. సమగ్రంగా, సవివరంగా, నిర్మాణాత్మక ంగా జరుగుతున్న ఈ చర్చలు ఈ వారం అంతా కొనసాగుతాయి. ఈ చర్చల సానుకూలతను, విజయాన్ని పరిగణనలోకి తీసుకొని, ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక వసతులపై జరిగే అన్ని సైనిక దాడులను ఐదు రోజులపాటు వాయిదా వేయాలని యుద్ధ విభాగానికి ఆదేశించాను.’ అని ట్రంప్ పోస్టులో పేర్కొన్నారు.
ఇజ్రాయిల్ ఇలా…
అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఇజ్రాయిల్ పెదవి విప్పలేదు. రాత్రి పొద్దు పోయేంత వరకు కూడా వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు ఇజ్రాయిల్ అధికారిక వైఖరిని తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే ట్రంప్ చేసిన ప్రకటన అమెరికాకే పరిమితమని, తాము మాత్రం దాడులు కొనసాగించాలన్న వైఖరితోనే ఇజ్రాయిల్ నేతలు ఉన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి.
ఇరాన్ స్పందన
తమతో చర్చలు జరిపామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన పూర్తిగా అసత్యమని, అమెరికాతో ఎటువంటి చర్చలు జరపలేదని, దాడులు వాయిదా అంటూ ఆయన చేసిన ప్రకటనను నమ్మలేమని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్‌తో పాటు, విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధితో పాటు, ఆ దేశానికి చెందిన పలువురు నేతలు ‘అమెరికాతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగాకానీ ఎటువంటి చర్చలు జరగలేదు’ అని స్పష్టం చేశారు. ఇరాన్ రిపబ్లిక్ గార్డ్ ‘ట్రంప్‌ను మోసగాడు’గా పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ‘దాడులు వాయిదా’ అంటూ ట్రంప్ పోస్ట్ వెలువడిన కాసేపటికే ఇజ్రాయిల్ ఇరాన్‌కు చెందిన రేడియో కేంద్రంపై దాడులు చేసింది.
ఆ తరువాత కూడా ఇరాన్‌తో పాటు ఆ దేశానికి మద్దతు ఇస్తున్న వివిధ గ్రూపులపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో కొందరు పౌరులు కూడా మరణించారు. ‘మా హెచ్చరికలతో ట్రంప్ భయపడిపోయారు .. ట్రంప్‌తో ప్రత్యక్షంగా గానీ మధ్యవర్తుల ద్వారా గానీ ఎలాంటి చర్చలు జరగలేదు’ అని కూడా ఇరాన్ పేర్కొంది. ‘ఈ యుద్ధంలో పూర్తిస్థాయి చర్చలను ఎప్పుడో తిరస్కరించాం. వాస్తవానికి యుద్ధాన్ని ప్రారంభించిన దేశం( ఇజ్రాయిల్) చొరవ చూపాల్సింది. కానీ అలా జరగలేదు. గల్ఫ్ దేశాల ఒత్తిడితో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోకతప్పలేదు. అయితే చర్చల ప్రస్తావనంతా ముడిచమురు కోసమే. ఇదంతా ట్రంప్ ఆడుతున్న డ్రామా.” అని మరో ప్రకటనలో ఇరాన్ నేతలు పేర్కొన్నారు.
బాధ్యుడు ట్రంపే
సీఐఏ మాజీ చీఫ్
ట్రంప్‌పై అమెరికా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి, సీఐఏ మాజీ డైరెక్టర్ లియోన్ పనెట్టా విమర్శలు సంధించారు. ప్రస్తుతం ఇరాన్‌లో నెలకొన్న సంక్షోభానికి ట్రంప్ మినహా వేరెవ్వరూ బాధ్యులు కారని వ్యాఖ్యానించారు. రెండు సమానమైన, కష్టతరమైన పరిస్థితుల మధ్య ఆయన చిక్కుకుపోయారని చెప్పారు. యుద్ధం నుంచి బయటపడే వ్యూహమేదీ ట్రంప్ వద్ద లేదని తెలిపారు.



