Tuesday, September 30, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిట్రంప్‌ సుంకాలు, జీఎస్టీ సర్దుబాట్లు

ట్రంప్‌ సుంకాలు, జీఎస్టీ సర్దుబాట్లు

- Advertisement -

భారతదేశం మీద ట్రంప్‌ సాగిస్తున్న సుంకాలదాడి వలన మన ఆర్థిక వ్యవస్థ నిస్సందేహంగా వెనక్కిపోతుంది. ఒకవేళ ట్రంప్‌ ఇప్పుడు విధిస్తున్న యాభై శాతం సుంకం రేటు తగ్గించినా, దానికి బదులుగా మన దేశం కూడా అమెరికన్‌ సరుకుల మీద, ముఖ్యంగా అక్కడి వ్యవసాయ ఉత్పత్తుల మీద, డెయిరీ ఉత్పత్తుల మీద సుంకాలు తగ్గిం చాల్సి వుంటుంది. అలా తగ్గిస్తే, ఆ సరుకుల దిగుమతులు బాగా పెరుగుతాయి. దాని ఫలితంగా మన దేశంలో రైతుల ఆదాయాలు తగ్గుతాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ ట్రంప్‌ సుంకాల వలన ఇలా ముడుచుకుపోకుండా ఉండాలంటే దేశీయ ఆర్థిక వ్యవస్థకి అదనపు కొనుగోలుశక్తిని కల్పించాల్సి వుంటుంది. ఈ పని జరగడానికి మూడు అవకాశాలు ఉన్నాయి. మొదటిది: ద్రవ్యలోటును పెంచడం. రెండవది: ధనవంతులమీద అదనపు పన్నులు విధించి తద్వారా లభించే అదనపు ఆదాయాన్ని ప్రభుత్వం ఖర్చు చేయడం (అలా చేయడం వలన ధనవంతులవద్ద ఖర్చు కాకుండా ఉండిపోయిన ధనం ప్రభుత్వ వ్యయంగా మారుతుంది). మూడవది: వ్యక్తులకు రుణాలు అందించి వాటిని వాళ్లు ఖర్చుచేసే విధంగా ప్రోత్సహించడం (దీనివలన ప్రయివేటు వ్యక్తుల పొదుపు తగ్గి ఖర్చు పెరుగుతుంది).

ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్‌ 22 నుండి అమల్లోకి వస్తున్నాయి. ఈ మార్పుల వల్లనే ఆర్థిక వ్యవస్థలోకి అదనపు కొనుగోలుశక్తి ఏమీ వచ్చి చేరదు. ఇప్పుడు చేసిన మార్పుల అనంతరం రెండే రేట్లు-5 శాతం, 18 శాతం అమలులో ఉంటాయి (కొన్ని ”పాపపు సరుకులు’ మాత్రం ఇప్పుడు నలభై శాతం రేటు పరిధిలోకి వస్తాయి). గతంలో 5, 12, 18. 28 శాతం-ఇలా నాలుగు రకాల రేట్లు ఉండేవి. ఇప్పుడు చేసిన మార్పుల ఫలితంగా కల్పించిన రాయితీల ప్రయోజనాలు వినియోగదారులకు గనుక అందితే వారి మీద ఇప్పుడున్న భారం కొంత తగ్గుతుంది. కాని ఈ రేట్లు తగ్గింపు వలన ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గుతుంది. అలా తగ్గిన మేరకు ప్రభుత్వం తన వ్యయాన్ని గనుక తగ్గించుకుంటే అప్పుడు మార్కెట్‌ లోకి అదనపు కొనుగోలు శక్తి నికరంగా ఏమీ వచ్చి చేరదు. అదే ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకోకుండా ద్రవ్యలోటును పెంచితే అప్పుడు అదనపు కొనుగోలుశక్తి కలుగుతుంది. ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకుంటే అప్పుడు జీఎస్టీ తగ్గింపు వలన పెరిగిన అదనపు కొనుగోలుశక్తి కాస్తా తగ్గిన ప్రభుత్వ వ్యయం కారణంగా హరించుకుపోతుంది. ట్రంప్‌ సుంకాల దాడి ఫలితంగా మనదేశ ఆర్థికవ్యవస్థ స్థూల డిమాండ్‌ పడిపోవడాన్ని ఇలా జీఎస్టీ సుంకాల తగ్గింపుతో నివారించలేం.

ఇప్పుడు జీఎస్టీ తగ్గింపు వలన మొత్తంగా శ్రామిక ప్రజల వినిమయం పెరగబోతోందని ప్రభుత్వం చెప్పు కుంటోంది. అలా జరగడం కూడా ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఇచ్చిన పన్ను రాయితీల వలన కొన్ని రకాల సరుకులకు మార్కెట్‌ పెరిగి ఆ సరుకులను ఉత్పత్తి చేసే పరిశ్రమల్లో కార్మికుల వేతనాలు కూడా ఆ మేరకు పెరగవచ్చు. కాని అదే సమయంలో ప్రభుత్వానికి ఇంతవరకూ వచ్చిన జీఎస్టీ ఆదాయం ఈ రాయితీల వలన తగ్గిన కారణంగా ప్రభుత్వం తన వ్యయాన్ని ఆ మేరకు తగ్గించుకుంటే ఏ యే రంగాల్లో ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకుంటుందో ఆయా రంగాల్లో కార్మికుల వేతనాలు ఆ మేరకు తగ్గిపోతాయి. మొత్తంగా శ్రామిక ప్రజల కొనుగోలు శక్తిని కలిపి చూసినప్పుడు ఏ మార్పూ ఉండదు. ఇదేదో ఊహించి చెప్పేది కాదు. ప్రభుత్వం తన వ్యయాన్ని గనుక తగ్గించుకోవలసి వస్తే అది ప్రధా నంగా మౌలిక వసతుల నిర్మాణ రంగంలో అమలు చేస్తుంది. ఈ నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మొత్తం వేతనాల్లో ఈ రంగపు కార్మికుల వేతనాల వాటా కూడా ఎక్కువగానే ఉంటుంది. అటువంటి రంగం లో ప్రభుత్వ వ్యయం తగ్గితే అప్పుడు ఆ రంగంలోని కార్మికుల వేతనాలు తగ్గిపోవడం కూడా ఎక్కువగానే ఉంటుంది.
చెప్పొచ్చేదేమంటే ట్రంప్‌ సుంకాల పెంపు వలన శ్రామిక ప్రజల ఆదాయాలు ఇక్కడ ఏ మేరకు తగ్గిపోతాయో ఆ మేరకు తగ్గే కొనుగోలుశక్తిని భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇక్కడ తీసుకుంటున్న చర్యలు సరిపోవు. ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ రాయితీలతోబాటు ద్రవ్యలోటును పెంచి ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించకుండా అదేస్థాయిలో కొన సాగించడమన్నా చేయాలి, లేదా ధనవంతుల మీద అదనపు పన్నుల భారాన్ని మోపి ప్రభుత్వ ఆదాయంలో లోటు ఏర్పడకుండానైనా చూడాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయనప్పుడు జీఎస్టీ రాయితీల వలన శ్రామిక ప్రజల వినిమయ స్థాయి ఏ విధంగానూ పెరగదు.

జీఎస్టీ రేట్ల సవరణ ఫలితంగా ప్రభుత్వం ఎంత ఆదాయాన్ని కోల్పోనుంది? ఈవిషయమై పత్రికల్లో రకరకాల నివేదికలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా తన ఆదాయం ఒక ఏడాది కాలంలో రూ.48వేల కోట్ల మేరకు తగ్గవచ్చునని ప్రకటించింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు వలన రూ.93వేల కోట్ల ఆదాయం తగ్గవచ్చునని, అయితే, ”పాపపు సరుకుల” మీద విధించిన నలభై శాతం జీఎస్టీ వలన అదనంగా రూ.45వేల కోట్ల ఆదాయం రావచ్చునని, మొత్తంగా చూసినప్పుడు రూ.48వేల కోట్లు తగ్గుతుందని లెక్క వేసింది. ఇక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జీఎస్టీ ఆదాయం ఒక పూర్తి ఏడాదిలో కేవలం రూ.3,700 కోట్లు మాత్రమే తగ్గనున్నట్టు అంచనా వేసింది. జీఎస్టీ రేట్లను తగ్గించినందువలన వినిమయం బాగా పెరుగుతుందని, అందువలన మొత్తం మీద చూసినప్పుడు రెవెన్యూలో నష్టం నామమాత్రంగానే ఉండవచ్చునని ఎస్‌బిఐ అంచనా వేసింది. వివిధ ప్రయివేటు సంస్థల, వ్యక్తుల అంచనాల ప్రకారం ప్రభుత్వం ఏడాదికి రూ.1.2 లక్షల కోట్ల నుండి రూ.1.5 లక్షల కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోనుంది. అయితే ఈ అంచనాలకు ప్రాతిపదిక ఏమిటి అన్నది మాత్రం వాళ్లెవ్వరూ వెల్లడించలేదు.

పన్ను రేటు తగ్గినందువలన వినిమయం బాగా పెరుగుతుం దన్న వాదన నుంచి ఒకప్రశ్న తలెత్తుతుంది. అలా పెరిగే వినిమయానికి సరిపడా అదనపు కొనుగోలుశక్తి ఏ విధంగా సమకూరుతుంది? అన్నదే ఆ ప్రశ్న. ఉదాహరణకు: పన్ను రాయితీ రూ.100 మేరకు ఇచ్చినప్పుడు వినిమయం కూడా రూ.100 వరకూ పెరుగుతుందని భావించవచ్చు. కాని రూ.100 పన్ను రాయితీ ఫలితంగా వినిమయం రూ.200 వరకూ పెరుగుతుందని ఏ విధంగా భావించగలం? అదనంగా వినిమయం కోసం రూ.100 ఎక్కడినుంచి లభిస్తుంది? పన్ను రాయితీల ఫలితంగా తగ్గిన ధరల వలన వినియోగదారులు ఉత్సాహపడి అప్పు చేసో లేక పొదుపు చేసిన సొమ్మును బయటకు తెచ్చో ఖర్చు చేస్తారని వాదిం చవచ్చు. కాస్సేపు ఈ వాదనను అంగీకరిద్దాం. ఇలా అప్పులు చేసేవారిలో శ్రామికవర్గానికి చెందినవారు దాదాపు ఎవరూ ఉండరు. వాళ్లకి రుణాలు ఇచ్చేందుకు ఎవరూ సిద్ధపడరు. ఇక వాళ్ల దగ్గర దాచుకున్న పొదుపు సొమ్ము కూడా ఏమీ ఉండదు.
బహుశా మధ్యతరగతి నెల జీతగాళ్లకు రుణాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరుకుల ధరలు తగ్గినప్పుడు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఈ తరగతివారు ముందుకు రావచ్చు. కాని వీళ్లు అదనంగా కొనుగోలు చేసినందువలన వినిమయంలో వచ్చే ఊపు తాత్కాలికమే. ఎందుకంటే వాళ్లు తీసుకున్న రుణాల వాయిదాలను తిరిగి చెల్లించవలసి వస్తుంది. అప్పుడు వాళ్లు తమ నెలవారీ వినిమయాన్ని తగ్గించుకోక తప్పదు. అందుచేత రుణాల మీద ఆధారపడి వినిమయంలో వచ్చే పెరుగుదల తాత్కాలికంగానే ఉంటుంది. అంతేగాక, ఆ తర్వాత వినిమయం తిరోగమన దిశలోకి మళ్ళీ తగ్గడం ప్రారంభిస్తుంది.

మొత్తం మీద చూసినప్పుడు ట్రంప్‌ సుంకాల దాడి ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి మోడీ ప్రభుత్వం చేసినదేమీ లేదని తేలుతోంది. ట్రంప్‌ సుంకాల దాడి ఫలితంగా దెబ్బ తినిపోయే చిన్న ఉత్పత్తిదారులకు ఆర్థికంగా సబ్సిడీలు ఇచ్చి వారిని ఆదుకోవచ్చు. అందుకోసం కావలసిన అదనపు ధనాన్ని ధనవంతులమీద అదనపు పన్నులు వేయడం ద్వారా రాబట్టవచ్చు (సంపద పన్ను వగైరాలు). కాని మోడీ ప్రభుత్వం అటువంటి పనిచేయడం లేదు. కేవలం జీఎస్టీ తగ్గించినందువల్లే ట్రంప్‌ సుంకాల తాకిడిని తట్టుకోవడం సాధ్యం కాదు. అటువంటి రాయితీలు వినియోగదారులకు అదనపు కొనుగోలుశక్తిని కల్పించలేవు.

అయితే మోడీ ప్రభుత్వం బహుశా ఒక మార్గాన్ని అనుసరించ వచ్చు. ఆ మార్గాన్ని అనుసరిస్తే పాలకవర్గాలన్నీ ఆమోదిస్తాయి కూడా. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ బాండ్లను అమ్మేసి, ప్రభుత్వ రంగ వాటాలను అమ్మేసి జీఎస్టీ ఆదాయపు లోటును భర్తీ చేసుకోవడమే ఆ మార్గం. నిజానికి ప్రభుత్వం ద్రవ్యలోటును పెంచినా లేక ప్రభుత్వ వాటాలను ప్రయివేటు వ్యక్తులకు అమ్మినా బడ్జెట్‌కు సంబంధించి పర్యవసానం ఒకటే. కాని ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ వంటివి ద్రవ్యలోటును పెంచితే కన్నెర్ర చేస్తాయి. అదే ప్రయివేటు వ్యక్తులకు ప్రభుత్వ వాటాలను అమ్మితే ఆమోదిస్తాయి. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు కార్పొరేట్ల పరం కావడమే అవి కోరుకుంటాయి. అందుచేత మోడీ ప్రభుత్వం అటు అంత ర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అధినేతలను, ఇటు భారత బడా కార్పొరేట్‌ శక్తులను ఒకే సారి సంతృప్తిపరిచేందకు సన్నద్ధం అవుతుంది. దాని వలన ఆర్థిక వ్యవస్థ మీద పడే ట్రంప్‌ సుంకాల ప్రభావం నుండి తాత్కాలికంగా తప్పించుకోవచ్చు నేమోగాని, పెట్టుబడి కేంద్రీకరణ. సంపద అసమానతలు మాత్రం మరింత వేగంగా పెరుగుతాయి.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -