Saturday, September 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ నోట మళ్లీ అదే

ట్రంప్‌ నోట మళ్లీ అదే

- Advertisement -

భారత్‌-పాక్‌ ఘర్షణను పరిష్కరించా
వచ్చే నెలలో మోడీ-ట్రంప్‌ భేటీ..?

లండన్‌ : ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనలో జోక్యం చేసుకొని దానిని పరిష్కరించానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి పునరుద్ఘాటించారు. తాను భారత్‌కు చాలా సన్నిహితుడినని, ప్రధాని నరేంద్ర మోడీతో బలమైన వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ భారత్‌పై యాభై శాతం సుంకాలు విధించానని తెలిపారు. బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌తో కలిసి ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న ఘర్షణ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తనకు అతి పెద్ద అసంతృప్తి కలిగించారని వ్యాఖ్యానించారు. ‘చమురు ధరలు తగ్గితే పుతిన్‌ యుద్ధాన్ని ఆపేస్తారు. ఆయనకు అంతకంటే వేరే దారి లేదు. ఆయన యుద్ధం నుంచి వైదొలుగుతారు’ అని చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌, పాకిస్తాన్‌ మధ్య పెరిగిన శత్రుత్వాన్ని తగ్గించడానికి వాణిజ్యాన్ని ఓ వ్యూహంగా ఉపయోగించానని ట్రంప్‌ తెలిపారు.

వచ్చే నెలలో మోడీ-ట్రంప్‌ భేటీ..?
త్వరలో ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కానున్నట్టు లీకులు వస్తున్నాయి. అక్టోబరులో మలేసియా వేదికగా జరగనున్న ఆసియాన్‌ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ, ట్రంప్‌ హాజరవుతారు. ఈ సదస్సుకు అనుబంధంగా మోడీ-ట్రంప్‌ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం ఇరుదేశాల నేతలు మొదటిసారి భేటీ అవనున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలు, భారత్‌పై టారిఫ్‌ల వేళ ఈ భేటీ జరుగుతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అక్టోబర్‌లో మలేసియాకు వచ్చే అవకాశముందని ఆ దేశ ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం ఇటీవల పేర్కొన్నారు. ఆసియాన్‌ శిఖరాగ్ర సమావేశానికి హాజరవ్వాలనుకుంటున్నట్లు ట్రంప్‌ తనకు ఫోన్‌ చేసి చెప్పారన్నారు. అయితే ఈ భేటీపై ఇంకా అమెరికా, భారత ప్రభుత్వాలు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆ సమయంలోనే ఏడాది ఇండియాలో జరగనున్న క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సుకు రావాలని మోడీ ట్రంప్‌ను కోరగా అందుకు ఆయన అంగీకరించినట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -