పశ్చిమాసియా పరిస్థితులపై చర్చలు
హార్మూజ్‌ను తెరిచి వుంచాలన్న నేతలు
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించారు. హార్మూజ్ జలసంధిని తెరిచి వుంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.ట్రంప్‌తో మాట్లాడిన అనంతరం మోడీ స్పందిస్తూ, పశ్చిమాసియాలో తక్షణమే ఉద్రిక్తతలు తగ్గాలని భారత్ కోరుకుంటోందని తెలియచేసినట్లు చెప్పారు. హార్మూజ్ జలసంధిని తెరిచి వుంచుతూ, సురక్షితంగా అన్ని నౌకలకూ అందుబాటులోకి తేవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పినట్లు తెలిపారు. హార్మూజ్‌ను తెరిచేందుకు ఇరాన్‌కు ఐదు రోజులు గడువిస్తున్నామంటూ వాషింగ్టన్ ప్రకటించిన మరుసటి రోజు నేతల మధ్య ఈ ఫోన్ కాల్ చోటు చేసుకుంది. ట్రంప్ నుండి ఫోన్ కాల్ వచ్చిందని, పశ్చిమాసియాలో పరిస్థితులపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నామని మోడీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. సాధ్యమైనంత త్వరలో అక్కడ శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోందన్నారు. ఇరువురు నేతలు తరచుగా మాట్లాడుకోవాలని భావించారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో మోడీ మాట్లాడిన రోజుల వ్యవధిలోనే ట్రంప్ కాల్ వచ్చింది. అనంతరం న్యూఢిల్లీలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఈ చర్చలపై ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
తీవ్ర పర్యవసానాలు తప్పవన్న ప్రధాని
అంతకుముందు రాజ్యసభలో ప్రధాని మాట్లాడుతూ, పశ్చిమాసియాలో ఈ సంక్షోభం ఇలాగే దీర్ఘకాలం కొనసాగితే తీవ్ర పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు. యుద్ధం వెంటనే ఆగాలని, ఉద్రిక్తతలు చల్లారాలన్నది భారత్ అభిమతమని చెప్పారు. హార్మూజ్‌ను తెరిచి అన్ని నౌకల సురక్షిత రవాణాకు వెసులుబాటు కల్పించాలని కోరుకుంటున్నామని చెప్పారు. సోమవారం లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని పశ్చిమాసియా పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌కు ఈ సంక్షోభం అనూహ్యమైన సవాళ్ళను విసురుతోందన్నారు. ఆ సవాళ్ళు కేవలం ఆర్థికమైనవే కావని, దేశ భద్రతకు సంబంధించినవి, ఆలాగే మానవతా కోణానికి సంబంధించినవని మోడీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధం నాల్గవ వారంలోకి ప్రవేశించింది. యుద్ధ సంక్షోభంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు తీవ్రంగా ఒడిదుడుకులకు గురవుతున్నాయి. భారత్ సహా పలు దేశాలకు సరఫరా చెయిన్‌లకు ఆటంకం కలుగుతోంది.
మోడీకి ట్రంప్ ఫోన్ కాల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



