భారత జీడీపీకి ఒక శాతం కోత
ఇప్పటికే ఎగుమతిదారులు, కార్మికులపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ : భారత్‌పై అమెరికా విధించిన టారిఫ్‌ల భారం అక్షరాల రూ.1 లక్ష కోట్లకు పైనే ఉన్నది. అంతేకాదు ఈ సుంకాలు దేశ జీడీపీని ఒక శాతం తగ్గించే అవకాశాలున్నాయి. కాబట్టి భారత్.. జీడీపీ ముందస్తు అంచనాలను అందుకోకపోవచ్చని తెలుస్తున్నది. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు, తదనంతర పరిణామాలు, పరిష్కారాలు, సూచనలను చేస్తూ ఆర్థిక నిపుణులు విశ్లేషణలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారత్‌పై పరస్పర సుంకాలు 25 శాతం, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదన్న కారణంతో పెనాల్టీగా మరో 25 శాతం టారిఫ్‌ను విధించిన విషయం విదితమే. అయితే అమెరికా టారిఫ్‌ల భారం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై పడిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు.
అమెరికా సుంకాల భారంతో దేశీయ పన్ను ఆదాయంలో రూ.0.68 ట్రిలియన్ల తగ్గుదల కనబడింది. దేశ ఆదాయంపై ప్రభావం చూపి దాని ఫలితం జీడీపీపై పడనున్నది. వాస్తవానికి భారత్‌కు అమెరికా కీలక మార్కెట్‌గా ఉన్నది. దీంతో భారత్ నుంచి అటువైపు ఎగుమతులు భారీగానే జరిగేవి. కాబట్టి ఈ టారిఫ్‌ల భారం ఎగుమతిదారులు, ఈ రంగంపై ఆధారపడే కార్మికులపై పడింది. ఇప్పుడు వారిని సుంకాల సుడిగుండం నుంచి తప్పించాలంటే భారత్‌కు భారీ మొత్తంలో నిధులు కావాల్సి ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఆరు నెలల పాటు స్వల్ప వడ్డీలకు రుణాలు, ఎక్స్‌గ్రేషియా వంటివి ప్రకటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఏడాది జీడీపీ వృద్ధి అంచనా ఏడు శాతంగా నిర్దేశించారు. అయితే ట్రంప్ టారిఫ్‌ల కారణంగా అది ఆరు శాతానికి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు నిపుణులు రెండు కీలక కార్యక్రమాలను సూచిస్తున్నారు. అందులో ఒకటి ప్రభావితమైన ఎక్స్‌పోర్ట్ కంపెనీలకు ఆర్థిక సహాయ పథకం. అంటే చౌక వడ్డీకే ఉత్పత్తిదారులు, కార్మికులకు రుణాలు ఇవ్వటం. దీని ద్వారా ఉపాధి కోల్పోయినవారు ఎంతో కొంత కోలుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అమెరికాకు ప్రత్యామ్నాయంగా మార్కెట్‌ను కనుగొనేంత వరకూ ఈ సాయం వారికి ఉపశమనం కలిగిస్తుంది. రెండోది.. ఆర్థిక క్రమశిక్షణ. ఈ ఏడాది బడ్జెట్‌లో నిర్దేశించిన ఆర్థిక లోటు లక్ష్యాన్ని జీడీపీలో 4.4 శాతంగా నిలుపుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కాగా భారత్‌కు అవసరమైన రూ.1 లక్ష కోట్లు దేశ మూలధన బడ్జెట్ రూ.11.21 ట్రిలియన్లలో 9 శాతమని చెప్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనే వరకు ఉత్పత్తి, ఎగుమతులను కాపాడుకోవాలని సూచిస్తున్నారు.
ట్రంప్ ట్రేడ్ అంతరాయం అమెరికాతో సహా ప్రపంచ డిమాండ్‌ను తగ్గిస్తుంది. అధిక సుంకాల ఎఫెక్ట్ అమెరికాలోని వినియోగదారులకూ భారంగా మారింది. ప్రపంచ వృద్ధి రేటును తగ్గిస్తుంది. 2025 ఏడాదికి గానూ వృద్ధిరేటును మూడు శాతంగా అంచనా వేయగా.. అది ఈసారి అంతకంటే తక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అమెరికా ఆర్థిక వృద్ధి రేటు మందగించి అంచనా వేసిన 2.4 శాతం కంటే తక్కువగా నమోదు కావచ్చు.
భారత్‌తో వాణిజ్యం ‘ఏకపక్షమే’ : ట్రంప్
అమెరికాకు భారత్‌తో వాణిజ్య బంధం ‘ఏకపక్షమే’నని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత ప్రధాని మోడీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌లను కలిసిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు రావటం గమనార్హం. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ”భారత్‌తో మనం చాలా తక్కువ వ్యాపారం చేస్తాం. కానీ వారు మనతో అపారమైన వ్యాపారం చేస్తారని చాలా తక్కువ మందికి అర్థం అవుతుంది. మరోమాటలో చెప్పాలంటే, వారు(భారత్) మనకు భారీ మొత్తంలో వస్తువులను అమ్ముతారు, మనం వారికి అమ్మేది చాలా తక్కువే. ఇప్పటి వరకు ఉన్నది ఏకపక్ష సంబంధమే. చాలా దశాబ్దాలుగా ఉన్నది ఇదే” అని ఆయన రాసు కొచ్చారు. భారత్ విధించిన అధిక సుంకాలు అమెరికా వ్యాపారాలు అక్కడ(భారత్) వస్తువులను అమ్మ కుండా నిరోధించాయని వివరించారు. ఈ పరిస్థితి పూర్తిగా ఏకపక్ష విపత్తుకు దారి తీసిందని చెప్పారు. భారత్.. చమురు, సైనిక ఉత్పత్తులను రష్యా నుంచి ఎక్కువగా, అమెరికా నుంచి చాలా తక్కువగా కొనుగోలు చేస్తోన్నదని ట్రంప్ గుర్తించారు. సుంకాలను పూర్తిగా తగ్గించు కుంటామని భారత్ ప్రతిపాదించిందన్న ట్రంప్.. ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యం జరిగిందని వివరిం చారు. వారు(భారత్) దీనిని చాలా ఏండ్ల క్రితమే చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఎస్‌సీఓ సమావేశాల్లో భాగంగా భారత్, చైనా, రష్యాలు ఒకే వేదికపైకి రావటం ట్రంప్‌ను మరింత కలవపెడుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
ట్రంప్ టారిఫ్ భారం రూ.లక్ష కోట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES