Friday, November 7, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువస్త్ర పరిశ్రమపై ట్రంప్‌ సుంకాల దెబ్బ

వస్త్ర పరిశ్రమపై ట్రంప్‌ సుంకాల దెబ్బ

- Advertisement -

జౌళి, హస్తకళకు తప్పని తిప్పలు
తగ్గిన ఉత్పత్తులు
అల్లాడిపోతున్న కార్మికులు
తలలు పట్టుకుంటున్న నేతన్నలు!
20వేల మందికి ఉపాధి ఉఫ్‌
నిలిచిపోయిన ఎగుమతులు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ట్రంప్‌ విధించిన సుంకాల దెబ్బకు వస్త్ర పరిశ్రమ విలవిలలాడుతోంది. రాష్ట్రంలోని చేనేత, జౌళి, హస్తకళల రంగాలను ఈ టారీఫ్‌లు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 7 నుంచి అమెరికా ప్రభుత్వం భారత్‌ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై 50 శాతం సుంకాన్ని అమలు చేయడంతో, రెండు నెలల్లోనే తెలంగాణ ఉత్పత్తుల ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ మార్పు స్థానిక పరిశ్రమలకు పెద్ద దెబ్బగా మారింది. రాష్ట్రంలోని చేనేత, జౌళి పరిశ్రమలతో పాటు హస్తఖళాకండాల తయారీ కేంద్రాలన్నింటిపైనా ట్రంప్‌ సుంకాల ప్రభావం పడింది. దీంతో తయారీ రంగాల్లో ఉత్పతి తగ్గడంతో వేలాది మంది కార్మికుల ఉపాధికి గండిపడింది.

తగ్గిన ఆర్డర్లు..
రాష్ట్రంలో జౌళి రంగం ప్రధానంగా నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించింది. కరీంనగర్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోనూ అనేక పెద్ద, మధ్యతరహా, చిన్న పరిశ్రమలున్నాయి. వీటిలో పురుషులు, మహిళలు, పిల్లల దుస్తులతో పాటు వివిధ వస్త్ర ఉత్పత్తులు తయారవుతుంటాయి. సాధారణంగా తెలంగాణ నుంచి అమెరికాకు ఏడాదికి సుమారు రూ.170 కోట్ల విలువైన జౌళి ఉత్పత్తులు ఎగుమతవుతుంటాయి. రెండు నెలలుగా ఆర్డర్లు గణనీయంగా తగ్గాయి. దీంతో అమెరికాలో డిమాండ్‌ ఉన్న ఎగుమతి ఆధారిత వస్త్రాల ఉత్పత్తిని రాష్ట్రంలోని జౌళి కంపెనీలు తగ్గించాయి. అమెరికా కంపెనీలు నేరుగా ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా, ముంబయి, ఢిల్లీ, అహ్మదాబాద్‌ల్లో ఉన్న సంస్థల ద్వారా కూడా ఆర్డర్లు వస్తాయి. కానీ ట్రంప్‌ సుంకాలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ ఆర్డర్లు ఒక్కసారిగా తగ్గాయి. దీనివల్ల అమెరికా మార్కెట్‌పై ఆధారపడి పనిచేసే కంపెనీలు ఉత్పత్తిని తగ్గించక తప్పలేదు.

ఉపాధికి గండి..
ఎగుమతుల కోసం ఆర్డర్లు లేకపోవడంతో ఉత్పతి తగ్గిపోయి కార్మికులు ఉపాది కోల్పోతున్నారు. రాష్ట్రంలో చేనేత, జౌళి, హస్తకళల రంగాల్లో దాదాపు 75వేల మంది ఉపాధి పొందుతున్నారు. రెండు నెలలుగా 20వేల మందికి సరిగా ఉపాధి అనేది దొరకడం లేదు. ఈ రంగాల్లో పనిచేసే రోజువారీ కూలీలకు కూడా తగినంత పని దొరకడం లేదు.

హస్తకళలపై
పెంబర్తిలో ఇత్తడి ప్రతిమలు, కరీంనగర్‌లో బంగారు వెండి తీగలతో తయారు చేసే (ఫిలిగ్రీ) కళారూపాలు, చెక్క, లోహం, వస్త్రాలతో తయారు చేసే నిర్మల్‌ బొమ్మలు, గిరిజన కళాకారులు తయారుచేసే ఆదిలాబాద్‌ డోక్రా కళా కృతులు ఆమెరికాతో పాటు వివిధ దేశాలకు సుమారు రూ.52కోట్ల మేర ఏటా ఎగుమతి అవుతూ ఉంటాయి. ఆమెరికాలోని ప్రవాస భారతీయులు కార్గో ద్వారా వీటిని దిగుమతి చేసుకునేవారు. రెండు నెలలుగా వీటి ఆర్డర్లు కూడా గణనీయంగా తగ్గాయి.

సిరిసిల్లకు తప్పని తిప్పలు..
పరిశ్రమల యజమానులు చెబుతున్నదాని ప్రకారం సుంకాల మూలంగా భారత వస్త్ర ఉత్పత్తుల ధరలు పెరిగి బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాల నుంచి ఉత్పత్తులు తక్కువ ధరలకు లభిస్తున్నందున, అమెరికా సంస్థలు ఆ దిశగా మళ్లుతున్నాయి. దీనివల్ల తెలంగాణ ఉత్పత్తులపై ఆర్డర్లు మరింతగా తగ్గాయి. సిరిసిల్లలో ఉన్న అనేక వస్త్ర యూనిట్లు ఇప్పటివరకు గుజరాత్‌, మహారాష్ట్ర కంపెనీలకు వస్త్రాలు సరఫరా చేసేవి. ఇప్పుడు ఆ రాష్ట్రాల కంపెనీలూ తమ ఆర్డర్లను తగ్గించడంతో అక్కడి యజమానులు, కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుంకాల ప్రభావంతో జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి వారిని ఆదుకోవాలనీ, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించాలని వస్త్ర రంగ వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

చేనేతలపై..
రాష్ట్రంలో పోచంపల్లి, సిద్దిపేట, గద్వాల, వరంగల్‌ తివాచీలు తదితర వస్త్రాలు ఏటా రూ. 42కోట్ల మేర ఆమెరికాకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇప్పుడు అవి తగ్గాయి. రెండు నెలల నుంచి ఆర్డర్లు పూర్తిగా మందగించాయని వ్యాపారులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -