Tuesday, April 29, 2025
Navatelangana
Homeమానవితుల‌సి వ‌నంలో గంజాయి మొలుస్తోంది..

తుల‌సి వ‌నంలో గంజాయి మొలుస్తోంది..

- Advertisement -

ఇటీవల తెలంగాణాలోని సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలో ఒక హత్య జరిగింది. దానికి కారణం కులాంతర వివాహం. అబ్బాయి దళిత కాగా, అమ్మాయి బీసీ. రెండూ బాగా పరిచయం ఉన్న కుటుంబాలే! అమ్మాయి అన్నదమ్ములు, హత్యకు గురైన కుర్రాడు అంతా దోస్తులే. అయినా హత్య ఎందుకు జరిగింది? అమ్మాయి నానమ్మ ఈ కులాంతర వివాహాన్ని వ్యతిరేకించింది. ‘ఒక దళితుడు నా మనవరాలిని పెండ్లి చేసుకోవటమా? వాడి రక్తం కళ్ళ చూడాలి’ అని ఆమె మనవళ్ళని రెచ్చగొట్టిందట. దాని పర్యవసానం హత్యకు దారి తీసింది. ఆ యువకుల బంగారు భవిష్యత్తు జైలు పాలయింది.
ఏడు దశాబ్దాల కిందటే ఎన్నో సామాజిక, ఆర్థిక మార్పులు తీసుకొచ్చిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటానికి నడిగడ్డ సూర్యాపేట. అలాంటి గడ్డ మీద ఈ హత్య జరిగింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అశేష త్యాగాలతో సాధించినది భూమిని, భుక్తిని, విముక్తిని మాత్రమే కాదు.. గొప్ప సామాజిక సామరస్యాన్ని కూడా.
ఆనాటి రైతాంగ పోరాటం ప్రజలందరినీ ఐక్యంగా ఒక దారిన నడిపించింది. ఆ కాలంలో ఎన్నో కులాంతర, మతాంతర వివాహాలు జరిగాయి. వితంతు పునర్వివాహాలు జరిగాయి. ముఖ్యమైన నాయకులు కులాంతర వివాహాలు, వితంతు పునర్వివాహాలు చేసుకున్నారు. వేలాదిమంది సాధారణ కార్యకర్తలు, సామాన్య ప్రజలు కూడా కులమతాల భేదాలు చూపలేదు. ప్రాంతీయ భేదాలు పట్టించుకోలేదు. మనుషులంతా సమానమే అన్న భావనతో, పరస్పర ఇష్టమే ప్రతిపాదికగా వివాహాలు చేసుకున్నారు.
అప్పటి వారి లక్ష్యం దోపిడీని, దొరల పెత్తనాన్ని, జమీందారుల, జాగీర్దార్ల పెత్తనాన్ని ఎదుర్కోవడమే! ‘నీ బాంచన్‌ ..కాళ్ళు మొక్కుతా ..’ అన్న దుష్ట సంప్రదాయాన్ని వేళ్ళతో సహా పెకలించివేయటమే! కాబట్టే, ఆనాడు వాళ్ళకి కులం, మతం అడ్డుగోడలు కాలేదు. అంతా కలిసికట్టుగా ఉద్యమించారు. పోరాడారు. కులమతాల పేరుతో, దుష్ట సంప్రదాయాల పేరుతో స్త్రీలను అణిచిపెట్టే ధోరణులను నాటి ప్రజల స్ఫూర్తి తుంగలో తొక్కింది. భారతదేశ చరిత్రని మలుపు తిప్పిన ఘనత ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఉన్నది. దురదృష్టవశాత్తు నేడు ఎక్కువ మందికి ఆ ఘనమైన చరిత్ర తెలియదు. ఆ వారసత్వం తెలిస్తే ఈ కుల దురహంకార హత్యలను ఎదుర్కోవటానికి యువత, యావత్‌ సమాజం పూనుకునేది. నాయనమ్మ చాదస్తాన్ని అదేదో గొప్ప కోరిక లాగ ఆ యువకులు పరిగణించి ఉండేవారు కాదు.
ఎందుకిలా జరుగుతోంది?
సమాజంలో కుల, మత దురాభిమానాలు నానాటికీ తగ్గాల్సింది పోయి, ఎందుకు పెరుగుతున్నాయి? తులసి వనంలో గంజాయి మొక్కలను, విషపు ఆలోచనలను ఎవరు పెంచుతున్నారు? కొన్ని దశాబ్దాలుగా కులమతాల చిచ్చును రాజేసే పెద్ద మనుషులు కొందరు బయల్దేరారు. వారే సమాజాన్ని ఆధిపత్య భావజాలంతో నిలువునా చీలుస్తున్న హిందుత్వవాదులు. ఎవరి మతాన్ని, ఆచార వ్యవహారాలను వారు పాటించటం తరతరాలుగా ఉంది. కానీ, ఈ హిందూత్వవాదులు పనిగట్టుకొని ప్రజలను కులం, మతం పేర్లతో విభజిస్తున్నారు. సాంప్రదాయాల పేరుతో స్త్రీలను అణగదొక్కటం వీరి సిద్ధాంతం. మనుధర్మ శాస్త్రం వీరికి మార్గదర్శకంగా ఉంది.
ఈ హిందూత్వవాదుల గురువు రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)ను స్థాపించిన ఎంఎస్‌ గోల్వాల్కర్‌. ఆర్‌ఎస్‌ఎస్‌ నడిపే పత్రిక ‘ఆర్గనైజర్‌’లో 1961 జనవరి 2వ తేదీ సంచికలో ఆ గోల్వాల్కర్‌ ఎంత నీచంగా రాశాడో చూడండి. ”నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలోని పెద్ద కుమారుడు క్షత్రియ, వైశ్య, శూద్ర స్త్రీలను వివాహమాడాలి. అది మన ముందు తరం వారు నెలకొల్పిన గొప్ప సాంప్రదాయం. ఏ కులానికి చెందిన వివాహిత స్త్రీకైనా తన మొదటి బిడ్డకు నంబూద్రి బ్రాహ్మణుడే తండ్రి కావాలి. ఆ తరువాతే తన భర్తతో కలిసి బిడ్డలను కనాలి. జాతిని ఇలా సంపద్వంతం చేయటానికే నంబూద్రి బ్రాహ్మణులు ఉత్తర భారతదేశం నుంచి వచ్చి దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారు…” ఇదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ గురూజీ అనాగరిక పైత్యం! బ్రాహ్మణ పురుషాధిపత్య భావజాలం.
గోల్వాల్కర్‌ వాదన ప్రకారం… ఈ దేశంలో రెండు జాతులు ఉన్నాయన్నమాట. ఒకటి ఉచ్ఛమైన జాతి. రెండోది నీచమైన జాతి. ఉచ్ఛమైన జాతి నంబూద్రి బ్రాహ్మణులు అయితే, మిగతా వారంతా నీచమైన జాతి అనుకోవాలా? ఇతర కులాల్లోని స్త్రీల ద్వారా నంబూద్రి బ్రాహ్మణ సంతానాన్ని వృద్ధి చేయడం ద్వారా మానవజాతిని ఉద్ధరిస్తారా? ఇంతకన్నా ఘోరం ఏమిటంటే- వాళ్ళ దృష్టిలో హిందూ స్త్రీల గర్భాలు బిడ్డలు కనే యంత్రాలు తప్ప మరేమీ కాదు. ఆమెకి ఇష్టాయిష్టాలు అక్కర్లేదు. ఆమె వైవాహిక జీవితానికి విలువ లేదు. ఈ దేశంలో కుల వ్యవస్థను పదిలంగా నిలబెట్టడం, దానిపై బ్రాహ్మణ ఆధిపత్యం సాధించడం … ఇదే ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు ఉద్దేశం.
ఇంకా వారేమంటారంటే- ”సమాజంలో కొంతమంది మేధావులు, కొంతమంది ఉత్పత్తిలో నిష్ణాతులు. కొంతమంది సంపద సృష్టించడంలో గొప్పవాళ్లు, కొంతమంది కాయకష్టం చేయడంలో గొప్పవాళ్లు. కాబట్టే మన పూర్వీకులు సమాజాన్ని నాలుగు భాగాలుగా విడగొట్టారు. అదే వర్ణాశ్రమ ధర్మం.” ఇదెంత దారుణమో చూడండి. కులవ్యవవస్థను పదిలంగా కాపాడ్డమే దీని లక్ష్యం. వీరి చేత శూద్రులుగా చెప్పబడే ఉత్పత్తి కులాల వారంతా ఏ చదువూ విలువా లేకుండా ఆధిపత్యవాదులకు సేవకులుగా ఉండాలనేది వర్ణాశ్రమ ధర్మం. హిందుత్వవాదులు ఆరాధించే మనుస్మతి నిండా ఇలాంటి దారుణమైన వివక్ష, ఆధిపత్య భావజాలం ఉన్నాయి కాబట్టే, ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ దానిని తగలబెట్టాడు.
భారత రాజ్యాంగం ఈ దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు ఇచ్చింది. కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలు లేకుండా స్త్రీ పురుషులందరినీ సమానంగా గౌరవించింది. కానీ, ఈ ఆర్‌ఎస్‌ఎస్‌ వారికి భారత రాజ్యాంగం మీద గౌరవం లేదు. మనుస్మృతి చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలను నిలబెట్టడమే వారి విధానం. తద్వారా స్త్రీలని అణిచిపెట్టడం, కులం పేరుతో శ్రామిక కులాల వాళ్ళని అణిచిపెట్టడం… కొనసాగించాలని చూస్తున్నారు. తమ హిందూత్వ ప్రచారం ద్వారా సమాజంలో అనాగరిక భావజాలాన్ని పెంచుతూ, కులమత దురహంకారాలను రెచ్చగొడుతున్నారు. ఈ విష బీజాలే ముసలమ్మను తన మనవళ్లు చేత హత్య చేయించడానికి పురికొల్పింది. ఆ యువకుల భవిష్యత్తును జైలుపాలు చేసింది.
కలసి మెలసి జీవించటం అనే తులసి వనంలో విద్వేషం అనే గంజాయి మొలుస్తోంది. దాని నివారణకు, నిర్మూలనకు పూనుకోవటం అందరి కర్తవ్యం. సమైక్య, సామరస్య వాతావరణాన్ని కాపాడుకోవటానికి అందరూ కృషి చేయాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు