Tuesday, March 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరెండేండ్ల కాంగ్రెస్‌ పాలన మోసానికి పరాకాష్ట

రెండేండ్ల కాంగ్రెస్‌ పాలన మోసానికి పరాకాష్ట

- Advertisement -

రైతుల నుంచి నిరుద్యోగుల వరకు అందర్నీ మోసం చేసింది
2026-27 బడ్జెట్‌లో చెప్పినవన్నీ అసత్యాలే : బీఆర్‌ఎస్‌ శాసన సభ ఉపనేత హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రెండేండ్ల కాంగ్రెస్‌ పాలన మోసానికి పరాకాష్ట అని బీఆర్‌ఎస్‌ శాసన సభ ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. సోమవారం శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై విమర్శలు గుప్పించారు. రైతుల నుంచి మొదలుకుని మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందర్ని మోసం చేశారన్నారని విమర్శించారు. ఓటాన్‌ అకౌంట్‌తో సహా ఇప్పటి వరకు ప్రవేశ పెట్టిన నాలుగు బడ్జెట్లలో చెప్పిన అంకేలకు ఆచరణకు పొంతన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ సర్కార్‌ రైతులను అడుగడుగునా దగా చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క సీజన్‌ కూడా ఎగ్గొట్టకుండా రైతుబంధు ఇచ్చామనీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం మూడు సీజన్ల రైతు భరోసాను ఎగ్గొంటిందన్నారు.

”కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.15 వేలు రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. తొలి బడ్జెట్‌లో ప్రకటించి, ఆ తర్వాత దాన్ని రూ.12 వేలకు తగ్గించారు. మా ప్రభుత్వాన్ని మూడో పంటకు కూడా రైతుబంధు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన సీఎం ఇప్పుడు ఒక ఒక పంటకే ఇస్తున్నారు. మూడు దఫాలు ఎగ్గొట్టిన రూ.19 వేల కోట్ల రైతు బంధు నిధులతో సగం రుణమాపీ చేశారు” అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అలాగే గత బడ్జెట్లో పెట్టిన పంటల బీమా, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఏటా 2 లక్షల ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర, రాజీవ్‌ యువవికాసం తదితర హామీలన్ని అటకెక్కాయని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఎక్సైజ్‌ ఆదాయాన్ని వచ్చే ఏడాదికల్లా రూ.12 వేల కోట్లు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రస్తుతం రూ.34 వేల కోట్లుగా ఉన్న ఆదాయాన్ని రూ.46 వేల కోట్లకు ఎట్లా పెంచుతారని ప్రశ్నించారు. ఊరూరుకు బార్లు ఓపెన్‌ చేస్తారా అంటూ నిలదీశారు. రెండేండ్లుగా ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇవ్వక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్‌ అనుసరిస్తున్న తిరోగమన విధానాల వల్ల గత రెండేండ్లలో రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశలో ప్రసంగాన్ని ముగించాలని స్పీకర్‌ కోరడంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసన తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు. సభ్యుడికి గంటకు పైగా సమయం ఇచ్చామని తెలిపారు. దాంతో శాసనసభను మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు.

పదేండ్లలో ఏంచేశారు?.. మంత్రి సీతక్క
శాసనసభలో హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా జోక్యం చేసుకున్న పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పదేండ్ల పాలనపై విమర్శలు గుప్పించారు. గత సర్కార్‌ చేసిన అప్పులు, వాటి వడ్డీలు కట్టడానికే సరిపోతోందన్నారు. ఆర్థిక క్రమ శిక్షణను పాటిస్తూ ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ శాఖపై హరీశ్‌రావు చేసిన ఆరోపణలపై మంత్రి జూపల్లి వివరణ ఇచ్చారు. తెలంగాణాను తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది బీఆర్‌ఎస్‌ పాలనేనని గుర్తు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అవాస్తవ ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -