నాటో కూటమి దేశాల మద్దతు చూసుకొని రెచ్చిపోతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసాలలో ఒకదాని మీద డ్రోన్లతో దాడికి ప్రయత్నించాడు. ఒక వైపు శాంతికి తాను సిద్ధమంటూనే పరిస్థితిని మరింత సంక్లిష్టం కావించేందుకు పూనుకున్నాడు. పశ్చిమ దేశాలు సృష్టించిన ఉక్రెయిన్ సంక్షోభం గురువారం నాడు 1,407వ రోజులో ప్రవేశించింది. ఆది-సోమవారాలలో 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను కూల్చివేసినట్లు మాస్కో పేర్కొన్నది. దీనికి ప్రతీకారంగా దాడుల తీవ్రత పెంచుతామంటూ రష్యా స్పందించింది. దీన్ని ఉక్రెయిన్ ఉగ్రదాడిగా పేర్కొన్నది. యుద్ధంలో ఎవరు గెలుస్తారన్నది పక్కన పెడితే ఇరుపక్షాలకూ తీవ్రనష్టమని యుద్ధాల గత చరిత్ర చెబుతున్నది. శాంతిప్రతిపాదనల్లో తొంభైశాతం ఆమోదించటానికి సిద్ధంగా ఉన్నాయని, అయితే పది శాతం అంశాలు విఫలం కావటానికి కూడా దోహదం చేయవచ్చని జెలెన్‌స్కీ చెప్పాడు. ఆ పదిశాతంలోనే తమ దేశంతో పాటు ఐరోపా భవితవ్యం ఆధారపడి ఉందని కూడా అన్నాడు. ‘సావిత్రీ..నీ పతి ప్రాణం తప్ప వరాలు కోరుకోమని” యమ ధర్మరాజు చెప్పిన కథ తెలిసిందే. పదిశాతం ప్రతిపాదనలు కూడా అలాంటి కీలకమైనవే.
తమ భద్రతకు ముప్పు కలగకుండా తమ షరతుల మీద శాంతి ఒప్పందం జరగాలని రష్యా పట్టుబడుతున్నది. ఒప్పందానికి అంగీకారమే గాని తమ దేశ భూభాగాన్ని ఫణంగా పెట్టటానికి సిద్ధం కాదని జెలెన్‌స్కీ చెబుతున్నాడు. అదే పదిశాతంలో కీలకాంశం. ఉక్రెయిన్ మిలిటరీని పరిమితం చేయాలని, దాని గడ్డపై ఏ విదేశీ బూట్ల చప్పుళ్లు వినిపించకూడదని పుతిన్ కరాఖండిగా చెప్పాడు. కనీసం 30 నుంచి 50ఏండ్ల పాటు అమెరికా సేనలు తమదేశంలో తిష్టవేసి రక్షణ కల్పించాలని ట్రంప్‌ను జెలెన్‌స్కీ కోరినట్లు వార్తలు.మరోవైపు ఉక్రెయిన్ ప్రాధాన్యతల జాబితా పేరుతో అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ఇప్పటికే 24దేశాలు 4.3బిలియన్ డాలర్ల మేర చందాలు ఇచ్చాయని, ఒక్క డిసెంబరు లోనే 150 కోట్ల మేర వచ్చా యని జెలెన్‌స్కీ చెప్పాడు. ఒప్పందం చేసుకోవటానికి సిద్ధ పడుతూ ఇదేం పని? మంటను మరింతగా ఎగదోసేందుకు ఐరోపా పూనుకుందన్నది స్పష్టం. నెపాన్ని పుతిన్ మీద నెట్టేందుకు పెద్ద ఎత్తున పశ్చిమ దేశాల మీడియా ఎంతగా ప్రచారం చేసినా ఇలాంటి చర్యలతో అది వృధాప్రయాసే అవుతుంది.
పుతిన్ నివాసంపై తాము దాడి చేసినట్లు రష్యా చెప్పటం దాడులను మరింతగా పెంచేందుకు సాకు అని జెలెన్‌స్కీ గుండెలు బాదుకుంటున్నాడు.తాము దాడి చేయలేదని కావాలంటే అమెరికా, ఐరోపా దేశాలను అడగండని అమాయకత్వం నటిస్తున్నాడు. గత నాలుగేండ్లలో నాటో కూటమి దేశాల ఆయుధాలు, సమాచారంతో రష్యా భూభాగాలపై అనేక దాడులు చేసినట్లు ఈ పెద్దమనిషే ప్రకటనలే కాదు, దృశ్యాలను కూడా లోకానికి చూపించిన సంగతి తెలిసిందే. గతంలో ఉక్రెయిన్ చేసిన దాడులు, రష్యా తిన్నదెబ్బలు నిజమే అని ప్రచారం చేసిన వారు ఇప్పుడు జెలెన్‌స్కీ సేనలు ఏమీ చేయ లేదంటే ఎవరైనా నమ్ముతారా? తన నివాసంపై దాడి యత్నం తర్వాత పుతిన్ దెబ్బకు దెబ్బతీయాలని తన సేనలను ఆదేశించాడు. దానికి ప్రతిగా రష్యాపై మరిన్ని దాడులకు పాల్పడితే అడ్డుకొనేందుకు, కీలక మౌలిక సదుపాయాల రక్షణకు రిజర్వు బలగాలను రప్పించేందుకు మిలిటరీకి అధికారమిచ్చాడు. చలికాలం ముగిసిన తర్వాత భారీ ఎత్తున దాడులకు పాల్పడే అవకాశం ఉంది.
బలహీనమైన శాంతి ఒప్పందం మీద తాను సంతకం చేసేది లేదని, అది పోరును మరింతగా ఎగదోసేందుకే దారి తీస్తుందని నూతన సంవత్సర సందేశంలో జెలెన్‌స్కీ చెప్పాడు. జరుగుతున్న పోరులో విజయం తమదేనని, యుద్ధవీరులకు మద్దతివ్వాలని పుతిన్ కొత్త ఏడాది సందేశంలో పిలుపునిచ్చాడు. జెలెనెస్కీ, బ్రిటన్, జర్మనీ, ఫ్రెంచి అధికారులతో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ బుధవారం నాడు చెప్పాడు. ఒకవైపు సంప్రదింపులు జరుగుతుండగానే దాడులు, ప్రతిదాడులు జరిగాయి, ఎవరూ తగ్గలేదు. పొమ్మనకుండా పొగపెట్టి నట్లుగా విద్యుత్ వంటి వ్యవస్థలను ధ్వంసం చేయటం, మెల్లమెల్లగా ఉక్రెయిన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకొనే ఎత్తుగడలతో రష్యా ముందుకు పోతున్నది.నాటో దేశాల కూటమి మరింతగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చి పోరును కొనసాగించాలని చూస్తున్నది.రెండవ ప్రపంచపోరు తర్వాత ఐరోపా గడ్డమీద ఇంతటి దీర్ఘయుద్ధం జరగలేదు, ఎలా ముగుస్తుందో, ఈ ఏడాదిలో ఏ పరిణామాలకు దోహదం చేస్తుందో అనూహ్యమనే చెప్పాలి!
పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



