స్వీప్ షాట్ ఆడలేని బ్యాటర్లు
స్లో పిచ్‌లపై తరచుగా వైఫల్యం
భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ ఏకపక్షం అనుకున్నారు. వడోదర వన్డేలో విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ మెరవటంతో చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ అదే జోరు పునరావృతం అవుతుందనే అంచనా. కానీ రాజ్‌కోట్‌లో కథ మారింది. స్లో పిచ్‌పై న్యూజిలాండ్ స్పిన్ అస్త్రం సంధించింది. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆదివారం ఇండోర్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌పై ఆసక్తి రెట్టింపు అవుతోంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
రాజ్‌కోట్ వన్డేలో భారత్, న్యూజిలాండ్ మధ్య వ్యత్యాసం సింపుల్. భారత స్పిన్నర్లు లెంగ్త్‌ను మార్చుకునేలా కివీస్ బ్యాటర్లు స్వీప్ షాట్లు విరివిగా ఆడారు. స్పిన్ ఆడేందుకు భారత బ్యాటర్లు ప్రధానంగా స్ట్రయిట్ షాట్లను ఎంచుకున్నారు. ఫలితంగా న్యూజిలాండ్ స్పిన్నర్లు 23-1-87-2 గణాంకాలు నమోదు చేయగా.. భారత స్పిన్నర్లు 18-0-126-1 గణాంకాలు నమోదు చేశారు. సాధారణంగా మెరుగైన గణాంకాలు భారత స్పిన్నర్లే అనుకుంటారు. ఎందుకంటే, రాజ్‌కోట్‌లో భారత స్పిన్ బాధ్యతలు కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా పంచుకున్నారు. న్యూజిలాండ్ తరఫున అనుభవం లేని యువ స్పిన్నర్లు మాయ చేశారు.
స్వీప్ షాట్ ఆడరా?
రాజ్‌కోట్ వన్డేలో భారత్ నుంచి కెఎల్ రాహుల్ (112 నాటౌట్) సెంచరీ సాధించగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56) అర్థ సెంచరీతో మెరిశౄడు. అయినా, భారత్ తొలుత 284/7 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (24), విరాట్ కోహ్లి (23), శ్రేయస్ అయ్యర్ (8) వికెట్లను స్పిన్నర్ క్లార్క్ పడగొట్టాడు. దీంతో భారత్ స్వల్ప స్కోరుకు పరిమితమైంది. ఛేదనలో న్యూజిలాండ్ తరఫున డార్లీ మిచెల్ (131 నాటౌట్) సెంచరీ బాదగా.. విల్ యంగ్ (87) అర్థ సెంచరీ కొట్టాడు. భారత స్పిన్నర్లు తేలిపోవటంతో కివీస్ 47.3 ఓవర్లలోనే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గణాంకాలు పరిశీలించినా, మ్యాచ్ చూసినా ఒక్క విషయం స్పష్టంగా తెలుస్తుంది.
స్పిన్‌ను ఎదుర్కొవటంలో భారత్ పూర్తిగా విఫలమైంది. అదే సమయంలో కివీస్ స్పిన్‌పై తెలివిగా పరుగులు పిండుకుంది. భారత ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్ 43వ ఓవర్లో మైకల్ బ్రాస్‌వెల్‌పై రివర్స్ స్వీప్‌తో బౌండరీ సాధించాడు. భారత్ ఎదుర్కొన్న 23 ఓవర్ల స్పిన్ బౌలింగ్‌లో ఆడిన ఒకే ఒక్క స్వీప్ షాట్ అది. మరో బ్యాటర్ స్వీప్ షాట ఆడలేదు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో స్వీప్ షాట్ ప్రధానంగా కనిపించింది. స్వీప్, ల్యాప్ షాట్లతో కివీస్ బ్యాటర్లు మెప్పించారు. కుల్‌దీప్ యాదవ్ తొలి ఓవర్లోనే ల్యాప్ షాట్‌కు బౌండరీ కోల్పోయాడు. కేవలం కుల్‌దీప్ బౌలింగ్‌లోనే న్యూజిలాండ్ బ్యాటర్లు 13 సార్లు స్వీప్ షాట్ ఆడి 23 పరుగులు పిండుకున్నారు.
ఈ పొరపాటు అలవాటే!
భారత్‌కు ఈ తరహా పొరపాటు బాగా అలవాటు. గొప్పగా ఆడుతున్న తరుణంలో స్వీప్ షాట్ ఆడలేక మ్యాచ్‌లు చేజార్చుకున్న దాఖలాలు ఉన్నాయి. రాజ్‌కోట్ వన్డేలో భారత్, న్యూజిలాండ్ బ్యాటర్లు ఆడిన స్వీప్ షాట్ల శాతం తెలుసుకోవాలని ఉందంటూ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో చురకలు వేశాడు. భారత బ్యాటర్లు స్వీప్ షాట్లు మంచిగా ఆడగలరు. కానీ స్ట్రయిట్ షాట్లతో దంచికొట్టిన అనుభవంతో ఒక్కసారిగా స్లో పిచ్‌పై స్వీప్ షాట్‌కు మారలేకపోతున్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో స్పిన్నర్ల ప్రభావం ఉంటుందని అంచనా వేసిన భారత్.. స్వీప్ షాట్లు ఎక్కువగా ఆడింది. ఫలితంగా ప్రత్యర్థి జట్ల స్నిన్నర్లు లైన్ అండ్ లెంగ్త్‌లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 2023 ఐసీసీ వరల్డ్‌కప్ ఫైనల్లోనూ భారత్ స్వీప్ షాట్ ఆడలేదు. పరిస్థితులను బేరీజు వేయటంలో బోల్తాపడిన భారత్.. ఆ మ్యాచ్‌లో రెండు స్వీప్ షాట్లే ఆడింది. ఫలితం, భారత క్రికెట్‌లో ఎప్పటికీ మానని గాయం.
ఇటీవల ఇంగ్లాండ్‌తో కటక్ వన్డేలో, రాయ్ పూర్‌లో దక్షిణాఫ్రికాతో వన్డేలో మాత్రమే ప్రత్యర్థి కంటే మెరుగ్గా భారత్ స్వీప్ షాట్ ఆడింది. కటక్‌లో రోహిత్ శర్మ, అక్షర్ పటేల్‌లు స్వీప్ షాట్‌తో మెరువగా.. రాయ్ పూర్‌లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లు స్పిన్‌ను స్వీప్ షాట్‌తో ఎదుర్కొన్నారు. ఇప్పటికే నెట్స్‌లో స్వీప్ షాట్ సాధన మొదలెట్టిన భారత బ్యాటర్లు.. ఇండోర్‌లో స్పిన్‌కు సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. రాజ్‌కోట్‌లో మంచు ప్రభావం లేకపోయినా.. పిచ్‌లో దాగివున్న తేమ టర్న్‌పై ప్రభావం చూపించింది. ఫ్లడ్‌లైట్ల వెలుగులో తేమ ప్రతికూలంగా మారింది. మూడో వన్డే వేదిక ఇండోర్ చిన్న గ్రౌండ్. ఇక్కడ స్వీప్ షాట్‌కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు!. చిన్న బౌండరీల గ్రౌండ్‌లో స్పిన్నర్లు అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందే. రాజ్‌కోట్ వన్డేలో కివీస్ అరంగ్రేట స్పిన్నర్ జేడెన్ లెనాక్స్ తొలి స్పెల్‌లో 5-0-18-0 గణాంకాలు నమోదు చేశాడు. ఇండోర్‌లోనూ కివీస్ స్పినర్లను ఆడటంలో బ్యాటర్లు విఫలమైతే.. భారత్‌లో చారిత్రక తొలి వన్డే సిరీస్ విజయం న్యూజిలాండ్ వశమవటం లాంఛనమే!.



