Monday, October 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంయథేచ్ఛగా నకిలీ ఓఆర్‌ఎస్‌ అమ్మకాలు

యథేచ్ఛగా నకిలీ ఓఆర్‌ఎస్‌ అమ్మకాలు

- Advertisement -

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు భేఖాతర్‌
పిల్లల ప్రాణాల కన్నా
స్టాక్‌ క్లియరెన్స్‌కే మొగ్గు
న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నకిలీ ఓఆర్‌ఎస్‌ అమ్మకాలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. సూపర్‌ మార్కెట్లతో పాటు మెడికల్‌ షాపుల్లో ప్రత్యక్షమవుతున్నాయి. గతంలో మాదిరిగానే ప్రజలు ఓఆర్‌ఎస్‌కు, నకిలీ ఓఆర్‌ఎస్‌కు మధ్య ఉన్న తేడాను గుర్తించలేక మోసపోతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సాగిన సుదీర్ఘ పోరాటం తర్వాత ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నకిలీ ఓఆర్‌ఎస్‌ అమ్మకాలకు చెక్‌ పడేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎనర్జీ డ్రింక్‌ ల పేరుతో జరిగే మోసానికి ఫుల్‌ స్టాప్‌ పడిందని అంతా భావించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలతో ఎనర్జీ డ్రింక్‌ పేరుతో ఓఆర్‌ఎస్‌ బ్రాండ్‌ను ఉపయోగించుకుని మార్కెట్‌ చేస్తున్న పలు కంపెనీలు వెనక్కి తగ్గాయి. అయితే జెఎన్టీఎల్‌ ప్రయివేటు లిమిటెడ్‌ దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ వాదన వినకుండా ఏకపక్షంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు జారీ చేసిందని న్యాయస్థానంలో సవాలు చేసింది. దీంతో వారం రోజుల్లో వారి వాదన వినాలని న్యాయస్థానం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లో ఆ వాదనలు విన్నప్పటికీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ దానిపై ఎలాంటి అభిప్రాయం వెల్లడించకపోగా, అంతకు ముందు వాటిని నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. దీంతో సదరు కంపెనీకి చెందిన నకిలీ ఓఆర్‌ఎస్‌ టెట్రా ప్యాకెట్లు మునపటి మాదిరిగానే మార్కెట్లో ప్రత్యక్షమ వుతున్నాయి. దీంతో మరోసారి న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్టు నకిలీ ఓఆర్‌ఎస్‌ కు వ్యతిరేకంగా పోరాడుతున్న హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్‌ శివరంజని సంతోష్‌ ప్రకటించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వ్యవహారశైలి పిల్లల ప్రాణాల కన్నా కంపెనీకి నష్టం కలగకుండా చూడాలనే ధోరణి కనిపిస్తున్నదని వైద్యులు విమర్శిస్తున్నారు. కంపెనీ చెబుతున్న రూ.180 కోట్ల విలువైన స్టాక్‌ ఇది వరకే తమ వద్ద ఉంటే, ఆ కంపెనీకి నష్టం కలగకుండా చూసేందుకే ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ ప్రాధాన్యతనిస్తున్నట్టు కనిపిస్తున్నది. అందుకే ఉద్దేశపూర్వకంగా ఆ కంపెనీ వాదన విన్న తర్వాత అభిప్రాయం వెంటనే వెల్లడించకపోవడం, నకిలీ ఓఆర్‌ఎస్‌ను నిషేధిస్తూ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఐదేండ్లలోపు పిల్లలకు డయేరియా సమయంలో ఉపయోగించాల్సిన ఒఆర్‌ఎస్‌ ఫార్ములాను ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంగా పేర్కొంది. ఈ బ్రాండ్‌ను ఏ రకంగానూ దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. అయితే ఆయా కంపెనీలు ఓఆర్‌ఎస్‌కు వైద్యపరంగా ఉన్న డిమాండ్‌ను తమకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా డయోరియాతో 4,44,000 మంది, భారతదేశంలో ఒక లక్ష నుంచి 1.22 లక్షల మంది ఐదేండ్లలోపు పిల్లలు మరణిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు శరవేగంగా తీసుకోవాల్సిన ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ మాత్రం కార్పొరేట్‌ ఒత్తిడికి తలొగ్గిందనే చర్చ వైద్యవర్గాల్లో జోరుగా జరుగుతున్నది. వాదన వినలేదన్న సాంకేతిక అంశానికి ప్రాధాన్యతనిచ్చిన కోర్టు… తాను కల్పించిన వెసులుబాటు ముసుగులో ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ నకిలీ ఓఆర్‌ఎస్‌ల అమ్మకాన్ని కొనసాగించడాన్ని చోద్యంలా చూస్తోందని ఆరోగ్య పరిరక్షణ ఉద్యమకారుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్‌ లాభనష్టాల గురించి కాకుండా పిల్లల ప్రాణాల దృష్ట్యా నకిలీ ఓఆర్‌ఎస్‌ పై నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రజారోగ్య పరిరక్షణ ఉద్యమకారులు డిమాండ్‌ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -