Saturday, March 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌లో భూగర్భ క్షిపణి నగరాలు

ఇరాన్‌లో భూగర్భ క్షిపణి నగరాలు

- Advertisement -

అవే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులు
ఏకంగా 6వేల క్షిపణులు ఉన్నాయని అంచనా

టెహ్రాన్‌ : అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల నుంచి తన ఆయుధ సంపత్తిని కాపాడుకునేందుకు ఇరాన్‌ వ్యూహాత్మకంగా నిర్మించుకున్న భూగర్భ క్షిపణి నగరాలు ఇప్పుడు ఆ దేశానికే ప్రతికూలంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్‌ ఏకపక్ష యుద్ధం తర్వాత భారీ భూగర్భ బంకర్ల నుంచి బయటకు వస్తున్న క్షిపణి లాంచర్లనే లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయిల్‌ బాంబులతో విరుచుకుపడుతున్నాయి.

అమెరికా టార్గెట్‌?
ఇరాన్‌ దశాబ్దాలుగా ఎంతో పకడ్బందీగా నిర్మించుకున్న భూగర్భ బంకర్లు ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ప్రధాన లక్ష్యంగా మారాయి. తమ వద్ద ఉన్న అతిపెద్ద భూగర్భ కేంద్రాన్ని ప్రపంచానికి చూపిస్తూ 2025 మార్చిలో ఇరాన్‌ ఓ వీడియోను విడుదల చేసింది. కిటికీలు లేని పొడవైన భూగర్భ కారిడార్లలో క్షిపణులను మోసుకెళ్లే ట్రక్కులను ఆ దేశ సీనియర్‌ కమాండర్లు పరిశీలిస్తున్న దశ్యాలు అందులో ఉన్నాయి. ఆ వీడియో ఎక్కడ తీశారన్నది మాత్రం అప్పట్లో గోప్యంగా ఉంచారు. ఇప్పుడు ఆ ఆయుధాగారాలే ఇరాన్‌కు అతిపెద్ద సవాలుగా మారాయి.

ఇరాన్‌ను తక్కువ అంచనా వేయలేం!
ఇజ్రాయిల్‌, అమెరికా దాడుల నుంచి రక్షించుకునేందుకు యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఇరాన్‌ అప్రమత్తమైంది. కొన్ని క్షిపణులను, లాంచర్లను బంకర్ల నుంచి బయటకు తరలించి ఉండవచ్చని, తద్వారా వాటిని చెదరగొట్టి దాడుల నుంచి రక్షించుకోవాలని భావించినట్టు తెలుస్తోంది. ఇరాన్‌కు ఉన్న భారీ భూగర్భ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసే బంకర్‌-బస్టింగ్‌ బాంబులు అమెరికా ఆయుధాగారంలో పరిమితంగానే ఉన్నాయి. అందుకే, లాంచర్లు బయటకు రాగానే ప్రవేశ ద్వారాల వద్దే ధ్వంసం చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

క్షిపణులను అడ్డుకునే ఎయిర్‌-డిఫెన్స్‌ ఇంటర్‌సెప్టార్ల నిల్వలు అయిపోకముందే, టెహ్రాన్‌ ప్రయోగ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని వాషింగ్టన్‌ భావిస్తోంది. సుదీర్ఘకాలం సాగే యుద్ధం కోసం ఇరాన్‌ ఉద్దేశపూర్వకంగానే తన ఆయుధ నిల్వలను ఆదా చేసుకుంటున్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌ క్షిపణి నిల్వలపై భిన్నమైన అంచనాలున్నాయి. యుద్ధానికి ముందు ఇరాన్‌ వద్ద 2,500 క్షిపణులు ఉండొచ్చని ఇజ్రాయిల్‌ అంచనా వేయగా, సుమారు 6,000 వరకు ఉంటాయని స్వతంత్ర విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్‌ వద్ద మిగిలి ఉన్న ఈ ఆయుధ సంపత్తే భవిష్యత్తులో ఈ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందన్నది నిర్ణయించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -