Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంలోక్‌ అదాలత్‌కు అనూహ్య స్పందన

లోక్‌ అదాలత్‌కు అనూహ్య స్పందన

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా శనివారం తెలంగాణలోని మేజిస్ట్రేట్‌ కోర్టు నుంచి హైకోర్టు వరకు లోక్‌ అదాలత్‌లను నిర్వహించారు. మొత్తం 11.08 లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. (ప్రిలిటిగేషన్‌ కేసులు 3.63 లక్షలు, కోర్టుల్లో పెండింగ్‌ 7.43 లక్షల కేసులు) దీంతో రూ.595 కోట్లను పరిహార చెల్లింపునకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఆధ్వరంలో జరిగిన లోక్‌ అదాలత్‌లో రోడ్డు ప్రమాద బాధితుడికి 1.20 కోట్ల పరిహార ఉత్తర్వులు వెలువడ్డాయి ట్రైబ్యునల్‌ ప్రకటించిన రూ. 98. 30 లక్షల పరిహారాన్ని 8 శాతం వడ్డీతో కలిపి రూ.1.20 కోట్లను చెల్లించేందుకు న్యూ ఇండియా అస్స్యూరెన్స్‌ కంపెనీ ఒప్పుకుంది… అని స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌ సెక్రటరీ పంచాక్షరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌ జస్టిస్‌ పి. శ్యాంకోశి, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరిగిందన్నారు. హైకోర్టులో మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ జి వి సీతాపతి, జస్టిస్‌ జి శ్రీదేవి పాల్గొని 180 కేసులను పరిష్కరించారు. 110 మందికి పరిహారంగా రూ. 12.16 కోట్లు చెల్లింపులు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు.

500 మంది ఉంటేనే గ్రామ పంచాయతీ
రాష్ట్రంలో ఏదైనా ప్రత్యేక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలంటే కనీస జనాభా 500 మంది ఉండి తీరాలనే నిబంధనలను హైకోర్టు గుర్తు చేసింది. ఎక్కవ జనాభా ఉన్నట్టుగా తప్పుడు గణాంకాలతో మంచిర్యాల జిల్లా వందూర్‌గూడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. రికార్డుల్లో 317 మంది జనాభా ఉన్నట్టు ప్రభుత్వ మోమో చెబుతోందని తెలిపింది. ఇందుకు పాల్పడిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంకటాపూర్‌ గ్రామ పంచాయతీని విభజించి వందూర్‌గూడను ఏర్పాటు చేయడంపై పున్ణ పరిశీలని చేయాలనీ సూచించింది. 500 మంది కంటే జనాభా తక్కువగా ఉంటే గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయొద్దంటూ ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చింది. వందూర్‌గూడ విభజన చట్టవిరుద్ధమంటూ వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన మోకాసి దౌలత్‌రావు వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కొత్త పంచాయతీ ఏర్పాటైందని జీపీ నివేదించారు. విభజన నాటికి కొత్త పంచాతీయ జనాభా 613గా ఉందని చెప్పారు. అయితే అధికారులు కోర్టుకు సమర్పించిన మెమోలో జనాభా 317గా పేర్కొనడంతో న్యాయమూర్తి పైవిధంగా ఉత్తర్వులను వెలువరించారు.

కౌంటర్‌ వేయకపోతే కోర్టుకు రండి
పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ దళ మెంబర్‌ నాగవెళ్లి మోహన్‌ పోలీసులకు లొంగిపోయిన తరువాత అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రకటించిన సహాయక చర్యలు అమలు చేయకపోవడంతో అతని భార్య అరుణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మెదక్‌ జిల్లా కలెక్టర్‌ 10 ఏండ్లుగా కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ప్రకటించినట్టుగా పిటిషనర్‌కు 5 ఎకరాల భూమి కేటాయింపు వ్యవహారంపై కౌంటర్‌ వేయకపోతే ఈ నెల 24న జరిగే విచారణకు స్వయంగా రావాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కోర్టుకు హాజరై వివరణ ఇస్తారా? లేక కౌంటర్‌ వేస్తారా? అని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ను జడ్జి ప్రశ్నించారు. లొంగిపోతే ఐదెకరాల భూ కేటాయింపుతో సహా పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో 1989లో మోహన్‌ లొంగిపోయాడు. భూమి కేటాయింపు చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు కలెక్టర్‌కు లేఖ రాశారు. సదాశివపేటలో కొంత భూమిని అధికారులు గుర్తించారు. ఈ దశలో నక్సలైట్ల కాల్పుల్లో మోహన్‌ మరణించాడు. దీంతో భూమిని అతని భార్య నాగవెల్లి అరుణకు కేటాయించాలంటూ పోలీసులు కలెక్టర్‌కు లేఖ రాశారు. ఈ విషయం 2004 నుంచి నలుగుతూనే ఉంది. చివరికి ఆమె 2015లో హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కలెక్టర్‌ కౌంటర్‌ వేయలేదని ఆమె తరపు లాయర్‌ చెప్పడంతో న్యాయమూర్తి పైవిధంగా ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -