నిరాశపరిచిన కోహ్లి, రోహిత్
తొలి వన్డేలో భారత్ పరాజయం
భారత్ 136/9, ఆస్ట్రేలియా 131/3
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘రో-కో’ రాకెట్ పెర్త్‌లో పేలలేదు. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో, డ్రాప్ ఇన్ పిచ్‌పై ఆసీస్ విజృంభించారు. విరాట్ కోహ్లి (0), రోహిత్ శర్మ (8) నిరాశపరచగా.. భారత్ 136/9 పరుగులే చేసింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. 3 మ్యాచుల వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ముందంజ వేసింది. భారత్, ఆసీస్ రెండో వన్డే గురువారం ఆడిలైడ్‌లో జరుగనుంది.
నవతెలంగాణ-పెర్త్
డ్రాప్ ఇన్ పిచ్‌పై బౌలర్లు సమిష్టిగా రాణించటంతో భారత్‌తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. జోశ్ హాజిల్‌వుడ్ (2/20), మిచెల్ ఓవెన్ (2/20), మాథ్యూ కున్హేమాన్ (2/26) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ (38, 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (31, 38 బంతుల్లో 3 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్, 11 బంతుల్లో 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించే ఇన్నింగ్స్‌లు ఆడారు. సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి (0), రోహిత్ శర్మ (8) సహా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (11) నిరాశపరిచారు.
స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 21.1 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్, 52 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ ఇన్నింగ్స్‌తో మెరువగా.. జోశ్ ఫిలిప్ (37, 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాట్ రెన్షా (21 నాటౌట్, 24 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. మరో 29 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యం దక్కించుకుంది. ఛేదనలో అజేయ ఇన్నింగ్స్‌తో కదం తొక్కిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
టాప్ కకావికలం
తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు ఆసీస్ పేసర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. మేఘావృత వాతావరణం, డ్రాప్ ఇన్ పిచ్ పేసర్లకు అనుకూలించింది. హాజిల్‌వుడ్ ఓవర్లో ఎడ్జ్‌తో రోహిత్ శర్మ (8) స్లిప్స్‌లో దొరికిపోగా.. విరాట్ కోహ్లి (0) 8 బంతులు ఆడినా ఒక్క పరుగూ చేయలేదు. స్టార్క్ ఓవర్లో డ్రైవ్ ఆడిన కోహ్లి.. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో కొనాల్లీ కండ్లుచెదిరే క్యాచ్‌తో డకౌట్‌గా నిష్క్రమించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10) లెగ్ సైడ్ ఫ్లిక్ చేయబోయి వికెట్ కీపర్‌కు చిక్కాడు. దీంతో 8.1 ఓవర్లలో 25/3తో భారత్ టాప్-3 బ్యాటర్లను కోల్పోయింది. వర్షం అంతరాయం అనంతరం శ్రేయస్ అయ్యర్ (11) సైతం హాజిల్‌వుడ్ ఓవర్లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. 45/4తో భారత్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్‌ను కోల్పోయింది.
ఆదుకున్న అక్షర్, రాహుల్
100 పరుగులైనా చేయకుండా ఆలౌటయ్యేలా కనిపించిన భారత్‌ను అక్షర్ పటేల్ (31), కెఎల్ రాహుల్ (38) ఆదుకున్నారు. తొలుత అయ్యర్‌తో కలిసి 20 పరుగులు జోడించిన అక్షర్ పటేల్.. ఐదో వికెట్‌కు రాహుల్‌తో కలిసి 40 బంతుల్లో 39 పరుగులు జత చేశాడు. ఈ ఇద్దరు క్రీజులో ఉండగా భారత్ గౌరవప్రద స్కోరు దిశగా సాగింది. స్కోరు వేగం పెంచే క్రమంలో రాహుల్, అక్షర్ అవుటైనా.. వాషింగ్టన్ సుందర్ (10), నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) ఆఖర్లో విలువైన పరుగులు జోడించారు. నితీశ్ ఆఖరు ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టాడు. దీంతో భారత్ 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో 27/3 పరుగులు చేసిన బారత్.. ఆ తర్వాత 109/6 పరుగులు చేసింది.
ఆసీస్ ఆడుతూ పాడుతూ
131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ప్రమాదకర ఓపెనర్ ట్రావిశ్ హెడ్ (8)ను అర్ష్‌దీప్ సింగ్ సాగనంపగా.. మాథ్యూ షార్ట్ (8)ను అక్షర్ పటేల్ మాయలో పడేశాడు. పవర్‌ప్లేలో ఆసీస్ దూకుడుగా పరుగులు చేసినా భారత్ రెండు వికెట్లతో రేసులో నిలిచే ప్రయత్నం చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్) మరో ఎండ్‌లో సావధానంగా ఆడాడు. 3 సిక్సర్లు, 2 ఫోర్లతో ఛేదనను ముందుండి నడిపించాడు. జోశ్ ఫిలిప్ (37), మాథ్యూ రెన్షా (21 నాటౌట్) మార్ష్‌కు చక్కటి సహకారం అందించారు. 21.1 ఓవర్లలో 131 పరుగులు చేసిన ఆసీస్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
వర్షం అంతరాయం
భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగింది. వర్షం సూచనలతో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో 8.5 ఓవర్లకు వర్షం అడ్డు తగిలింది. వర్షం, ఆ తర్వాత తడి అవుట్‌ఫీల్డ్‌తో మ్యాచ్ ముందుకు సాగలేదు. భారత ఇన్నింగ్స్‌కు ఏకంగా ఆరు సార్లు వరుణుడు అంతరాయం కలిగించాడు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం పలుమార్లు ఓవర్లను సవరించారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం లేదు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఇరు ఇన్నింగ్స్‌లకు 26 ఓవర్లను నిర్దేశించగా.. ఆసీస్ లక్ష్యాన్ని 26 ఓవర్లలో 131 పరుగులకు సవరించారు. వర్షం కురిసినా.. పెర్త్ స్టేడియం 42423 మంది అభిమానులతో కిక్కిరిసింది.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) రెన్షా (బి) హాజిల్‌వుడ్ 8, శుభ్‌మన్ గిల్ (సి) ఫిలిప్ (బి) ఎలిస్ 10, విరాట్ కోహ్లి (సి) కానొల్లీ (బి) స్టార్క్ 0, శ్రేయస్ అయ్యర్ (సి) ఫిలిప్ (బి) హాజిల్‌వుడ్ 11, అక్షర్ పటేల్ (సి) రెన్షా (బి) కున్హేమాన్ 31, కెఎల్ రాహుల్ (సి) రెన్షా (బి) ఓవెన్ 38, వాషింగ్టన్ సుందర్ (బి) కున్హేమాన్ 10, నితీశ్ కుమార్ రెడ్డి నాటౌట్ 19, హర్షిత్ రానా (సి) ఫిలిప్ (బి) ఓవెన్ 1, అర్ష్‌దీప్ సింగ్ రనౌట్ 0, మహ్మద్ సిరాజ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (26 ఓవర్లలో 9 వికెట్లకు) 136.
వికెట్ల పతనం : 1-13, 2-21, 3-25, 4-45, 5-84, 6-115, 7-121, 8-123, 9-124.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 6-1-22-1, హాజిల్‌వుడ్ 7-2-20-2, నాథ్ ఎలిస్ 5-1-29-1, మిచెల్ ఓవెన్ 3-0-20-2, మాథ్యూ కున్హేమాన్ 4-0-26-2, మాథ్యూ షార్ట్ 1-0-17-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : మిచెల్ మార్ష్ నాటౌట్ 46, ట్రావిశ్ హెడ్ (సి) హర్షిత్ రానా (బి) అర్ష్‌దీప్ సింగ్ 8, మాథ్యూ షార్ట్ (సి) రోహిత్ (బి) అక్షర్ 8, జోశ్ ఫిలిప్ (సి) అర్ష్‌దీప్ (బి) వాషింగ్టన్ 37, మాట్ రెన్షా నాటౌట్ 21, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (21.1 ఓవర్లలో 3 వికెట్లకు) 131.
వికెట్ల పతనం : 1-10, 2-44, 3-99.
బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ 4-1-21-0, అర్ష్‌దీప్ సింగ్ 5-0-31-1, హర్షిత్ రానా 4-0-27-0, అక్షర్ పటేల్ 4-0-19-1, నితీశ్ కుమార్ 2.1-0-16-0, వాషింగ్టన్ సుందర్ 2-0-14-1.