పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యం
అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు : రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రోడ్డు ప్రమాదాలను అరికట్టే లక్ష్యంతో రవాణాశాఖ క్షేత్రస్థాయిలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, యూనిసెఫ్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ నగరంలోని హౌటల్ మెర్క్యూరీలో ఆర్టీఏ మెంబర్స్‌కు రోడ్డు భద్రతపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇటీవల కర్నూలు, చేవెళ్ల వద్ద జరిగిన బస్సు ప్రమాదాల వంటి వరుస దుర్ఘటనల నేపథ్యంలో రవాణాశాఖ అప్రమత్తమైందని తెలిపారు. మరణాల సంఖ్యలో ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాల వల్లే జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రానున్న ‘రోడ్డు భద్రతా మాసంలో’ ప్రజల్లోకి విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఇందుకోసం రవాణాశాఖ అధికారులతో సమన్వ యం చేసుకుంటూ గ్రామీణ స్థాయి వరకు పనిచేయాలని ఆర్టీఏ సభ్యులకు సూచిం చారు. పాఠశాలలు, కళాశా లలు, ఇతర విద్యా సంస్థల్లో రోడ్డు నిబంధనలపై వ్యాసర చన పోటీలు నిర్వహిం చి, కరపత్రాలు పంపిణీ చేసి, ర్యాలీలు చేపట్టడం ద్వారా యువతలో చైతన్యం తీసుకు రావాలని పిలుపుని చ్చారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్’ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ పథకం ద్వారా బాధితులకు 8 రోజుల్లో రూ.1.50 లక్షల వరకు చికిత్స అందుతుందని, ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
ప్రమాదాల్లో యువత మరణాలే అధికం..
‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్’ నివేదిక ప్రకారం 10-19 ఏండ్ల వయసు వారి మరణాలకు రోడ్డు ప్రమాదాలే ప్రధాన కారణమని యూనిసెఫ్ ప్రతినిధి డాక్టర్ శ్రీధర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ ప్రపంచ వ్యాప్తంగా మూడు దేశాలను ఎంపిక చేసిందన్నారు. అందులో మనదేశం నుంచి అహ్మదాబాద్, ముంబయి, హైదరాబాద్ నగరాలు ఉన్నట్టు తెలిపారు. దేశంలో ప్రతిరోజూ సగటున 1317 రోడ్డు ప్రమాదాలు జరిగి, 477 మంది మరణిస్తున్నారని తెలిపారు.
విద్యార్థి దశ నుంచే ప్రవర్తన ముఖ్యం..
రోడ్డు భద్రతా నిబంధనలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించడం అత్యంత కీలకమని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ డాక్టర్ శైలజ చెప్పారు. ప్రవర్తనలో మార్పు కోసం పాఠశాలల్లో ‘యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్’ వంటి కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధులతో ఆర్టీఏ నాన్-అఫీషియల్ సభ్యులు పాల్గొన్నారు.



