Wednesday, October 22, 2025
E-PAPER
Homeఆటలుఎదురులేని సఫారీలు

ఎదురులేని సఫారీలు

- Advertisement -

– ప్రపంచకప్‌ నుంచి పాక్‌ నిష్క్రమణ
– 150 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు
– ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌
నవతెలంగాణ-కొలంబో :

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా అద్భుత జైత్రయాత్ర కొనసాగుతుంది. ప్రపంచకప్‌ చరిత్రలోనే ఆ జట్టు తొలిసారి వరుసగా ఐదు మ్యాచుల్లో విజయఢంకా మోగించింది. తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ చేతిలో ఓడిన సఫారీ అమ్మాయిలు.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో అసమాన విజయాలు నమోదు చేశారు. మంగళవారం కొలంబోలో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై దక్షిణాఫ్రికా అమ్మాయిలు 150 పరుగుల తేడాతో (డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) తిరుగులేని విజయం సాధించారు. ఈ విజయంతో సెమీఫైనల్లో చోటుతో పాటు టాప్‌-2లో స్థానాన్ని దక్షిణాఫ్రికా అమ్మాయిలు ఖరారు చేసుకున్నారు. గ్రూప్‌ దశలో ఆరు మ్యాచులు ఆడినా.. ఒక్క విజయం సాధించని పాకిస్తాన్‌ అమ్మాయిలు మరో మ్యాచ్‌ ఉండగానే ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది.
వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో తొలుత దక్షిణాఫ్రికా అమ్మాయిలు 40 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులు చేశారు. ఓపెనర్‌ లారా (90, 82 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), సునె లుస్‌ (61, 59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), మరిజానె కాప్‌ (68 నాటౌట్‌, 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. పాక్‌ బౌలర్లలో సదియా ఇక్బాల్‌ (3/53), నష్రా సంధు (3/45) మూడు వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్‌ లక్ష్య ఛేదనకు వరుణుడు నిలకడగా అడ్డు తగిలాడు. దీంతో ఆ జట్టు లక్ష్యాన్ని డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 20 ఓవర్లలో 234 పరుగులుగా సవరించారు. సఫారీ బౌలర్లు మరిజానె కాప్‌ (3/20), షాంగసె (2/19) మెరువగా పాకిస్తాన్‌ బ్యాటర్లు తేలిపోయారు. 20 ఓవర్లలో పాకిస్తాన్‌ 7 వికెట్లకు 83 పరుగులే చేసింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో దక్షిణాఫ్రికా 150 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో చెలరేగిన మారిజానె కాప్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -