తక్కువ ఇన్సూరెన్స్ కవరేజీతో ఇబ్బందులు
భారత్‌లో జీవిత బీమా అంతరం 80 శాతం
జీఎస్టీ మార్పులతో బీమా పాలసీల నమోదు పెరిగేనా?
నేటి నుంచే ప్రీమియంలపై నో ట్యాక్స్
బీమా అనేది ఒక భరోసా, నమ్మకం. ఆపత్కాల పరిస్థితుల్లో మనకు, మన కుటుంబానికి ఎంతగానో దోహదం చేస్తుంది. జీవిత, ఆరోగ్య, ఇతర బీమాలు ఒక మనిషికి చాలా ముఖ్యం. కరోనా వంటి విపత్కర పరిస్థితుల కారణంగా ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత చాలా మందికి తెలిసివచ్చింది. చాలా మంది జీవిత, ఆరోగ్య వంటి బీమాకు వెళ్తున్నారు. కానీ అవి కూడా చిన్న పాలసీలే కావటం గమనార్హం. అయితే అలాంటి బీమా పాలసీలు ప్రజల అవసరాలకు, ఆర్థిక పరిస్థితులకు హామీ ఇవ్వటం లేదు. దీంతో వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ)లో తాజా మార్పుల కారణంగా ఇన్సూరెన్స్ పాలసీలపై పన్నులు ఉండవు. దీంతో చెల్లించే ప్రీమియం మొత్తం తగ్గుతుంది. ఇది సోమవారం నుంచి అమలులోకి రానున్నది. దీని ప్రభావం ప్రజల్లో ఎలా ఉండనున్నదన్న విషయం ఆసక్తికరంగా మారింది.
న్యూఢిల్లీ : భారత్‌లో చాలా మంది ప్రజలు ఆర్థిక భద్రతను విస్మరిస్తున్నారు. అక్షరాస్యత, ఆదాయాలు పెరుగుతున్నా.. చాలా మంది భారతీయులు మాత్రం జీవిత బీమా అంతగా ప్రాధాన్యతను ఇవ్వటం లేదు. కొంత మందైతే బీమాను కేవలం పన్ను ప్రయోజనాలను పొందే సాధనంగా మాత్రమే చూస్తున్నారు. మరికొందరు దీనిని అనవసరపు భారంగా భావిస్తున్నారు. భారత్‌లోని ప్రజలు జీవిత బీమా చేయించుకుంటున్నా.. చిన్న పాలసీలకే మొగ్గు చూపుతున్నారు. దేశంలో ఈ జీవిత బీమా అంతరం 80 శాతంగా ఉన్నదని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. దీనర్థం.. భారతీయులు బీమాను కలిగి ఉన్నప్పటికీ.. తీసుకుంటున్నటువంటి చిన్న పాలసీల కారణంగా ఆ కవరేజీ 20 శాతంగానే ఉంటోంది. ఉదాహరణకు.. రూ.10 లక్షల జీవిత బీమా పాలసీ ఉండాల్సిన చోట రూ.2 లక్షల పాలసీకి మాత్రమే ప్రజలు పరిమితమవుతున్నారు. అంటే ఈ గ్యాప్ 80 శాతంగా ఉన్నది. దీని కోసం అనేక కుటుంబాలు పక్క చూపులు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఒక మధ్యతరగతి కుటుంబంలోని పెద్ద అనుకోకుండా చనిపోతే.. ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వీటి నుంచి బయట పడటం కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయటం, సొమ్ములు, భూములు అమ్ముకోవటం, తాకట్టుపెట్టటం వంటివి చేస్తున్నారు. దీంతో ఆర్థికంగా చాలా కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఆ వ్యక్తి మరణాంతరం కూడా ఆ కుటుంబం ఆర్థికంగా భద్రతను కలిగి ఉండాలంటే తగిన జీవిత బీమా కవరేజీతోనే సాధ్యమని అంటున్నారు. ఈ జీవిత బీమా అంతరం 28-40 ఏండ్ల వయస్కుల్లో అధికంగా ఉండటం ఆందోళనను కలిగిస్తున్నది. కారణం.. ఈ ఏజ్ గ్రూపు వారిలో బాధ్యతలు గరిష్టస్థాయికి చేరుకుంటాయి. కుటుంబాన్ని ఆదుకునే గురుతర బాధ్యత వీరి పైనే ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో వీరు చనిపోతే.. వారి మీద ఆధారపడిన కుటుంబాలు ఆర్థిక అస్థిరత కారణంగా రోడ్డున పడే దుస్థితి ఏర్పడుతుంది.
విస్మరించటానికి ప్రధాన కారణాలివే..
భారతీయుల్లో చాలా మంది తక్కువ జీవిత బీమా కవరేజీని కలిగి ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. బీమా విషయంలో అవగాహన ఉన్నప్పటికీ.. అంతగా ప్రాధాన్యతను ఇవ్వటం లేదు. ఇక చాలా మంది ఉద్యోగులు తమ యజమాని అందించే గ్రూప్ బీమా సరిపోతుందనే నమ్మకంలో ఉంటున్నారు. అయితే ఇలాంటి కవరేజీలు సాధారణంగా వార్షిక జీతం కంటే రెండు నుంచి మూడు రెట్లు మాత్రమేఉంటాయి. అయితే తగినంత ఆర్థిక భద్రత కోసం ఈ కవరేజీ కనీసం 10-15 రెట్లు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఆర్థిక విషయాలను సాధారణ ప్రజలకు అంతగా అంచన వేయలేరు. దీంతో ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు కూడా బీమా కవరేజీపై ప్రభావాన్ని చూపుతున్నాయి. నేడు పెద్ద మొత్తంలో ఉన్నట్టు కనిపించే బీమా కవరేజ్.. కొన్నేండ్ల తర్వాత అదే స్థాయిలోఉండకపోవచ్చు. ఇక చాలా మంది బీమాను ఒక టాక్స్ సేవింగ్ (పన్ను ఆదా) ఆయుధంగా వాడుకుంటున్నారు. సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలను పొందేందుకు ఇన్సూరెన్స్ కొనుగోలుకు చాలా మంది మొగ్గు చూపుతున్నా.. అవి చిన్న పాలసీలే కావటం గమనార్హం. దీంతో టాక్స్ సేవింగ్స్‌మీదనే దృష్టి పెడుతూ.. తమ కుటుంబానికి భద్రతనిచ్చే అసలైన పాలసీలను మాత్రం విస్మరిస్తున్నారు.
కనిపిస్తున్న లింగ అంతరం
జీవిత బీమా విషయంలోనూ లింగ అంతరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటి పనితో పాటు ఉద్యోగాలూ చేస్తూ, ఆర్థికంగా తమ వంతు భాగస్వామ్యాన్ని కలిగి ఉంటున్న చాలా మంది మహిళలు.. పురుషులతో పోలిస్తే తక్కువ బీమాను కలిగి ఉంటున్నారు. అయితే అనాథిగా వస్తున్న సాంప్రదాయ, సాంస్కృతిక పరిస్థితులు, తక్కువ వేతనాలు, సరైన అవగాహన లేకపోవటం, కెరీర్‌లో బ్రేక్ రావటం వంటివి ఇందుకు కారణాలుగా ఉన్నాయి.
నేటి నుంచి నో ట్యాక్స్
దేశంలో బీమా పాలసీలపై ఇప్పటి వరకు జీఎస్టీ ఉండేది. ఇది 18 శాతంగా విధించేవారు. దీంతో ఈ ట్యాక్స్ ప్రభావంతో బీమా పాలసీ తీసుకున్నవారు అదనపు భారాన్ని మోసేవారు. ఎక్కువ ప్రీమియాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. అయితే తాజాగా జీఎస్టీలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా బీమా పాలసీలపై జీఎస్టీని 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గించారు. ఇది సోమవారం నుంచి అమలులోకి రానున్నది. తాజా మార్పులతో చెల్లించే ప్రీమియం పన్ను నుంచి మినహాయించబడుతుంది. అయితే జీఎస్టీ మార్పులు ప్రజలలో బీమా పాలసీల కొనుగోళ్లను ప్రోత్సహిస్తాయా? బీమా రంగంపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? అనేది వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు చెప్తున్నారు.