– మండలంలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
– తడిసిన పసుపు, నేలకొరిగిన నువ్వు పంట, జొన్న
– నేల రాలిన మామిడి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
అకాల వర్షానికి రైతులు ఎంతో శ్రమించి సాగు చేసి పండించిన పంట పకృతి వైపరీత్యం కారణంగా నీటిపాలైంది. భారీ వర్షం కారణంగా కల్లాల్లో ఉన్న ధాన్యం మొత్తం తడిసి రైతులకు కోలుకోలేని విధంగా నష్టాన్ని కలిగించింది. మండలంలో అకాల వర్షాలు అన్నదాతను ఆగమాగం చేశాయి. సోమవారం అర్ధరాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు ఉరుములు మెరుపులు బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.
బలమైన ఈదురు గాలుల దాటికి నువ్వు, జొన్న తదితర పంటలు నేల వాలాయి. బలంగా వీచిన గాలుల ప్రభావంతో పెద్ద ఎత్తున మామిడికాయ నేలరాలింది.రైతులు కల్లాల్లో ఉడికించి ఆరబెట్టిన పసుపు, కోసి రిక్కీ సంచుల్లో నింపిన మొక్కజొన్న తడిసిపోయింది. పలుచోట్ల మొక్కజొన్న, జొన్న పంటలు అడ్డం పడ్డాయి.ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలకు దెబ్బతిని రైతు కళ్ళల్లో కడగండ్లను మిగిల్చింది. పంట చేతికొస్తున్న తరుణంలో ఈదురుగాలుల దాటికి మామిడికాయ నేలరాలడంతో మామిడి రైతులకు కోలుకోలేని నష్టం ఏర్పడింది.వెంటనే ప్రభుత్వం మేల్కొని మండలంలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని పలు రైతులు కోరారు.




