Tuesday, May 13, 2025
Homeమానవితిరుగులేని మహిళా శక్తి

తిరుగులేని మహిళా శక్తి

- Advertisement -

మహిళా శక్తికి తిరుగులేదని మరోసారి చాటిచెప్పారు. అవకాశాలు కల్పించాలే కానీ ఏ రంగంలోనైనా దూసుకుపోగలమని నిరూపించారు. ఎన్ని విజయాలు సాధిస్తున్నా ఇంకా కొన్ని రంగాలలో ఇప్పటికీ మహిళలకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ‘మహిళలు ఈ రంగంలో పని చేయడం అసాధ్యం అనే’ ఆలోచనలు ఉన్నాయి. అలాంటి రంగాలలో రక్షణ రంగం ఒకటి. ఒకప్పుడు ఈ రగంలో మహిళలకు ప్రవేశం నిషేదం. ఎన్నో పోరాటాల తర్వాత చివరకు ఇందులోనూ మహిళలు అడుగుపెట్టారు. ఇప్పుడు దేశం గర్వించేలా ధైర్య సాహసాలు చూపుతున్నారు. పహల్గాం దాడి తర్వాత జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించింది ఇద్దరు మహిళా అధికారులు. ఇప్పుడు వీరి గురించి దేశమంతా చర్చ జరుగుతుతోంది. వారిగురించి మనమూ తెలుసుకుందాం…
ప్రభుత్వాలు చెబుతున్నట్టు అపరేషన్‌ సిందూర్‌ వల్ల ఉగ్రవాదం అంతమవుతుందో లేదో చెప్పలేం కానీ. మన దేశ రక్షణ రంగంలో మహిళా శక్తి గురించి మాత్రం ప్రపంచానికి చాటగలిగాం. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత అక్కడి పరిస్థితుల గురించి ఆ ఇద్దరు మహిళా సైనికాధికారులు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతుంటే దేశ ముద్దుబిడ్డలుగా వారిని అభివర్ణించుకున్నాం. వారే సోఫియా ఖురేషీ, వ్యోమిక సింగ్‌.
సోఫియా ఖురేషీ
సోఫియా గుజరాత్‌లోని ముస్లిం కుటుంబంలో పుట్టారు. పెహల్గాం దాడులను హిందూ ముస్లింల మధ్య జరిగిన దాడిగా ప్రభుత్వం చిత్రించే ప్రయత్నం చేస్తోంది. కానీ దాడులుకు పాల్పడిన ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఏర్పాటు చేసిన ఆపరేషన్‌కు ఓ ముస్లిం మహిళ నాయకత్వం వహించడం దేశం గర్వించదగ్గ విషయం. అంతే కాదు మన లౌకికత్వానికి, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. సోఫియా బయోకెమిస్ట్రీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. ముఖ్యంగా ఈమెకు ఆర్మీ కుటుంబ నేపథ్యం ఉంది. ఆమె తాత కూడా ఇండియన్‌ ఆర్మీలో పనిచేసి దేశానికి సేవలందించారు. అదే స్ఫూర్తితో సోఫియా కూడా ఇండియన్‌ ఆర్మీలో చేరారు.
రాజీలేని వైఖరి
సోఫియా తన పదిహేడేండ్ల వయసులో అంటే 1999లో భారత సైన్యంలో చేరారు. ఆర్మీ సిగల్‌ కోర్‌కు చెందిన సీజన్డ్‌ ఆఫీసర్‌ ఆమె. ఐరాస శాంతి పరిరక్షక దళంలో ఆరేండ్లు పని చేశారు. 2006లో కాంగోలో విశేష సేవలం దించారు. శాంతి పరిరక్షణ కార్యకలా పాల్లో భాగంగా, శిక్షణకు సంబంధించిన సహకార కార్యక్రమాల్లో సేవలందించారు. మూడు దశాబ్దాల ప్రయాణంలో ఆమె రాజీలేని వైఖరి ప్రదర్శించారు. కాబట్టే తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ అయిన జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఆమె పనితీరును ప్రశంసించారు. సోఫియా మెకనైజ్డ్‌ ఇన్‌ఫాంట్రీ అధికారిని వివాహం చేసుకున్నారు.
ఏకైక మహిళాగా…
ప్రస్తుతం సోఫియా ఖురేషీ భారత సైన్యంలో కల్నల్‌ హోదా అధికారి. ఆమెకు పీస్‌ కీపర్‌గా అపార అనుభవం వుంది. పుణెలో, 2016లో మల్టీనేషనల్‌ ఫీల్డ్‌ ట్రైనింగ్‌ ఎక్సర్‌సైజ్‌ ‘ఫోర్స్‌ 18’ జరిగింది. ఈ ఫోర్స్‌ 18లో ఏసియన్‌ ప్లస్‌ దేశాలు పాల్గొన్నాయి. భారత గడ్డపై ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద గ్రౌండ్‌ఫోర్సెస్‌ ఎక్సర్‌సైజ్‌ ఇది. అప్పుడు బలగాలు శాంతి పరిరక్షణ కార్యకలాపాలు, మందుపాతర తొలగింపుపై దృష్టి సారించాయి. ఈ ఎక్సర్‌ సైజ్‌లో 40 మంది సైనికులతో కూడిన భారత ఆర్మీ బృందానికి సిగల్‌ కార్ప్స్‌కి చెందిన మహిళా అధికారి, లెఫ్టినెంట్‌ కల్నల్‌ సోఫియా నాయకత్వం వహించారు. దానిలో 18 దేశాలు పాల్గొన్నాయి. అన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక్క భారత్‌ బృందానికి మాత్రమే మహిళ నాయకత్వం వహించడం మన దేశానికే గర్వకారణంగా అందరూ భావించారు. భారీ స్థాయిలో జరిగిన ఈ బహుళ దేశాల ఆర్మీ ఎక్సర్‌సైజ్‌లో, భారత ఆర్మీ శిక్షణ బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిగా ఆమె అరుదైన ఘనత సాధించారు.
వ్యోమిక సింగ్‌
ఆపరేషన్‌ సిందూర్‌ గురించి మీడియాకు వివరించిన మరో మహిళా అధికారి వింగ్‌ కమాండర్‌ వ్యోమిక సింగ్‌. వ్యోమిక భారత వైమానిక దళం (ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌)లో హెలికా ప్టర్‌ పైలట్‌. చిన్నప్పుడే పైలట్‌కావాలని కలలు కన్నారు. ఇదే విషయాన్ని ఆమె అనేకసార్లు మీడియాతో పంచుకునే వారు. చదువుకునే రోజుల్లోనే ఆమె నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ (ఎన్‌సీసీ)లో చేరారు. ఇంజినీరింగ్‌ విద్యను పూర్తి చేసిన ఆమె తన కలలను నిజం చేసుకు నేందుకు భారత వైమానిక దళంలోని హెలికాప్టర్‌ పైలట్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2019లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లోని ఫ్లయింగ్‌ బ్రాంచ్‌లో పైలట్‌గా శాశ్వత హోదా పొందారు.
అనేక రెస్క్యూ ఆపరేషన్లలో…
వ్యోమికాకు పైలట్‌గా 2500 గంటలకు పైగా హెలికాప్టర్లను నడిపిన అనుభవముంది. జమ్ముకశ్మీర్‌తో పాటు ఈశాన్య భారత్‌లోని ఎత్తైన ప్రాంతాలతో పాటు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, సవాలుతో కూడిన ప్రాంతాల్లో చేతక్‌ – చీతా వంటి హెలికాప్టర్లను ఆమె నడిపారు. అనేక రెస్క్యూ ఆపరేషన్లలోనూ వ్యోమిక సింగ్‌ కీలకపాత్ర పోషించారు. వీటిలో 2020లో అరుణాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లలో ఒకటి. తన కుటుంబం నుండి భారత భద్రతా బలగాల్లో చేరిన తొలి వ్యక్తి ఆమే కావడం మరో విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -