Monday, September 29, 2025
E-PAPER
Homeఖమ్మంకౌలు రైతుకు యూరియా కష్టాలు

కౌలు రైతుకు యూరియా కష్టాలు

- Advertisement -

– పాస్‌బుక్‌ జిరాక్స్‌లు ఇచ్చినా ఎరువు ఇవ్వని అధికారులు
– దూరప్రాంతంలో ఉన్న పట్టేదారులు రావాల్సిందేనని తిరకాసు
– అటు రైతు భరోసాకూ నోచుకోని వైనం
– పంటలమ్మేటప్పుడూ అష్టకష్టాలు
– సీసీఐ కపాస్‌ యాప్‌తో పత్తి అమ్మకమూ కష్టమే..!
– రాష్ట్రంలో 25 లక్షల మంది రైతుల గోసపట్టని ప్రభుత్వం

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కౌలు రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎకరం రూ.35వేల వరకూ వెచ్చించి కౌలు చేస్తున్నా యూరియా దొరక్క అరిగోస పడుతున్నారు. రకరకాల అనుమానాలతో కొందరు పట్టేదారులు పాస్‌బుక్‌ జిరాక్స్‌ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది పాస్‌బుక్‌ జిరాక్స్‌లు ఇచ్చినా అధికారులు భూ యజమాని రావాల్సిందేనని కొర్రీలు పెడుతున్నారు. దూరప్రాంతంలో ఉన్న వారు రావటం సాధ్యం కాదని, ఓటీపీ నంబర్‌ చెబుతారన్నా కూడా వ్యవసాయశాఖ అధికారులు ఒప్పుకోవటం లేదు. అనేక గ్రామాల్లో 90శాతం మంది వరకూ కౌలు రైతులే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి పైగా కౌలు రైతులు సేద్యం చేస్తున్నారు. వారు యూరియానే కాదు రైతుభరోసాకూ నోచుకోవటం లేదు. ప్రభుత్వం కౌలు రైతులు ఒక్కొక్కరికీ రూ.12వేల చొప్పున ఇస్తామన్న రైతుభరోసా అమలు కావటం లేదు. కేవలం భూ యజమానులకు మాత్రమే సీజన్‌కు రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.12వేలు ఇస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం పంటల అమ్మకాల్లో మార్చుతున్న నిబంధనలు, ప్రవేశపెడుతున్న కొత్తయాప్‌లతోనూ రైతులకు కష్టాలు వచ్చి పడుతున్నాయి. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఈ సీజన్‌ నుంచి అమలు చేయనున్న కపాస్‌ యాప్‌తో కౌలు రైతులే కాదు పట్టేదారులు సైతం ప్రయివేటు వ్యాపారుల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.

కౌలు రైతు కాంప్లెక్స్‌ ఎరువుతో సరి
కౌలు రైతులకు యూరియా అందకపోవటంతో కాంప్లెక్స్‌ ఎరువులతోనే సరిపెడుతున్నారు. కొందరు నానో యూరియా ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. మొదట్లో యూరియా కట్టకు ఒకటి చొప్పున నానో ద్రావణాన్ని లింక్‌ పెట్టి పంపిణీ చేశారు. ఆ బాటిల్‌ ద్రావణాన్ని స్ప్రే చేసిన పలువురు రైతులు సత్ఫలితం రాలేదని యూరియా బదులు కాంప్లెక్స్‌ ఎరువుల వైపు మొగ్గుచూపుతున్నారు. దాదాపు నెల రోజుల క్రితం వరకు ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ఆధారంగా పీఏసీఎస్‌ల ద్వారా యూరియా పంపిణీ చేసిన అధికారులు ఇప్పుడు పాస్‌బుక్‌ జిరాక్స్‌నూ తీసుకుంటున్నారు. దాంతో వ్యవసాయశాఖ అధికారులు పాస్‌బుక్‌ ఎవరి పేరుతో ఉంటే వాళ్లు రావాల్సిందేనని తిరకాసు పెడుతున్నారు. భూములను కౌలుకు ఇచ్చి దూరప్రాంతంలో ఉండే యజమానులు ఎలా వస్తారని.. కౌలు రైతులు ప్రశ్నిస్తున్నా అవేవీ పట్టించుకోవటం లేదు.

దొడ్డిదారిలో సరఫరా
కొందరు ఏఈవోలు, ఏవోలు గుట్టుచప్పుడు కాకుండా దొడ్డిదారిలో యూరియా బస్తాలు సొసైటీ డైరెక్టర్లు, సన్నిహితులకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలానికి చెందిన ఓ అధికారికి అక్రమంగా 10 బస్తాల యూరియా సరఫరా చేసినట్టు తెలుస్తోంది. తమకు చెందాల్సిన ఎరువులో కోతపెట్టి ఇలా అక్రమ పద్ధతిలో సరఫరా చేస్తున్నారని కౌలు రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్క కొణిజర్ల మండలంలోనే 6వేల మంది వరకు కౌలు రైతులు సేద్యం చేస్తున్నారు. భూ యజమానులు వస్తేనే యూరియా ఇస్తామనటం ఎంతవరకు సమంజసమని కౌలుదారులు ప్రశ్నిస్తున్నారు.

పంట ఉత్పత్తుల విక్రయమూ సమస్యే
ఒక్క యూరియానే కాదు కౌలు రైతులకు పంట ఉత్పత్తుల విక్రయం కూడా సమస్యగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు జాప్యం అవుతుండటం, భూ యజమానుల అకౌంట్లలో డబ్బులు పడతాయి కాబట్టి సన్నవడ్ల బోనస్‌ రూ.500ను సైతం అనేక మంది కౌలుదారులు వదులుకుని ప్రయివేటుగా విక్రయించుకుంటున్నారు. సీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కపాస్‌ యాప్‌లో కౌలుదారుల కోసం ప్రత్యేక కాలమ్‌ ఉన్నా పాస్‌బుక్‌ నంబర్‌ ఎంట్రీ లేకుంటే సీసీఐకి అమ్మటం కుదరదు. ఫార్మర్‌ టైప్‌ కాలంలో సొంతమా, కౌలుదారా పేర్కొనాలి. పట్టాదార్‌ పాస్‌బుక్‌ నంబర్‌, సర్వే నంబర్‌, కొలత రకం, రైతుకు ఉన్న భూమి మొత్తం, దీనిలో పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం (దేశీ కాటన్‌, ట్రెడీషనల్‌, హెచ్‌డీపీఎస్‌, క్లోజర్‌ స్పేసింగ్‌, రేర్‌ స్పేసింగ్‌) తదితర వివరాలతో పాటు రైతుకు సంబంధించిన ఆధార్‌కార్డు, పాస్‌బుక్‌, రైతు ఫొటోను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ ప్రక్రియ ఎక్కువగా నిరక్షరాస్యులైన కౌలురైతులు చేయటం దాదాపు సాధ్యం కాదని మార్కెటింగ్‌ శాఖ అధికారులే చెబుతున్నారు. రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా దీనిలో సగానికి ఎక్కువ కౌలురైతులే సేద్యం చేస్తున్నారు.

దూరప్రాంతాల్లో ఉండే పట్టాదారు ఎలా వస్తారు..? : చింతబోయిన కృష్ణ, సింగరాయపాలెం, కౌలు రైతు
నేను పది ఎకరాలు కౌలు చేస్తున్నాను. పత్తి 8 ఎకరాలు, పెసరు 2 ఎకరాలు, వరిపొలం ఎకరం వేశాను. ఎకరానికి రూ.30వేల చొప్పున కౌలు చెల్లిస్తున్నాను. నాకు యూరియా బస్తాలు ఇవ్వటం కుదరదని అధికారులు చెప్పారు. 20 రోజుల క్రితం ఆధార్‌ కార్డు మీద కట్ట ఇచ్చారు. రెండోసారి పాస్‌బుక్‌ జిరాక్స్‌ ఉంటేనే ఇస్తామన్నారు. ఏఈవో సంతకం తీసుకు రమ్మన్నారు. సంతకం కోసం పోతే ఏఈవోలు యూరియా ఇచ్చేటప్పుడే సంతకం చేసి ఇస్తామన్నారు. మా క్లస్టర్‌ రైతు వేదిక పెద్దరాంపురంలో ఉంది. పని చెడగొట్టుకొని అక్కడికి పోతే పట్టేదారు వస్తేనే యూరియా ఇస్తామంటున్నారు. గ్రామంలో 90శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. యూరియా ఇవ్వకపోవటంతో కాంప్లెక్స్‌ ఎరువులు చల్లార. మొదట్లో బస్తాకు నానో యూరియా ఒక సీసా చొప్పున లింకు పెట్టి ఇచ్చారు. దాన్ని స్ప్రే చేసినా సరిగ్గా పనిచేయలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -