ఏఐ భద్రతా నియమాలపై మాటల యుద్ధం
సైనిక వినియోగం కోసం సేఫ్టీ గార్డులు తొలగించేందుకు నిరాకరణ
కృత్రిమమేథ వినియోగంపై వివాదం
అమెరికాలో కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంపై కీలక వివాదం తలెత్తింది. యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు ఏం చేయాలో తెలియక బుర్రవేడెక్కుతోంది. దేశ భద్రత పేరుతో సైనిక అవసరాల కోసం ఏఐ సిస్టమ్‌లలో ఉన్న రక్షణ పరిమితులను తొలగించాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. అందుకు ఓ ప్రముఖ ఏఐ సంస్థ సూటిగా నో చెప్పింది. దీంతో ట్రంప్ ప్రభుత్వానికి, టెక్ కంపెనీకి మధ్య ఘర్షణాత్మక పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెరుపై అమెరికా రక్షణ శాఖ తీవ్ర విమర్శలు
వాషింగ్టన్ : ప్రపంచదేశాలకే తలనోప్పిగా మారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు స్వదేశంలో రక్షణశాఖ వర్సెస్ ఆంథ్రోపిక్‌ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. దీన్ని ఎలా పరిష్కరించాలన్న దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు.
భాగస్వామ్యాన్ని రద్దు చేస్తామంటూ హెచ్చరిక
ఇక పెంటగాన్ స్పష్టంగా హెచ్చరిక జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం వరకు నిర్ణయం తీసుకోకపోతే ఆంథ్రోపిక్‌ను సప్లై చైన్ రిస్క్‌గా ప్రకటించి భాగస్వామ్యాన్ని రద్దు చేస్తామని తెలిపింది. అవసరమైతే డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్‌ను ఉపయోగించి చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది. అయితే అమోడెరు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ”ఏఐను సామూహిక నిఘా, స్వయంచాలక ప్రాణాంతక ఆయుధాల కోసం ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ఒక డ్రోన్ ఎవరిని కాల్చాలో ఏఐ స్వయంగా నిర్ణయించే స్థితి ప్రమాదకరం” అని హెచ్చరించారు. మనుషుల ప్రమేయం లేకుండా ఆయుధ వ్యవస్థలు పనిచేస్తే దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆంథ్రోపిక్ రూపొందించిన మోడళ్లు సున్నితమైన రక్షణ, నిఘా వ్యవస్థల్లో కూడా ఉపయోగపడు తున్నాయి. క్లాసిఫైడ్ డేటాను విశ్లేషించడంలో, సైబర్ భద్రతలో, వ్యూహాత్మక అంచనాల్లో సహాయం చేస్తున్నాయి. అయితే వాటిలో పెట్టిన భద్రతా నియమాలు కొన్ని కీలక సైనిక ఆపరేషన్లకు అడ్డంకిగా మారుతున్నాయని రక్షణశాఖ వాదిస్తోంది. అందుకే ఏ చట్టబద్ధ ఉపయోగమైనా అనుమతించాలనే షరతును ప్రభుత్వం ముందుకు తెచ్చింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించం
అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్‌పై రక్షణశాఖ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఆ సంస్థ అభివృద్ధి చేసిన ఏఐ మోడళ్లలో సేఫ్టీ గార్డ్‌రైల్స్ ఉండటం వల్ల సైనిక కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో వినియోగించలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. అయితే ఆ పరిమితులను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబోమని కంపెనీ సీఈఓ డారియో అమోడెరు స్పష్టం చేశారు.
దేశ భద్రతను పణంగా పెట్టే హక్కు ఎవరికీ లేదు
ఈ అంశంపై అమెరికా రక్షణశాఖ, అంటే అమెరికా యుద్ధ విభాగం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సైనిక అవసరాలకు చట్టబద్ధ వినియోగం కోసం మాత్రమే తమ డిమాండ్ అని చెబుతున్నా, అమోడెరు సహకరించడం లేదని ఆరోపించింది. అండర్ సెక్రెటరీ ఎమిల్ మైఖేల్, పెంటగాన్ ప్రతినిధులు ఆయనపై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. ఒక ప్రయివేట్ కంపెనీ సైనిక నిర్ణయాలను ప్రభావితం చేయకూడదు. దేశ భద్రతను పణంగా పెట్టే హక్కు ఎవరికీ లేదంటూ మండిపడ్డారు.
ఏఐను సైన్యంలో ఎంతవరకు ఉపయోగించాలి?
మరోవైపు ఆంథ్రోపిక్ మాత్రం వేరే వాదన వినిపిస్తోంది. ”చట్టబద్ధం అన్న పేరుతో అన్నింటికీ అనుమతిస్తే భవిష్యత్తులో నియంత్రణ కోల్పోతాం. ఏఐ వ్యవస్థలు ఇంకా పూర్తిగా నమ్మదగిన స్థాయికి రాలేదు. అవి తప్పు నిర్ణయాలు తీసుకుంటే పెద్ద నష్టం జరుగుతుంది” అని కంపెనీ పేర్కొంది. అందుకే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతోంది. ఈ వివాదం టెక్నాలజీ రంగంలో పెద్ద చర్చకు దారి తీసింది. ఏఐను సైన్యంలో ఎంతవరకు ఉపయోగించాలి? మనుషుల నియంత్రణ ఎంతవరకు ఉండాలి? ప్రభుత్వ ఆదేశాలకు ప్రయివేట్ కంపెనీలు పూర్తిగా లోబడాలా? లేక నైతిక పరిమితులు పెట్టుకోవాలా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది భవిష్యత్ యుద్ధాల రూపురేఖలను నిర్ణయించే కీలక ఘట్టం. ఒకవైపు దేశ భద్రత, మరోవైపు నైతిక బాధ్యతల మధ్య సమతౌల్యం సాధించడం అవసరమని వారు సూచిస్తున్నారు. ఏదేమైనా అమెరికా ప్రభుత్వం, ఆంథ్రోపిక్ మధ్య ఈ ఘర్షణ తక్షణం ముగిసేలా కనిపించడం లేదు. మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, తమ సేఫ్టీ నిబంధనల విషయంలో రాజీ పడబోమని కంపెనీ స్పష్టం చేయడంతో ఈ వివాదం ఇంకా ముదురే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



