Saturday, August 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభారతీయ చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

భారతీయ చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

- Advertisement -

ఇతర దేశాల సంస్థలపై కూడా…
ఇరాన్‌ నుంచి ‘పెట్రో’ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నాయని ఆరోపణ
వాషింగ్టన్‌ :
తన శత్రు దేశాలతో వ్యాపారం చేస్తున్న వారిని అమెరికా ముప్పుతిప్పలు పెడుతోంది. రష్యా నుంచి ఆయుధాలు, చమురును కొనుగోలు చేస్తోందన్న ఆరోపణతో భారత్‌పై అమెరికా పాతిక శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. అది చాలదన్నట్లు ఇరాన్‌ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకొని మార్కెటింగ్‌ చేస్తున్నారన్న ఆరోపణపై ఆరు భారతీయ కంపెనీలపై తాజాగా ఆంక్షలు విధించింది. ఇరాన్‌ చమురుతో వ్యాపారం చేస్తున్న వివిధ దేశాలకు చెందిన 20 సంస్థలను అమెరికా విదేశాంగ శాఖ లక్ష్యంగా చేసుకుంది. వీటిలో ఆరు సంస్థలు మన దేశానికి చెందినవే. ఈ కంపెనీలు అనేక మిలియన్‌ డాలర్ల విలువ కలిగిన ఇరాన్‌ పెట్రోకెమికల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
‘చమురు విక్రయం ద్వారా ఇరాన్‌ పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకుంటోంది. వాటితో మధ్యప్రాచ్యంలో ఘర్షణలు, అస్థిరతకు ఆజ్యం పోస్తోంది. తన ప్రజలతో పాటు ప్రపంచ దేశాలను అణచివేసేందుకు ఉగ్ర ముఠాలకు ఆర్థిక సాయం చేస్తోంది. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌పై ఒత్తిడి తేవడానికి కఠిన చర్యలు చేపట్టాం. ఇరాన్‌ పెట్రోలియం, పెట్రోకెమికల్స్‌ ఉత్పత్తులతో వ్యాపారం చేస్తున్న వివిధ దేశాలకు చెందిన 20 కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నాం’ అని విదేశాంగ శాఖ తెలియజేసింది.
ఆంక్షల జాబితాలోని కంపెనీలు ఇవే
భారత్‌తో పాటు యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌, తుర్కియే, ఇండోనేషియా దేశాలకు చెందిన కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్‌ నుంచి పెట్రోలియం, పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అనుకునే వారు తాము విధించే ఆంక్షలను ఎదుర్కోక తప్పదని, అంతేకాక తమతో వ్యాపారం చేసే అవకాశాన్ని కూడా కోల్పోతారని హెచ్చరించింది. అమెరికా ఆంక్షలు ఎదుర్కొం టున్న భారతీయ కంపెనీలలో అల్‌ కెమికల్‌ సొల్యూషన్స్‌, రమణిక్‌లాల్‌ ఎస్‌ గోసాలియా అండ్‌ కంపెనీ, జ్యూపిటర్‌ డై కెమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గ్లోబల్‌ ఇండిస్టియల్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌, పర్సిస్టెంట్‌ పెట్రోకెమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉన్నా యి. అమెరికా చెబుతున్న దాని ప్రకారం…అల్‌ కెమికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ గత సంవత్సరం ఇరాన్‌ నుంచి 84 మిలియన్‌ డాలర్ల విలువ కలిగిన పెట్రోకెమికల్స్‌ వస్తువుల ను దిగుమతి చేసుకుంది. గ్లోబల్‌ ఇండిస్టియల్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ కంపెనీ గత ఏడాది జూలై నుంచి ఈ సంవత్సరం జనవరి వరకూ 51 మిలియన్‌ డాలర్ల విలువైన మెంథాల్‌, ఇతర పదార్థాలను కొనుగోలు చేసింది. జ్యూపిటర్‌ డై కెమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఇదే కాలంలో టోలుయీన్‌ సహా 49 మిలియన్‌ డాలర్ల విలువైన వివిధ వస్తువులను ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకుంది. రమణిక్‌లాల్‌ ఎస్‌ గోసాలియా అండ్‌ కంపెనీ ఇరాన్‌ నుంచి 22 మిలియన్‌ డాలర్ల విలువైన మెంథాల్‌, టోలుయీన్‌ను కొనుగోలు చేసింది. పర్సిస్టెంట్‌ పెట్రోకెమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ గత సంవత్సరం అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్యకాలంలో 14 మిలియన్‌ డాలర్ల విలువైన మెంథాల్‌ను దిగుమతి చేసుకుంది. వీటితో పాటు కాంచన్‌ పాలిమార్స్‌ కంపెనీ 1.3 మిలియన్‌ డాలర్ల విలువైన పాలిథిన్‌ను ఇరాన్‌ నుంచి కొనుగోలు చేసింది.
ఏమవుతుంది?
ఆంక్షల నేపథ్యంలో ఆ కంపెనీలు, వాటి యజమానులకు అమెరికాలో కానీ, దాని నియంత్రణలో ఉన్న దేశాలలో కానీ ఆస్తులు ఉన్నట్లయితే వాటిని ఫ్రీజ్‌ చేస్తారు. అంతేకాదు…అమెరికా పౌరులు, కంపెనీలు వాటితో వ్యాపారం చేయకూడదు.
వాటికి సంబంధించిన లావాదేవీలన్నింటినీ నిషేధిస్తారు. ఆంక్షలు విధించిన కంపెనీల తరఫున ఇతర దేశాలలో వ్యాపారం చేస్తున్న సంస్థలపై కూడా నిషేధం విధిస్తారు. ఉదాహరణకు యూఏఈలోని బర్షా ట్రేడింగ్‌ ఎల్‌ఎల్‌సీ అనే కంపెనీ పర్సిస్టెంట్‌ పెట్రోకెమ్‌తో కలిసి పనిచేస్తోంది. దీంతో అమెరికా ఆంక్షలు బర్షా ట్రేడింగ్‌ ఎల్‌ఎల్‌సీకి కూడా వర్తిస్తాయి. ఇరాన్‌పై సాధ్యమైనంత ఎక్కువ ఒత్తిడి తెచ్చేందుకే ఈ ఆంక్షలు విధించామని అమెరికా చెబుతోంది.
ఇరాన్‌ నుంచి చమురు, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను ఎగుమతి చేసే నౌకలు, వ్యాపారులు, బ్రోకర్లు…ఇలా అందరిపై నిఘా ఉంచుతారు. ఈ చర్యలు ఇరాన్‌ను శిక్షించేందుకు తీసుకుంటున్నవి కావని, దాని ప్రవర్తనలో సానుకూల మార్పు తీసుకురావడమే తమ ఉద్దేశమని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
ఈ కంపెనీలపై కూడా…
ఇరాన్‌తో భారత్‌కు చాలా కాలంగా వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా మన దేశం ఇరాన్‌ నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే 2019లో అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఆ దేశం నుంచి చమురు దిగుమతులను భారత్‌ తగ్గించుకుంది. అయినప్పటికీ రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి. అమెరికా తాజాగా విధించిన ఆంక్షలు భారతీయ కంపెనీలకే పరిమితం కావడం లేదు. టర్కీ, చైనా, ఇండోనేషియా, యూఏఈ కంపెనీల పైన కూడా అమెరికా ఆంక్షలు విధించింది. వీటిలో అనేక కంపెనీలకు భారత్‌తో సంబంధాలు ఉన్నాయి. ఉదాహరణకు యూఏఈలోని టియోడార్‌ షిప్పింగ్‌ ఎల్‌ఎల్‌ఈకి అనుబంధంగా ఉన్న కోరా లైన్స్‌ కంపెనీని ఓ భారతీయుడు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ కంపెనీ కూడా అమెరికా ఆంక్షలకు గురవుతోంది. తమపై విధించిన ఆంక్షలను ఆయా కంపెనీలు ఫారిన్‌ అస్సెట్స్‌ కంట్రోల్‌కు చెందిన అమెరికా ట్రెజరీ కార్యాలయంలో సవాలు చేయవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -