Saturday, May 3, 2025
Homeబీజినెస్భారత వృద్ధికి యూఎస్‌ టారిఫ్‌ల దెబ్బ

భారత వృద్ధికి యూఎస్‌ టారిఫ్‌ల దెబ్బ

– ఈ ఏడాది వృద్ధి 6.3 శాతమే..!
– ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా టారిఫ్‌లు ప్రతికూల ప్రభావం చూపనున్నాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ అంచనాలను 20 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.3 శాతానికి పరిమితం చేసింది. వచ్చే 2026-27లోనూ వృద్ధి 6.5 శాతంగానే ఉండొచ్చని విశ్లేషించింది. ఇంతక్రితం ఈ అంచనాలు వరుసగా 6.5 శాతం, 6.7 శాతంగా ఉన్నాయి. ఇటీవల ఆర్‌బిఐ కూడా 2025-26లో భారత వృద్ధి రేటు 6.7 శాతం నుంచి 6.5 శాతానికి కోత పెట్టింది. అమెరికా విధానాలతో నెలకొన్న వాణిజ్య అనిశ్చితుల నేపథ్యంలో జిడిపి అంచనాలను తగ్గిస్తున్నట్టు తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రపంచ దేశాలపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర మందగమనానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరించడం, ట్రంప్‌ విధానాలపై సొంత దేశంలోనే తీవ్ర నిరసనలు నెలకొనడంతో పెంచిన టారిఫ్‌లను 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌ సహా ఇతర దేశాల వృద్ధి అంచనాలను ఎస్‌అండ్‌పీ వెల్లడించింది. అమెరికా, కెనడా, యూరప్‌, జర్మనీ, ఇటాలి, చైనా, జపాన్‌, బ్రిటన్‌ దేశాలపై టారిప్‌ల ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది అమెరికా జీడీపీ 60 బేసిస్‌ పాయింట్లు (0.60 శాతం) తగ్గి 1.5 శాతానికే పరిమితం కానుందని పేర్కొంది. వచ్చే ఏడాది 1.7 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ”అమెరికా దిగుమతి సుంకాల పెరుగుదల, వాణిజ్య ప్రతీకారం, కొనసాగుతున్న రాయితీలు, తదనంతరం మార్కెట్‌ల అల్లకల్లోలం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలను ఆందోళనకు గురి చేస్తోన్నాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ గ్లోబల్‌ చీఫ్‌, ఎకనామిస్ట్‌ పాల్‌ గ్రుయెన్‌ వాల్డ్‌ పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలలో వృద్ధి తగ్గుదలకు ప్రమాదం పెరిగినప్పటికీ, అలాగని భారీ మందగమనం ఉంటుందని భావించడం లేదన్నారు. అదే విధంగా ఈ సమయంలో అమెరికా మాంద్యాన్ని ఊహించలేమన్నారు. భారత వృద్ధి రేటు అంచనాలకు ఇటీఇవల ప్రపంచ బ్యాంక్‌ కోత పెట్టింది. దేశంలో మూలధన వ్యయాల తగ్గుదలకు తోడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో బలహీనత, అమెరికా విధాన అనిశ్చితి నేపథ్యంలో భారత జీడీపీ 0.4 శాతం తగ్గి 6.3 శాతానికి పరిమితం కావొచ్చని విశ్లేషించింది. ఇంతక్రితం ఈ అంచనా 6.7 శాతంగా ఉంది. భారత్‌లో ప్రయివేటు పెట్టుబడులు, ప్రభుత్వ మూలధన వ్యయాలు నెమ్మదించడం వల్ల గడిచిన 2024-25లోనూ వృద్ధి నిరాశపర్చిందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. ప్రస్తుత 2025-26లో వృద్ధి 6.2 శాతానికి పరిమితం కావొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనా వేసింది. ఇంతక్రితం 6.5 శాతం అంచనాతో పోల్చితే 0.3 శాతం తగ్గనుందని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img