Sunday, March 8, 2026
E-PAPER
Homeసోపతివసుంధరా దేవి నటన - జీవితం ఒకటి కాని రెండు దారులు

వసుంధరా దేవి నటన – జీవితం ఒకటి కాని రెండు దారులు

- Advertisement -

కోర్టులో జడ్జి పక్కన దిక్కు బిక్కుమంటూ కూర్చున్న ఆ పదిహేనేళ్ల పిల్ల ఏం చెబుతుందోనని అందరూ ఉద్వేగంగా చూస్తూ ఉన్నారు. నీవు అమ్మా నాన్నలలో ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావు? అన్న జడ్జి ప్రశ్నకు ఆ అమ్మాయి వద్ద నుండి సమాధానం లేదు. అంత చిన్న పిల్ల తల్లిదండ్రులలో ఎవరిని వద్దనుకుంటుంది? ఎవరిని కావాలనుకుంటుంది? ఏ సమాధానం చెప్పలేని మానసిక స్థితి ఆమెది. మైనర్‌ బాలికైన ఆ పిల్ల తనతో బాటే ఉంటుందని తల్లి ఒకవైపు, కాదు కూతురు సంరక్షణ తానే చూసుకుంటానని తండ్రి మరొకవైపు న్యాయమూర్తిని అభ్యర్థిస్తారు. వీరు ఇద్దరు కాకుండా మూడో వ్యక్తి కూతురికి అడ్డం పడుతూ అల్లుడి పక్షం వహించి ఆ మైనర్‌ బాలిక అంటే తన మనవరాలిని తల్లి వద్ద కాకుండా తమ సంరక్షణలో ఉంచమని న్యాయమూర్తినకి విజ్ఞప్తి చేసింది.

ఆ సందర్భంలో తన పక్కన బెదురుగా కూర్చున్న ఆ అమ్మాయి భవిష్యత్తులో భారతీయ సినిమా రంగంలో అగ్రశ్రేణి తారగా వెలుగొందుతుందని ఆ జడ్జి ఊహించి ఉండడు. ఆ తార వైజయంతి మాల. ఆమె తల్లి వసుంధరా దేవి. తండ్రి ఎన్టీ రామన్‌. అమ్మమ్మ యదుగిరి అమ్మాళ్‌. ఒక స్త్రీ తన బిడ్డ సంరక్షణను తనకు అప్పజెప్పవలసిందిగా న్యాయస్థానంలో విజ్ఞప్తి చేసే పరిస్థితి వసుంధరా దేవికి రావడం నాటి సమాజాన్ని ఆశ్చర్యంలో ముంచివేసింది.
వసుంధరా దేవి తొలినాటి తమిళ సినీ తెరపై ఆమె ఒక అద్భుతమైన సౌందర్యరాశి. హిందీ తమిళ తెలుగు తెరపై అందాల తారగా వెలుగొందిన వైజయంతిమాలకు వసుంధరా దేవి కన్నతల్లి. విచిత్రం ఏమిటంటే వైజయంతిమాల తన ఆత్మ కథలో తల్లి వసుంధరా దేవి గురించి ఒక్క అక్షరం కూడా రాయకపోవడం. ఆమె తండ్రి ఎం.వి. రామన్‌కు తల్లి విడాకులు ఇచ్చింది. అత్త, అల్లుడు కలిసి కూతురిని చూసుకోవడం, తల్లి తనను శత్రువుగా చూడటం వసుంధరా దేవిని జీవితమంతా వెంటాడిన వేతనాభరితమైన అనుభవం.

వసుంధరా దేవి దక్షిణ భారతదేశపు తొలితరం సినీ నటి. శిక్షణ పొందిన భరతనాట్య నర్తకి, కర్ణాటక సంగీత గాయని. రోమన్‌ కాథలిక్‌ చర్చి పోప్‌ తో పరిచయం ఉన్న ఏకైక భారతీయ నటి వసుంధరా దేవి. ఆమె ప్రముఖ తెలుగు తమిళ హిందీ భాషల సినీ నటి వైజయంతిమాల తల్లి. వసుంధర ఎం.టి. రామన్‌ ను వివాహం చేసుకుంది. తరువాత విడాకులు తీసుకుంది. వసుంధరా దేవి కుమార్తె వైజయంతిమాల. ఆమె తల్లి వసుంధర దేవి దగ్గర కాకుండా, తండ్రి రామన్‌, అమ్మమ్మ యదుగిరి అమ్మాళ్‌ పెంపకంలో పెరిగింది. ఆ తరువాత ఆమె కుమార్తె కెరీర్‌కు కొంత మార్గ నిర్దేశం చేసినా, వైజయంతి మాల పూర్తిగా అమ్మమ్మ, తండ్రి ఆజమాయిషీలోనే పెరిగి పెద్దదయింది. ఆ తరువాత వసుంధరా దేవి, ఆమె కుమార్తె వైజయంతిమాల ‘పైగాం’, దాని తమిళ రీమేక్‌ ”ఇరుంబు తిరై” రెండు చిత్రాలలో కలిసి నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో వారిద్దరూ షార్ట్‌ పూర్తవుతూనే అపరిచితుల్లా ఎడమొహం పెడముఖంగా కూర్చునేవారు. మాట్లాడుకునే వారు కాదు. తల్లి కూతుళ్లుగా వసుంధర దేవి, వైజయంతి మాల ఇరువురు పరస్పరం దూరంగా, అపరిచితులుగా,ఏ బాధ్యతలు లేకుండా, అనుబంధాలకు దూరంగా ఎందుకు తమ జీవితాలను గడిపారో తెలుసుకోవాలంటే కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లాలి.

వసుంధరా దేవి తాత రామానుజ అయ్యంగార్‌ బ్రిటిష్‌ కాలంనాటి ఇంపీరియల్‌ బ్యాంకులో ఉద్యోగిగా ఉండేవాడు. వారు బ్రాహ్మణులైన ఈయన ఉద్యోగం చేయడం వలన బయట ప్రపంచంతో కాస్త సన్నిహిత సంబంధం కలిగి ఉండటం వల్ల రంగస్థలం పట్ల ఆసక్తిని ఏర్పరచుకున్నాడు. సంస్కత నాటకాలను ప్రదర్శించడం ప్రారంభించాడు. ఆయనకు ఒక్కటే కూతురు యదుగరి అమ్మాళ్‌. యాగమ్మ ఆమె ముద్దు పేరు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న యాగమ్మ తండ్రికి గారాల కూతురు. తన కూతురుకు సంగీత నాట్యాలను నేర్పించాడు. మరోవైపు ఎంఎల్‌ శ్రీనివాసన్‌ అనే రంగస్థలం ప్రేమికుడు స్వయంగా సుగుణ విలాస సభ అనే నాటక సంస్థను నడిపేవాడు. ఆయన నాటకాలు, సంగీత కచేరీలు ప్రదర్శించేవాడు. స్వయంగా నాటకాల్లో నటించేవాడు కూడా. ఈ శ్రీనివాసన్‌ నాటకాలను కాకుండా మైనర్‌ రాజామణి, విష్ణు లీల, బాలామణి, అదష్టం, శ్రీమతి పరిణయం వంటి తమిళ సినిమాల్లో చిన్న వేషాలు కూడా వేశాడు. నాటకాభిరుచి గల రామానుజం శ్రీనివాసన్‌ని అభిమానించి తన కూతురు యాగమ్మను ఇచ్చి పెళ్లి చేశాడు. ఇద్దరూ సంగీత, నాటకాలు పట్ల అభిరుచి ఉన్నవారు కనుక కలిసిమెలిసి జీవిస్తారు అనుకున్నాడు రామానుజం. కానీ శ్రీనివాసన్‌ పురుష ఆధిపత్యంతో యాగమ్మను బయటకు రానిచ్చేవాడు కాదు. పైగా ఇంట్లో గహింసకు పాల్పడి తీవ్రమైన భౌతిక దాడి జరిపేవాడు. శ్రీనివాసన్‌ తనకున్న నాటక అభివద్ధికి వెనక ముందు చూడకుండా విపరీతమైన డబ్బును ఖర్చు చేసేవాడు. దీంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఇవన్ని కలగలిసి గాలివాన ఒకటైనట్లు యాగమ్మ శ్రీనివాసన్‌ల మధ్య కలతలు మరింతగా పెరిగిపోయినవి. చివరికి శ్రీనివాసన్ను వదిలేసి యాగమ్మ పుట్టింటికి వచ్చేసింది. ఈ లోగానే ఆ దంపతులకు 1917 ఆగస్టు 16న ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకి వసుంధర దేవి అన్న పేరు పెట్టారు.
భర్తకు దూరమైన యాగమ్మ తన ఆశలన్నీ కూతురు వసుంధర మీదనే పెట్టుకున్నది. తను ఏదైతే సంగీత నాటకాలను ప్రదర్శించి పేరు తెచ్చుకోవాలనుకున్నదో ఆ ఖాళీని తన కూతురు వసుంధర రూపంలో భర్తీ చేసుకోవాలనుకున్నది. వసుంధరకు చిన్నతనం నుండే సంగీత నాట్యాలలో శిక్షణ ఇప్పించింది. వసుంధరను మంచి గాయనిగా తీర్చిదిద్దింది. అతిగారాబంతో, అత్యంత ప్రేమ వాత్సల్యాలతో పెరగడం వలన వసుంధర తన నాట్య, సంగీత కళల ఆధారంగా అత్యంత ఉన్నత స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఆమె ఆలోచన చూపులు అన్నీ కూడా ఎప్పుడూ పైపైకే ఉండేవి. బహుశా ఆమె ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సమస్యలకు ఈ ధోరణే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

యాగమ్మ తను అల్లారుముద్దుగా పెంచుకున్న వసుంధరా దేవికి నెమ్మదస్తుడైన ఎం.టి.రామన్‌తో పెళ్లి జరిపించింది. అయితే మళ్లీ చరిత్ర పునరావతమైనట్టు వసుంధర విషయంలో కూడా రామన్‌కు సరిపడలేదు. తల్లి అనుకున్నట్లుగా వీరి దాంపత్య జీవితం సజావుగా సాగలేదు. వసుంధర తన కళా ప్రతిభ ఆధారంగా ఉన్నత స్థాయికి వెంటవెంటనే ఎదగాలని పేరు ప్రఖ్యాతలు ఉన్న పెద్దవారి పక్కన నిలబడి ప్రచారంలో ఉండాలని నిరంతరం తపన పడేది. ఆమెలోని ఈ కీర్తి కాంక్షకు రామన్‌ అడ్డుకట్ట వేయలేకపోయేవాడు.
ఇవన్నీ ఇలా ఉండగా షైనింగ్‌ స్టార్‌ అన్న నాటక సమాజం వారు ప్రదర్శించిన ‘మీరా’ నాటకంలో వసుంధర దేవి మీరాగా నటించింది. ఆ నాటకాన్ని గ్రామ ఫోన్‌ రికార్డు కూడా ఇచ్చారు. అందులో కూడా మీరా పాత్రను వసుంధరనే పోషించింది. తమిళనాడులో ఈ రికార్డులు వేలకొద్దీ సంఖ్యలో అమ్ముడైంది. దీంతో ఒక్కసారిగా అందరి దష్టి వసుంధర దేవి వైపుకు మళ్ళింది. అయితే రామన్‌కు వసుంధర నాటకాలు వేయడం కచేరీలు ఇవ్వడం సుతారము ఇష్టం లేదు. కానీ తల్లి యాగమ్మ తన కూతురు వసుంధర పక్షమే వహించడంతో రామన్‌ నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. ఈ కలతలు అభిప్రాయ భేదాల నడుమనే వారికి 1936 ఆగస్టు 13న ఒక ఆడబిడ్డ పుట్టింది. ఆమెనే ఆ తర్వాత భారతదేశంలో పేరు ఎన్నికైన సినీ నాట్యతారగా పేరు ప్రతిష్టలు పొందిన వైజయంతి మాల. సరిగ్గా ఇక్కడే మళ్ళీ మరో కథ మొదలైంది.

అమ్మమ్మ యాగమ్మకు మనవరాలు వైజయంతి మాల అంటే పంచప్రాణాలు. వైజయంతికి అమ్మమ్మంటే చెప్పలేనంత ఇష్టం. ఆఖరికి అమ్మ కూడా అమ్మమ్మ తర్వాతనే అనేంతగా. బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా వసుంధర తన రంగస్థల నటన, సంగీత కచేరీలు చేయడం ఆపలేదు. 1939లో మద్రాసులో జరిగిన ఒక విద్వత్‌ సంగీత సభలో వసుంధరకు పాడే అవకాశం కలిగింది. ఆ కచేరీలో ఆమె పాట సభికులను తన్మయానందంలో ముంచెత్తింది. ఆ సభికులలో మైసూరు యువరాజు కూడా ఉన్నాడు. ఆయన తన సంస్థానానికి వచ్చి పాడవలసిందిగా వసుంధరను కోరాడు. వసుంధర కూడా కోరుకున్నది అదే కనుక వెంటనే అంగీకరించింది. మహారాజుల ఆహ్వానం ఆమెకు అందిన ద్రాక్ష అయింది. అనుకున్న ప్రకారం మైసూరు రాజావారి సమక్షంలో వసుంధర కచేరి చేసింది. అక్కడ ఆమెకు విశేషమైన ప్రశంసలు, సన్మానాలు లభించినవి. ఈ హంగులు ఆర్భాటాలు రామన్‌ కు నచ్చేవి కావు. కానీ వసుంధరకు రామన్‌ క్రమంగా కంటికి అనకుండా పోయాడు. ఇంతలో మైసూర్‌ యువరాజు చూపుతున్న అభిమానంతో ఆమె అతనికి మరింత దగ్గరయింది. ఆ తర్వాత ఆయన విదేశాలకు వెళుతూ తన వెంట వచ్చి అక్కడ కచేరీలు చేయవలసిందిగా వసుంధర బృందాన్ని తన వెంట తీసుకువెళ్లాడు. ఈ విదేశీ ప్రయాణాన్ని భర్త అంగీకరించడని ఆమెకు తెలుసు. కానీ యాగమ్మ జోక్యం చేసుకొని తమ వంటి మధ్య తరగతి వారికి ఇలాంటి అవకాశాలు అంది వచ్చినప్పుడు వాటిని అనుకూలంగా మార్చుకోవాలని రామన్‌ను ఒప్పించి ప్రయాణానికి సిద్ధం చేసింది. రామన్‌, వసుంధర, వైజయంతి, యాగమ్మ అందరూ యూరప్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ పోపు సమక్షంలో వసుంధర చేసిన కచేరి ఆమె కళా జీవితంలో ఒక మైలురాయిలుగా నిలిచిపోయింది. ఆ సందర్భంలో లండన్‌లోని డేన్హామ్‌ స్టూడియోలో ఆమె పాటలను రికార్డు చేశారు.
యూరప్‌ పర్యటనలో ఉన్నప్పుడే వసుంధరను చూసిన ఎవరో ఆమె అందానికి సినిమాల్లో గొప్పగా రాణిస్తుందని చెప్పడంతో హఠాత్తుగా వసుంధర ఆలోచనలు సినిమా రంగం వైపు మళ్ళినవి. కానీ ఎప్పటికీ కచేరీలు నాటకాలు అంటేనే అడ్డు చెప్పే భర్త సినిమాల్లో నటించడానికి అనుమతి ఇస్తాడని ఆమె అనుకోలేదు. నిజానికి అంతకుముందు ‘మీరా’ రికార్డు ఇచ్చిన సమయంలోనే ఆమెను సినిమాల్లో నటింపజేయాలని కొందరు ప్రయత్నాలు చేశారు. కానీ అప్పుడు అవి కార్యరూపం దాల్చలేదు. మళ్లీ సినిమా ప్రయత్నాలు చేయాలనుకున్నప్పుడు వసుంధరకు తల్లి యాగమ్మ ధైర్యం చెప్పి సినిమా అవకాశాలకు తలుపులు తెరిచింది. నిదానస్తుడైన రామన్‌ నోరు మెదపలేదు. అతనిది ప్రేక్షక పాత్రే అయ్యింది. అంతే ఆ తర్వాత వసుంధర సినీ జైతయాత్ర మొదలైంది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ తర్వాత వసుంధరా దేవి కళల సౌధాలు కలలై కరిగిపోయిన విషాదంత జీవనం వచ్చే వారం.
(వ్యాసకర్త సినీ చరిత్ర పరిశోధకులు)

– హెచ్‌ రమేష్‌ బాబు, 7780736386

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -