ఎడారీకరణకు ఎదురొడ్డి నిలిచి
సాంస్కృతీకరణను సమర్థంగా స్థిరపరచి
హరిత ఊపిరితిత్తుల ఆయువు పెంపొందించి
రాత్రీ పగలూ నిరంతరం ప్రాణవాయువునందించే
కోట్ల వయసుగల పర్యావరణ కోటలను
కొల్లగొట్టాలనే కుట్రలు పన్నుతున్నాయి
కబళించే కళలో ఆరితేరిన కబేళా కార్ఖానాలు!
జీవ వైవిధ్యానికి జీవంపోస్తూ
భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తూ
కాలుష్యాల్ని కావాల్సినంత కట్టడిచేస్తూ
వాతావరణాన్ని అనునిత్యం నియంత్రించే
ప్రాచీన ఆరావళి పర్వత పంక్తులను
వాతాపి జీర్ణమంటూ ఆరగించాలని
ఉవ్విళ్ళూరుతున్నాయి అధికారావృత అనకొండలు!
వ్యవసాయ భూములు మొదలుకొని
అన్నీ ఇచ్చే అడవులదాకా…
నీకిది నాకది అన్న చందాన! కార్పొరేట్లకు
అన్నింటినీ అప్పనంగా అప్పగిస్తున్న కాపాలికా గణాలు!
ఎప్పటికప్పుడు పాలకులను ప్రశ్నిస్తూ
అప్పుడప్పుడు న్యాయస్థానాలనూ నమ్ముకుంటూ
ప్రతీ కొండనూ గుట్టనూ నదీనదాల్నీ ప్రకృతినీ
ప్రజలే అప్రమత్తులై
పరిరక్షించుకోవాల్సిన ఆపన్న తరుణాలు!!
- కరిపె రాజ్ కుమార్, 8125144729


