మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
నవతెలంగాణ – భూపాలపల్లి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఉపాధిని దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన ఇలాంటి పథకం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు.
పేద, బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా ఇస్తూ, నిరుద్యోగులకు సైతం ఉపాధి కల్పించిందన్నారు. ప్రతి పేదవాడికి కడుపు నింపాలని ఉద్దేశంతో స్వాతంత్ర్యం కోసం శాంతియుతంగా పోరాడిన గాంధీజీ పేరున ఈ స్కీం కొనసాగిందన్నారు. గాంధీ పేరును తొలగించి ఆయన ప్రతిష్ఠను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు నిరంకుశ వైఖరి ప్రదర్శిస్తుమారని విమర్శించారు. రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
2029 ఎన్నికల్లో రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఈ పథకాన్ని మరల పునరుద్ధరిస్తామని పరస వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని యెడల పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాను చాటేలా, ప్రతీ ఒక్క కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే భూపాలపల్లిని మొదటి స్థానంలో ఉంచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు.
రోజుకు 18 గంటలు పని చేస్తూ ప్రజల మధ్యనే ఉంటూ అనేక నిధులతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల ముందు అసలు హామీ ఇవ్వని భూపాలపల్లికి ఔటర్ రింగ్ రోడ్డు, చెల్పూర్ నుండి గుడెప్పాడు వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ, భూపాలపల్లి పట్టణంలో వెజ్ మార్కెట్, ఇండోర్ స్టేడియం, రేగొండ మండలంలో కొడవటంచ, బుగులోని జాతర, అభివృద్ధికి నిధులు తేవడం జరిగిందని తెలిపారు. తమ ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఇలా అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే మాత్రం దొంగే.. దొంగ అన్నట్టు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ రెండేళ్ల కాలంలో భూపాలపల్లి మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజల అవసరాలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే మన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
గత పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు వంటి అంశాల్లో సాధించిన పురోగతిని ప్రజలకు వివరించాలన్నారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ముందుకువెళ్లాలని సూచించారు. క్రమశిక్షణ, ఐక్యతతో ముందుకెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు చల్లూరి మధు, జిల్లా అధికార ప్రతినిధి జంపయ్య,ఆయా మండలాల అధ్యక్షులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు,మహిళా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



