Sunday, September 21, 2025
E-PAPER
Homeసోపతి'స్నేహితుల కథలు' చెప్పిన వేల్పుల శ్రీలత

‘స్నేహితుల కథలు’ చెప్పిన వేల్పుల శ్రీలత

- Advertisement -

పిల్లలు పిల్లల కోసం రాయడం అనే కొత్త విప్లవం సిరిసిల్ల మానేరు తీరం నుంచి ఆదిలాబాద్‌ గోదావరి వరకు, మూసీ తీరం నుండి దుందుభి ఒడి వరకు, అక్కడి నుండి తుంగభద్రా నది వరకు, సిద్ధిపేట కోమటి చెరువు నుండి పాకాల మహా సముద్రం వరకు… తేజో దీపమై వెలుగులను విరజిమ్ముతోంది. తమ బాధలు, ఆలోచనలు, కోరికలు, కలలు, ఇంకా చెప్పాలంటే కన్నీళ్ళు… బాధలు అన్నింటిని ఈ బాల రచయితలు రచనల డాక్యుమెంట్లుగా మలుస్తున్నారు. అటువంటివి వందల రంగురంగుల ‘సింగిడి’లను తెలంగాణ నేల మీద మనం ఒక్కచోట చూస్తున్నాం. ఈ శీర్షికలో ఆ రంగుల వెలుగుల చిన్నారుల్ని ఎత్తుకుని ముద్దాడాం.. దీవనార్తులు ఇచ్చాం.

ఇగో ఇవ్వాళ్ళటి ఈ ముచ్చట కూడా అటువంటిదే…. ఆరు ఏడు తరగతుల నుంచే పెన్ను పట్టుకుని రాస్తున్న బాల రచయిత్రి చిరంజీవి వేల్పుల శ్రీలత. శ్రీలత నేటి పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలానికి చెందింది. బొట్లవనపర్తి గ్రామంలో 29 జులై, 2009 న పుట్టింది. శ్రీమతి వేల్పుల శారద రాజేశం ఈమె తల్లితండ్రులు. తెలుగు ఉపాధ్యాయుడు కందుకూరి భాస్కర్‌ ప్రేరణతో రచనా రంగంలోకి అడుగుపెట్టిన ఆమె వివిధ పత్రికల కోసం రచనలు చేసి, అనేక పోటీల్లో బహుమతులు గెలుచుకుంది. ఇటు గేయాలు, కవితలతో పాటు కథలు, చిట్టి పొట్టి వ్యాసాలను రాసింది. 2023 లో బాలల దినోత్సవం సందర్భంగా అక్షరయాన్‌ నిర్వహించిన కవితల పోటీలో రెండవ బహుమతి అందుకుంది. అదే సంవత్సరం సిద్ధిపేటలోని పెందోట బాల సాహిత్య పీఠం అవార్డు, ఖమ్మంకు చెందిన వురిమళ్ళ ఫౌండేషన్‌ వారి జాతీయ స్థాయి పుస్తక సమీక్ష పోటీలో గరిపెల్లి అశోక్‌ బాలల కథా చిత్రాలు ‘ఎంకటి కతలు’ పుస్తకాన్ని సమీక్షచేసి ఉత్తమ సమీక్ష పురస్కారం అందుకుంది. సైన్స్‌ డే సందర్భంగా లలితమ్మ పిల్లల లోకం నిర్వహించిన లీలావతి దవే సైన్స్‌ ఫిక్షన్‌ కథల పోటీలో బాలల విభాగంలో ‘ఆలోచన’ కథకు ఉత్తమ కథా బహుమతి అందుకుంది. ఇంకా గడుగ్గారు పత్రిక సంక్రాంతి పోటీల్లో బహుమతితో పాటు స్థానికంగా అనేక సంస్థలు, సాహిత్య సంస్థల బహుమతులతో పాటు సాహితీవేత్తల ఆశీర్వాదాలు అందుకుంది వేల్పుల శ్రీలత.

‘చిన్ననాటి నా బాల్యం/ చిరునవ్వుల జ్ఞాపకం/ బుజ్జిబుజ్జి ఆటలతో/ మురిపించే నా బాల్యం/ అమ్మ అనురాగంతో/ నాన్న అనుబంధంతో/ సంతోషాన్నిచ్చిన నా బాల్యం/ కష్టసుఖాలెన్నున్నా/ కలత పడలేదు నా బాల్యం/ మైదానంలో కేరింతలు కొడుతూ/ బడిలోన చక్కని చదువులతో/ మదిని పులకరింపజేసే నా బాల్యం/ కొమ్మకు పూసే చిగురులా/ చందమామ పంచే వెన్నెల/ మరువలేనిది నా బాల్యం’ అంటూ మరువలేని, మరుపురాని అనందాల బాల్యాన్ని అద్భుతంగా కవిత్వం చేసిందీ చిన్నారి కవయిత్రి. ఇదే కోవలో చక్కని వ్యాసాలు రాసింది. పుస్తక సమీక్షలూ చేసింది.
కథలను ఎక్కువగా రాసింది శ్రీలత. ఈ కథలన్నీ వివిధ పత్రికల్లో అచ్చవడంతో పాటు వీటిని ‘నిజమైన స్నేహితులు’ పిల్లల కథా సంపుటిగా వదాన్యులు ఏనుగు దయాకర్‌ రెడ్డి సహకారంతో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, నర్సింహులపల్లి ఉపాధ్యాయ, యాజమాన్య బృందం పుస్తకంగా తెచ్చింది. ఇందులో పన్నెండు కథలున్నాయి. ఒక్కో కథ ఒక్కో కొత్త విషయాన్ని, అంశాన్ని చర్చించడం ఈ బాల రచయిత్రి విస్తార అవగాహనకు ఆనవాళ్ళుగా చూడవచ్చు. నాకు తెలిసి ఈ కథలన్నీ చదువుతుంటే ఇందులోని సంఘటనలు, వ్యక్తులు బహుశా శ్రీలత చుట్టుపక్కల వాళ్ళు, కుటుంబ సభ్యులు కావచ్చేమో అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు తన స్వీయానుభవాలు కూడా అయివుండొచ్చు. ‘స్నేహితురాలి సలహా’ కథ లోని అమ్మానాన్నలను కోల్పోయిన రాణి పక్కవారి మాటలకు బాధపడగా, దోస్తు మాటలు ప్రేరణ కలిగిస్తాయి.

చివరకు ట్రిపుల్‌ ఐటి లో సీటు సాధిస్తుంది. ఇది ఒక గెలుపు కథ. స్ఫూర్తి కథ. ఇలాంటివే కదా రేపటి తరానికి మనం చెప్పాల్సింది. పక్షులు, జంతువులను ఇంకా మనం మన రచనల్లో చందమామలో ఉపయోగించిన పద్ధతిలో రాయడం చూస్తున్నాం. అయితే వీటికి భిన్నంగా ఈ చిన్నారి రచయిత్రి ‘పక్షుల సాయం’ కథలో కొద్దిగా కొత్తగా చిత్రించే ప్రయత్నం చేసింది. కొందరు దొంగలు ఊర్లోకి వస్తారు, ఈ విషయాన్ని పక్షులు గమనిస్తాయి..వెంటనే ఇండ్ల తలపులను తడుతూ ఊరి వారిని లేపుతాయి. దొంగలు పారిపోతారు… బాగుంది కదూ! ఆడ, మగపిల్లల విషయంలో తోబుట్టువుల మధ్య తల్లితండ్రులు చూపించే వ్యత్యాసాలు చూస్తున్నాం, చదువుతున్నాం… అటువంటి తేడాలను జయించి నిలిచిన విజేత ‘బుజ్జి’ కథ ‘ఆడపిల్ల’. ఇందులోని బుజ్జి వీటన్నింటిని అధిగమించి గెలుస్తుంది. ఐకమత్యం కథ కుక్కలన్నీ కలిసి ఒక చెడుకుక్కపై పోరాటం చేయడం చెప్పే కథ. ఇందులో కొద్దిగా హింస ఉన్నప్పటికీ కథ బాగుంది. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛభారత్‌ అవగాహన పిల్లలకు బాగా పెరిగింది. బడిలో, ఇంట్లో మొక్కలు నాటడం వంటివి మనం చూస్తున్నాం. వైజ్ఞానికాంశాలను జతచేసి చక్కగా చెప్పిన కథ ‘పరిసరాల పరిశుభ్రత’. తన ఆలోచనలకు చక్కని వైజ్ఞానికాంశాలను జోడిస్తున్న శ్రీలత భవిష్యత్తులో వైజ్ఞానిక స్పృహ కలిగిన రచనలు చేసే రచయిత్రిగా ఎదగాలని ఆశీస్తూ… ఆశీరభినందనలు.

డా|| పత్తిపాక మోహన్‌
9966229548

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -