Wednesday, January 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅమెరికా పెత్తనం కోసం కేంద్ర బిందువుగా వెనిజులా

అమెరికా పెత్తనం కోసం కేంద్ర బిందువుగా వెనిజులా

- Advertisement -

ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా ‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’
అమెరికా పట్ల ‘నాటో’ దేశాల్లో భిన్నాభిప్రాయాలు
మదురో అరెస్టుకు నిరసనగా అమెరికా వంద నగరాల్లో నిరసనలు
అమెరికా ‘నేషనల్‌ ఢిఫెన్స్‌ స్ట్రాటజీ’ అత్యంత ప్రమాదకరం
రష్యా, చైనా దేశాలతో భారత్‌కు ఉన్న సంబంధాలను దెబ్బకొట్టాలనేది అమెరికా వ్యూహం
వెనిజులా పరిణామాల విషయంలో భారత్‌ ఒంటరైంది : ఎస్‌వీకే వెబినార్‌లో
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌ అరుణ్‌కుమార్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

అమెరికా దేశాన్ని ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్నప్పటికీ ఆ దేశం ఇతర దేశాలపై పెత్తనాన్ని కొనసాగిస్తున్నదని సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌ ఆరుణ్‌కుమార్‌ విమర్శించారు. అమెరికా తన పెత్తనం కోసం వెనిజులాను కేంద్ర బిందువుగా మార్చుకుంటోందని తెలిపారు. ఆ దేశానికి అతి సమీపంలో ఉన్న వెనిజులా ఆర్థిక వనరులపై కన్నెసిందని గుర్తు చేశారు. అయినా దేశ ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా నిలబడుతున్నారని చెప్పారు. అమెరికా ఆర్థిక, రాజకీయ, మిలటరీ రంగాల్లో బలాన్ని కోల్పోతోందన్నారు. అందుకే తన ఉనికిని కాపాడుకు నేందుకు వెనుజులా అధ్యక్షులు మదురోను కిడ్నాప్‌ చేసి అరెస్టు చేసిందని గుర్తు చేశారు. మరోవైపు ఐక్యరాజ్య సమితిలో తమ మాట నెగ్గడం లేదన్న కారణంగా దానికి ప్రత్యామ్నాయంగా ‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’ను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. గాజాలో శాంతి స్థాపన కోసం బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌ను ఏర్పాటు చేసినా ట్రంపు దానికి శాశ్వత అధ్యక్షులుగా వ్యవహరించనున్నారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్‌వీకే) ఆధ్యరంలో ‘ట్రంప్‌ చేష్టలు…పర్యవసానాలు’ అనే అంశంపై వెబినార్‌ జరిగింది. ఎస్‌వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ సమన్వయ పరిచారు. ఈ సందర్భంగా అరుణ్‌ మాట్లాడుతూ ఇటీవల అమెరికా తీసుకొచ్చిన’ నేషనల్‌ ఢిపెన్స్‌ స్ట్రాటజీ’ అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఏక ధృవప్రపంచమే కానీ బహుళ ధృవప్రపంచాన్ని సహించే స్థితిలో అమెరికా లేదని చెప్పారు. ఇప్పటిదాకా నాటోను పెంచి పోషించిన అమెరికా.. ఆ బాధ్యత నుంచి తప్పించుకుని, ఆయా దేశాల బడ్జెట్‌లోనాటోకు ఐదు శాతం కేటాయించాలని కోరిందన్నారు. ఫలితంగా నాటో దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. అయినా నాటో బలహీనపడిందనుకోలేమని స్పష్టం చేశారు. ఆ సైనిక దళాలతో అనేక దేశాలపై అమెరికా దాడులు చేసిందని విమర్శించారు. మరోవైపు అనేక దేశాలపై అమెరికా టారీఫ్‌ పెంచుతూ భయపెడుతున్నదని చెప్పారు. అయినప్పటికీ చైనా దీటుగా అమెరికా ఎదుర్కొందని గుర్తు చేశారు. రష్యా, చైనా దేశాలతో చాలా దేశాలు సంబంధాలు కొనసాగిం చకూడదని అమెరికా హుకుం జారీ చేస్తోందన్నారు. తద్వారా కమ్యూనిస్టు దేశాలను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నదని విమర్శించారు. అందులో భాగంగా క్యూబా, వెనిజులా వంటి దేశాలపై ఆర్థిక ఆంక్షలను కొనసాగిస్తున్నదని చెప్పారు. తమ ఆంక్షలకు లొంగడం లేదనే కారణంగా ఏకంగా ఆ దేశాధ్యక్షున్ని అరెస్టు చేసి తన దేశానికి తీసుకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోందన్నారు. ఈ విషయంలో భారత దేశం స్పందించిన తీరు బాగా లేదని చెప్పారు. అలీనోద్యమ పూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. ఫలితంగా ప్రపంచ దేశాలల్లో భారత్‌ ఒంటరిపాలైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -