విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మరణ వార్త నుంచి తేరుకునేలోపే చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.
లేడీ సూపర్‌స్టార్‌గా భారతీయ సినీ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయాన్ని సృష్టించిన బి.సరోజాదేవి (87) కన్నుమూశారు. బెెంగుళూరులో గల మల్లేశ్వరంలోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు.
ఏడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషా చిత్రాల్లో కథానాయికగా నటించి అభినయ సరస్వతిగా పేరొందారు.
బెంగుళూరులోని వక్కాలిగ గ్రామంలో జనవరి 7, 1938న బి.సరోజాదేవి జన్మించారు. తండ్రి భైరప్ప, తల్లి రుద్రమ్మ. వృత్తిరీత్యా తండ్రి పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ ప్రవృత్తిరీత్యా ఆయన స్టేజీ ఆర్టిస్ట్. కళ మీద అభిమానంతోనే తన కూతురు సరోజకి నృత్యం, గానంలో తర్ఫీదు ఇప్పించారు.
13 ఏళ్ళ వయసులో ఓ స్టేజీ మీద సరోజ పాడటాన్ని చూసిన కన్నడ దర్శకుడు బి.ఆర్.కృష్ణమూర్తి సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే ఆ అవకాశాన్ని సరోజ సున్నితంగా తిరస్కరించారు. తరువాత తల్లితండ్రుల ప్రోత్సాహంతో 1955లో ‘మహాకవి కాళిదాస’ కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలి సినిమానే విశేష ప్రేక్షకాదరణ పొంది ఘన విజయాన్ని సాధించింది. అంతేకాదు ఈ సినిమా జాతీయ ఉత్తమ చలన చిత్రంగానూ ఎంపికైంది.
1957లో బి.ఆర్.పంతులు తమిళంలో తెరకెక్కించిన ‘తంగమలై రహస్యం’ చిత్రంలో నటించింది. ఈ సినిమాలోని ఆమె నటనను గమనించిన కథానాయకుడు ఏంజీఆర్ (ఎం.జీ.రామచంద్రన్) తన ‘నాదోడి మన్నన్’ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశమిచ్చారు. ఈ సినిమా కూడా అద్భుత విజయం సాధించడంతో తమిళనాట సరోజ పేరు మారుమోగి పోయింది.
ఈ తరుణంలోనే ఆమెకు బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. దిలీప్‌కుమార్ సరసన ‘పైగమ్’ (1959)లో నటించింది. అలాగే రాజేంద్రకుమార్‌తో ‘ససురాల్’ (1961), సునీల్‌దత్‌తో ‘బేటీ బేటే’ (1964), షమ్మీకపూర్‌తో ‘ప్యార్‌కియాతో డర్నా క్యా’ (1963), అలాగే రాజ్‌కపూర్ నటించిన ‘నజరానా’ (1968)లోనూ సరోజ నటించారు. అయితే కొంత చిత్రీకరణ జరిగిన తరువాత దర్శకుడు సి.వి.శ్రీధర్‌తో వచ్చిన క్రియేటీవ్ డిఫరెన్సెన్స్ వల్ల ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చారు.
కన్నడ, తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తున్న క్రమంలోనే తెలుగులో సరోజాదేవికి ‘పెళ్ళిసందడి’ (1959)లో నటించే ఛాన్స్ వచ్చింది. దీనికంటే ముందు ఎన్టీఆర్ నటించి, నిర్మించిన ‘పాండురంగ మహత్యం’ విడుదలై తెలుగనాట ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది.
ఎన్టీఆర్, ఏయన్నార్, రాజ్‌కుమార్, ఏంజీఆర్, జెమినీ గణేశన్, శివాజీ గణేశన్, దిలీప్‌కుమార్, సునీత్‌దత్, షమ్మీకపూర్, రాజ్‌కపూర్.. వంటి తదితర హేమాహేమీల సరసన నటించి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నారు.
నాలుగు భాషల్లో అగ్రనటిగా అత్యధిక పారితోషికాన్ని అందుకున్నారు. అంతేకాదు 1955 నుంచి 1984 వరకు (29 ఏళ్లు) వరుసగా నాలుగు భాషల్లో 161 సినిమాల్లో నటించిన ఏకైక కథానాయికగా రికార్డ్ క్రియేట్ చేశారు.
అలాగే ఏంజీఆర్ సరసన 26 సినిమాల్లోను, శివాజీ గణేశన్‌కి జోడీగా 22 సినిమాల్లోను, జెమినీ గణేశన్ సరసన 17 చిత్రాల్లోనూ నటించడం ఓ విశేషమైతే, ఎన్టీఆర్ సరసన 20 చిత్రాల్లో నటించడం మరో విశేషం. అగ్ర కథానాయకుల సరసన అత్యధిక చిత్రాలు నటించిన ఘనత కూడా సరోజాదేవిదే కావడం మరో విశేషం.
సరోజాదేవి నటనకే కాదు ఆమె ధరించే చీరలు, పెట్టుకునే ఆభరణాలకూ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఫ్యాషన్ ఐకాన్‌గానూ రోల్ మోడల్‌గా నిలిచారు. పాత్ర ఏదైనా సరే దానికి తన నటనతో జీవం పోయటం సరోజాదేవి ప్రత్యేకత. అందం, అభినయం, ఆహార్యం, వాక్‌చాతుర్యంతో మంత్రముగ్దుల్ని చేశారు. అందుకే ఆమెను అభినయ సరస్వతి బిరుదు వరించింది.
1967లో ఇంజనీర్ శ్రీహర్షను వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత కూడా భర్త ప్రోత్సాహంతో పలు సినిమాల్లో నటించారు. అయితే భర్త మరణానంతరం ఆమె చాలా కాలం సినిమాలకు దూరమయ్యారు. తన మేనకోడలు భువనేశ్వరిని దత్తత తీసుకున్నారు. ఆమె అతి చిన్న వయసులోనే మరణించింది. ఆమె జ్ఞాపకార్థంగా లిటరేచర్‌లో ప్రతిభావంతులకు ఆమె పేరుతో అవార్డులను అందజేశారు.
సరోజాదేవి అసమాన నటనకు 2008 జాతీయ చలన చిత్ర పురస్కారాలలో లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డుతోపాటు లెక్కలేనన్ని స్టేట్ అవార్డులను అందుకున్న సరోజాదేవి 45వ (1998), 53వ (2005) జాతీయ చలన చిత్ర పురస్కారాలకు జ్యూరీ చైర్మన్‌గా వ్యవహరించారు. అలాగే కన్నడ ఫిల్మ్ డెెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి చైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.
తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో కలిపి 200 చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిన సరోజాదేవిని కేంద్ర ప్రభుత్వం 1969లో పద్మశ్రీతో, 1992లో పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలతో సము చితంగా గౌరవించింది. అలాగే భారతీయ విద్యాభవన్ సంస్థ బి.సరోజా దేవి పేరుతో కళల్లో రాణించిన వారికి లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ పురస్కారాన్ని ప్రతి ఏటా అందజేయటం విశేషం. అక్కినేని నాగేశ్వరరావుతో నటించిన ‘ఆత్మబలం’ చిత్రంలోని ‘చిటపట చినుకులు పడుతుంటే’.. పాట సరోజాదేవికి ఎంతో ఇష్టం.తెలుగులో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘అశోక సామ్రాట్’ చివరి చిత్రమైతే, కన్నడలో ‘నటసార్వభౌమ’ (2021) ఆమె ఆఖరి చిత్రం.
‘పాండురంగ మహత్యం’, ‘భూకైలాస్’, ‘పెళ్ళిసందడి’, ‘పెళ్ళి కానుక’, ‘ఇంటికి దీపం ఇల్లాలు’, ‘జగదేక వీరుని కథ’, ‘శ్రీ సీతారామ కళ్యాణం’, ‘మంచి చెడు’, ‘శ్రీకృష్ణాంజన యుద్ధం’, ‘దాగుడు మూతలు’, ‘ఆత్మబలం’, ‘అమరశిల్పి జక్కన్న’, ‘ప్రమీలార్జునీయం’, ‘శకుంతల’, ‘రహస్యం’, ‘భాగ్యచక్రం’, ‘ఉమాచండీ గౌరీశంకరుల కథ’, ‘విజయం మనదే’, ‘మాయని మమత’, ‘పండంటి కాపురం’, ‘మాతృమూర్తి’, ‘మనుషుల్లో దేవుడు’, ‘శ్రీరామాంజనేయ యుద్ధం’, ‘సీతారామ వనవాసం’, ‘ధానవీర శూరకర్ణ’, ‘నిరీక్షణ’, ‘అల్లుడుదిద్దిన కాపురం’, ‘సామ్రాట్ అశోక’ వంటి తదితర చిత్రాల్లోని భిన్న పాత్రలతో తెలుగునాట ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
అభినయ సరస్వతి
అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన బి.సరోజాదేవి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
సరోజాదేవి నన్ను ఎప్పుడు చూసినా ప్రేమగా పలకరించేవారు. నాకు తల్లితో సమానం. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమెతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె ఇక లేరనే వార్త విన్నప్పట్నుంచి కన్నీరు ఆగడం లేదు. నేను మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకున్న మా అమ్మకు బాధాతప్ప హృదయంతో వీడ్కోలు పలుకుతున్నాను. – కమల్‌హాసన్
దక్షిణ భారత సినీ పరిశ్రమలో ధృవతారగా వెలిగిన పద్మభూషణ్ సరోజాదేవి మరణ వార్త అత్యంత బాధాకరం. అప్పట్లో తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్, కన్నడలో రాజ్‌కుమార్‌లతో ఏకకాలంలో హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ సరోజాదేవి. మా నాన్న ఎన్టీఆర్ కాంబినేషన్‌లో 20 సంవత్సరాల కాలంలో దాదాపు 20 చిత్రాల్లో కథానాయికగా నటించారు. ఆయనతో శ్రీరాముడి పక్కన సీతాదేవిగా, రావణాసురుడి పక్కన మండోదరిగానూ నటించిన ప్రత్యేకత ఆమె సొంతం. సరోజాదేవి జీవితం రాబోయే తరాల వారికి స్ఫూర్తి. – బాలకృష్ణ
సరోజాదేవి కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. 1955 నుంచి తెలుగు, కన్నడ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి చిత్ర సీమపై తనదైన ముద్ర వేశారు. ‘భూకైలాస్’, ‘పాండురంగ మహత్యం’, ‘సీతారామ కళ్యాణం’, ‘జగదేకవీరుని కథ’, ‘శకుంతల’, ‘దానవీరశూరకర్ణ’, ‘ఆత్మబలం’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. – పవన్‌కళ్యాణ్
సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసింది. దక్షిణాదిలో ఇంకొకరు సొంతం చేసుకోలేని ఘనతను సరోజాదేవి సొంతం చేసుకున్నారు.
– ఖుష్బూ
‘నిర్మాత హోనప్ప సరోజాదేవీని పాటల పోటీ కోసం ఎంపిక చేశారు. కానీ ఆమెను చూశాక ‘మహాకవి కాళిదాస’ చిత్రంలో నటించే అవకాశ మిచ్చారు. ఆ సినిమాతో మొదలైన ఆమె సినీ ప్రస్థానం అన్ని తరాలకు స్ఫూర్తినిస్తుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోని అగ్ర హీరోల సరసన మెరిసి, అఖండ విజయాల్ని సాధించింది. సేవతో తనలోని మంచి మనసునూ చాటుకుంది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అందించింది. ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ బాధితుల్ని ఆదు కునేందుకు తనవంతు సాయం చేసిన సరోజాదేవి ఇకలేరనేది బాధాకరం. భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు’ అని తెలంగాణ ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, అధ్యక్షులు ఆనంద్ సంతాపం వ్యక్తం చేశారు.
అలనాటి మేటి నటి బి.సరోజాదేవి కన్నుమూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES