Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫార్ములా- రేస్‌ కేసులో ఏసీబీకి విజిలెన్స్‌ రిపోర్టు

ఫార్ములా- రేస్‌ కేసులో ఏసీబీకి విజిలెన్స్‌ రిపోర్టు

- Advertisement -

1,2 రోజుల్లో ప్రభుత్వం వద్దకు నివేదిక

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్‌
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఫార్ములా-ఈ వన్‌ కారు రేస్‌ కేసులో నిందితులకు సంబంధించిన నివేదికను రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నుంచి విజిలెన్స్‌ కమిషన్‌కు నివేదిక చేరింది. ఈ నివేదికను క్షుణ్నంగా పరిశీలిస్తున్న విజిలెన్సు కమిషన్‌. దీనిపై తదుపరి న్యాయపరమైన చర్యలకు సంబంధించి ప్రభుత్వ అనుమతిని కోరనుంది. సాధారణంగా ఐఏఎస్‌లు, తత్సమాన హోదా కలిగిన అధికారులతోపాటు ఏదేనీ కేసులో ప్రజా ప్రతినిధుల హస్తముందని తేలితే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవటానికి విజిలెన్స్‌ కమిషన్‌కు ఏసీబీ నివేదికను పంపుతారు. దానిపై సమగ్రంగా పరిశీలన జరిపి, ప్రభుత్వానికి తదుపరి చర్యల కోసం విజిలెన్స్‌ తన నివేదికను అందజేస్తుంది. ఆపై ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు ఏసీబీ కోర్టులో ప్రాసిక్యూషన్‌ ప్రక్రియను చేపడుతుంది. ఫార్ములా-ఈ కారు రేస్‌ కేసులో దాదాపు రూ.54 కోట్ల మేర నిధుల మార్పిడి అక్రమంగా జరిగిందనీ, దానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అనుమతులు కానీ, రిజర్వ్‌ బ్యాంకు నుంచి ముందస్తు అనుమతులు గానీ తీసుకోకుండా అప్పటి మున్సిపల్‌ వ్యవహారాల శాఖ మంత్రి కేటీ రామారావు, హెచ్‌ఎండీఏ అప్పటి మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్వింద్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఆ నిధులను విదేశీ కంపెనీకి తరలించటంపై నిబంధనలను అతిక్రమించారంటూ ఏసీబీ తన నివేదికలో పేర్కొంది.

ముఖ్యంగా విదేశీ మారకద్రవ్యాన్ని ఇందుకు వినియోగించారని కూడా తెలిపింది. దీనిపై సమగ్ర విచారణ జరిపిన ఏసీబీ కేటీ రామారావును ప్రధాన నిందితుడిగా, అర్వింద్‌ కుమార్‌ను రెండో ముద్దాయిగా, బీఎల్‌ఎన్‌ రెడ్డిని మూడో ముద్దాయిగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయడమేగాక ఈ ముగ్గురినీ విచారించింది. దీనిపై అన్ని ఆధారాలనూ సేకరించి, నిందితులను ప్రాసిక్యూషన్‌ చేయటానికి అనుమతిని కోరుతూ ఏసీబీ, విజిలెన్స్‌ కమిషన్‌కు నివేదికను పంపించింది. దీనిపై విజిలెన్స్‌ కమిషన్‌ ఉన్నతాధికారులు క్షుణ్నంగా పరిశీలన జరుపుతున్నారు. తదుపరి చర్యల కోసం ఒకట్రెండు రోజుల్లో సీఎం కార్యాలయానికి కమిషన్‌ తన రిపోర్టును పంపించనుందని తెలిసింది. అదే సమయంలో కేటీ రామారావుపై గవర్నర్‌కు ఒక నివేదికను ప్రభుత్వం పంపించనుంది. కేటీ రామారావును ప్రాసిక్యూట్‌ చేయటానికి అనుమతిని తీసుకోనున్నారని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -